ఎయిర్‌ ట్యాంకర్‌ పేలి..ఇరువురికి గాయాలు | Air Tanker Explosion..Two Injured | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ట్యాంకర్‌ పేలి..ఇరువురికి గాయాలు

Published Fri, Jun 1 2018 12:45 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Air Tanker Explosion..Two Injured - Sakshi

రాజాం సిటీ : గ్యాస్‌ సిలిండర్లు.. గ్యాస్‌ ట్యాంకర్లు పేలడం విన్నాం. కానీ వాహనాల టైర్లకు గాలిని పెట్టేందుకు వినియోగించే ట్యాంకర్‌ కూడా పేలింది. ఈ సంఘటన రాజాంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రాజాంలోని పాలకొండ రోడ్డు సీతారామ థియేటర్‌ సమీపంలో వాహనాలకు పంక్చర్లు, గాలికొట్టే షాపు ఉంది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో షాపులో ఉన్న ఎయిర్‌ ట్యాంకర్‌ పెద్దశబ్దంతో పేలిపోయి సుమారు 30 అడుగుల దూరంలో రోడ్డుపై పడింది.

దీంతో ఏమి జరిగిందో తెలియక షాపు వద్ద ఉన్నవారు, రోడ్డుపై వెళ్తున్నవారు ఆందోళన చెందారు. భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనలో షాపు వద్ద ఉన్న బీహార్‌కు చెందిన జుగున్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ఇతని రెండు చేతులు పూర్తిగా తెగిపోయి నుజ్జునుజ్జు అయ్యాయి. అలాగే ట్యాంకర్‌ ఎగిరి పడడంతో రోడ్డుపై వెళ్తున్న వంగర మండలం జగన్నాథవలస గ్రామానికి చెందిన పి.ఏసుబాబుకు తగలడంతో కాలుకి గాయమైంది.

 తీవ్రంగా గాయపడిన జుగున్‌ను 108 వాహనంలో రాజాంలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అలాగే కాలుకి గాయమైన ఏసుబాబును రాజాం సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

– బతుకు తెరువుకు వచ్చి..

బీహార్‌ నుంచి బతుకు తెరువు కోసం రాజాం వచ్చిన జుగున్‌ స్థానికంగా మార్బుల్స్‌ అమర్చే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  ఖాళీ సమయాల్లో పరిచయం ఉన్న పంక్చర్లు వేసే షాపు వద్దకు వచ్చి సంబంధిత యజమానితో సరదాగా మాట్లాడుతుండేవాడు.

గురువారం కూడా షాపు వద్ద కూర్చొని మాట్లాడుకుంటుండగా ట్యాంకర్‌ పేలింది. ఈ ప్రమాదంలో అతని రెండు చేతులు పూర్తిగా దెబ్బతినడం స్థానికులను కలచి వేసింది. ప్రమాద సమయంలో జనసంచారం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement