నవాబుల నగరంలో రాజాఫలం రుచులు!
లక్నో: నవాబుల నగరంగా పిలిచే లక్నో... పర్యాటకులకు సరికొత్త రుచులను పరిచయం చేయనుంది. రాజఫలంగా పిలిచే మామిడిని, ఘుమఘుమలాడే బిర్యానీతో జోడించి ఆమ్ బిర్యానీ పేరుతో చేసిన సరికొత్త వంటకాన్ని మెనూలో చేర్చనున్నారు. అంతేనా... ముర్గ్ ఆమ్, ఆమ్ ముర్గ్ కుర్మా వంటి పేర్లతో పసందైన రుచుల్లో కోడికూర కూడా అతిథులకు అందించనున్నారు. ఈ నెల 7వ తేదీన ఉత్తరప్రదేశ్ పర్యాటకశాఖ నిర్వహిస్తున్న మ్యాంగో ఫెస్టివల్లో ఈ రుచులను పరిచయం చేస్తున్నారు.
మూడు రోజులపాటు జరిగే ఈ ఫెస్టివల్‌కు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల నుంచి భోజన ప్రియులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కొత్త రుచులను పరిచయం చేస్తున్నామని యూపీ పర్యాటకశాఖ కార్యదర్శి అవనీశ్ కుమార్ తెలిపారు. ఆమ్ మలాయ్ టిక్కా, ఆమ్ షాహీ పనీర్, ఆమ్ కలేజీ వంటి మరిన్ని వంటకాలను కూడా ఈ ఫెస్టివల్ మెనూలో చేరుస్తున్నామని చెప్పారు. ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యేవారికి మరపురాని మధుర స్మృతులను మిగల్చడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. మొఘలాయీ వంటకాల రుచికి పెట్టింది పేరైన లక్నోలో ఈ కొత్త రుచులను పరిచయం చేయడం ఇదే తొలిసారని కుమార్ తెలిపారు.