భూ దందా!
⇒ పేదల భూముల చుట్టూ ఓ ఉన్నతాధికారి ‘చక్ర’బంధం
⇒ ‘అనంతసాగర్’లో కేర్ టేకర్ పేరుతో దళారీకి కబ్జా బాధ్యతలు
⇒ బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో 300 ఎకరాల విక్రయం
⇒ అమ్మకానికి సిద్ధంగా మరో 300 ఎకరాలు
⇒ సాగు భూముల నుంచి గిరిజనుల గెంటివేత
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆయన ఒక అత్యున్నతస్థాయి అధికారి. అధికార బలాన్ని, వారసత్వంగా వచ్చిన కొంత భూమిని అడ్డం పెట్టుకొని మరో 700 ఎకరాలకు ఎసరు పెట్టారు.
కేర్ టేకర్ పేరుతో ఓ దళారిని సృష్టించి పట్టా భూముల మీదకు ఉసిగొల్పారు. సదరు అధికారి తండ్రి నుంచే భూములు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులనూ వదల్లేదు. బినామీ పేర్లు, తప్పుడు పత్రాలతో ఇప్పటికే 300 ఎకరాలు అమ్మివేశారు. మరో 300 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. కొంత కాలంగా మెదక్ మండలం అనంతసాగర్ భూముల్లో టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు ఉసిగొల్పిన కేర్‌టేకర్ రఘు సాగిస్తున్న కబ్జా కాండపై ‘సాక్షి’పరిశీలనాత్మక కథనం.
మెదక్ మండలం అనంతసాగర్ గ్రామంలోని హఫీజా బేగం అనే మహిళ నుంచి 1 నుంచి 51 సర్వే నంబర్లలోని 845 ఎకరాల భూమిని 1960లో నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సూర్యారావుతోపాటు మరో ఐదుగురు కలసి కొనుగోలు చేశారు. వీరు ఏనాడు భూమిని సాగు చేయలేదు. వీరిలో కొందరు తమ వాటా భూములను గిరిజనులకు అమ్ముకున్నారు. అమ్ముకున్న వారిలో టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావు తండ్రి జనార్దన్‌రావు కూడా ఉన్నారు.
అక్రమాల ‘పట్టా’..: 2012లో జీవీ రమణారావు సర్వే నంబర్ 23ఉ, 1ఉ, 2ఉ, 19ఉ, 27ఈ, 28ఉ, 35ఉ, 43ఉ, 50ఉ, 51ఉ, 36ఉ లోని 103.16 ఎకరాలు తన తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిని తనకు పౌతీ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి రమణారావుకు అనువంశికంగా సంక్రమించే భూమి అంత ఉండదు. ఆయన తండ్రి జనార్దన్‌రావు సంపాదించిన 104 ఎకరాల భూమిలో ఆయనే 1975 నుంచి 1986 వరకు దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమిని దళిత, గిరిజనులకు అమ్ముకున్నారు. అప్పట్లో ఎకరాకు రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు వెచ్చించి శేరిశంకర్ తాండా, తిమ్మాయిపల్లి రైతులు కొనుక్కున్నారు.
క్రయవిక్రయాల రశీదులు, భూ విక్రయ పత్రాలు గిరిజనుల వద్ద ఉన్నాయి. అయితే అక్షరజ్ఞానం పెద్దగాలేని వారు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొంతమంది అసలు పట్టానే చేయించుకోలేదు. కానీ తరతరాలుగా అదే భూమిని దున్నుకొని బతుకుతున్నారు. అత్యున్నత స్థాయి ఉద్యోగిగా ఉన్న రమణారావు విలువలకు కట్టుబడి తన తండ్రి నుంచి భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా భూమిని అంతా ఆయన పేరుతో పట్టా చేయించుకున్నారు.
రమణారావు ఉసిగొల్పిన దళారి...
2012లోనే రమణారావు తన భూమికి పి.రఘు అనే వ్యక్తికి కేర్‌టేకర్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే ఆయన అక్రమానికి తెర లేపారు. తన భూమితోపాటు చిన్నాన్న గండ్ర సూర్యారావు భూమికి కూడా రఘు కేర్‌టేకర్‌గా ఉంటారని రాసిచ్చారు. సూర్యారావుకు కూడా 104 ఎకరాల వాటా ఉంది. ఆయనకు 4 కుమారులు, ఒక కుమార్తె ఉండగానే వారికి తెలియకుండా ఆయన సంరక్షణ బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించడంతో రమణారావు ఉద్దేశం బట్టబయలు అయింది. ఇక రఘు ఫోర్జరీ సంతకాలతో 854/14 2253/14, 3304/2014, 2254/2014, 2027/2014, 1127/2014 డాక్యుమెంట్ నంబర్లతో జై భారత్‌రెడ్డి ఆయన బంధువులకు 199 ఎకరాలు విక్రయించారు.
ఇందులో 854/14, 3304/14 డాక్యుమెంట్లలో మాత్రమే రమణారావు సంతకాలు ఉన్నాయి. రఘు చేసిన ఫొర్జరీ పత్రాలను ‘సాక్షి’ సేకరించింది. 0168 పట్టా నంబర్‌తో మరో పాసు పుస్తకాన్ని సృష్టించి మరికొంత భూమిని ఆక్రమించారు. సర్వే నంబర్ 1, 2, 50లలో ఆయనకు సంబంధంలేని 14 ఎకరాల భూమిని రమణారావు పేరు మీద పట్టా చేయించి, ఆ మొత్తం భూమినీ విక్రయించారు. తాజాగా రఘు మరో 250 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ చేయించాడు. జనార్దన్‌రావుతోపాటు హక్కుదారులుగా ఉన్న వారి భూములను మింగేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కొత్తగా ఫెన్సింగ్ వేసిన భూమి రమణారావుదేనని, ఆయన చెప్తేనే ఫెన్సింగ్ చేయించానని రఘు చెబుతున్నాడు. విచిత్రం ఏమిటంటే రమణారావు వంశానికి సంబంధంలేని పల్లె పోచమ్మ తల్లి గుడి మాన్యాన్ని కూడా ఇటీవల రఘు విక్రయించారు. దీనిపై వివాదం చెలరేగటంతో రమణారావు.. స్థానిక నేతకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరినట్టు తెలిసింది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపకపోవడం గమనార్హం.
గొల్లుమంటున్న గిరిజనులు: భూ సీలింగ్ చట్టం 1973 ప్రకారం అనంతసాగర్‌లో ప్రొసీడింగ్ నంబర్ సీఆర్/6497/1978తో సర్వే నంబర్ 24లో 6.46 ఎకరాలను ఐదుగురికి, 1985లో 2394/ఎస్జీడీ/75 ప్రొసీడింగ్ సీసీ నంబర్‌తో సర్వే నంబర్ 27లో 42.36 ఎకరాలను 41 మంది గిరిజనులకు, 1991లో సర్వే నంబర్ 27లో ప్రొసీడింగ్ నంబర్ డీ/5676/91 ఉత్తర్వుతో 22.25 ఎకరాలను 17 మంది లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. మొత్తం 71.02 ఎకరాల్లో దాదాపు 63 మంది దళిత, గిరిజనులకు పట్టాలు చేశారు.
అంతకుముందే 30 మంది రైతులకు 13/బి కింద అధికారులు ఒక్కొక్కరికి 1:10 గుంటల చొప్పున పట్టాలిచ్చారు. ఇవే పాసుపుస్తకాలను రైతులు ఏడీబీ బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకొని బోర్లు వేయించి, సాగు కూడా చేస్తున్నారు. తాజాగా వారిని భూముల నుంచి వెళ్లగొట్టారు. బోర్లు పూడ్చి వేయిం చారు. గత రబీ సీజన్లో పొట్టకొచ్చిన మొక్కజొన్న, పూతకొచ్చిన పత్తిని పూర్తిగా ధ్వంసం చేయించారు. ఈ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన శేరిశంకర్ తండాకు చెందిన కాట్రోత్ జమ్ల, కాట్రోత్ బద్రు గుండె పగిలి చనిపోయారు. అదే భూమిలో జమ్లి, బద్రుల మృతదేహాలను ఖననం చేయగా వాటిని బయటకు తీయించి అడవిలోకి విసిరేయించినట్లు మృతుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
గూండాలతో కొట్టించారు
మా కండ్ల ముందే పంటను దున్నేశారు. పంట పోయిందని మా అయ్య బద్రుకు గుండెపోటు వచ్చి చనిపోయిండు. మాది పట్టా భూమి. మమ్ములను గూండాలతో కొట్టించి సాగు చేసుకుంటున్న భూమి నుంచి తరిమేశారు.
- కాట్రోత్ బలరాం, శేరిశంకర్ తండా
మేం దున్నుకున్నది మా పట్టా భూములే
మేం దున్నుకుంటున్నది మా పట్టా భూములే. ఎక్కడి నుంచి వచ్చాడోకానీ మా పంటచేలను దున్నేసి మా భూములను గుంజుకున్నడు. ఈ భూములను గుంజుకుంటే మాకు బతుకుదెరవు లేదని కాళ్లమీదపడ్డా కనికరించలేదు.
- రనుజ, శేరిశంకర్ తండా
నా భూమి నేను అమ్ముకుంటున్నా: రమణారావు
ఈ వ్యవహారంపై జీవీ రమణారావును వివరణ కోరగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకున్నానని, స్థానికంగా ఏం జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు. గుడి భూమి అమ్మినట్టు తెలియదన్నారు. మీ చిన్నాన్న భూమికి మీరు ఎలా వారసులవుతారని అడగ్గా ఉన్నతాధికారినైన తనను ప్రశ్నించడం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. దీనిపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేర్‌టేకర్ రఘుతో మాట్లాడగా... తాను అమ్ముతున్న భూమి జీవీ రమణారావుది మాత్రమేనని, ఆయన కేర్‌టేకర్‌గా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. రమణారావుకు 104 ఎకరాలే ఉండగా 250 ఎకరాలు ఎలా విక్రయించారని ప్రశ్నించగా నర్సింహారెడ్డి భూములు అమ్మినట్లు చెప్పారు.