Anantapur Crime News
-
దడపుట్టిస్తున్న ‘పార్థీ గ్యాంగ్’.. సీమలో దొంగతనాలతో హల్చల్
పార్థీ గ్యాంగ్... చోరీల్లో ఆరితేరిన ముఠా. చోరీ చేయడంలోనూ...పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ దిట్టలు. చోరీ సమయంలో అడ్డొస్తే అంతమొందించేందుకూ వెనుకాడని క్రూరులు. ఈ కరుడు గట్టిన దొంగల పేరు చెబితే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. ఈ గ్యాంగ్ ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పార్థీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే సామాన్యులకు హడల్. వీరి కన్ను పడితే ఎలాంటి భద్రత ఉన్నా ఇళ్లయినా లూఠీ కావాల్సిందే. చోరీలు ఈ గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. తప్పించుకోవడంలోనూ వీరు ఆరితేరిపోయారు. దురదృష్టం వెంటాడి పోలీసులకు చిక్కినా ఇసుమంతైనా సమాచారం ఇవ్వరు. చోరీ సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించే ఈ గ్యాంగ్ కదలికలు రాయలసీమలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. తాజాగా గుంతకల్లు దగ్గర జరిగిన రైలు దోపిడీలోనూ వీరి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్‌లోని పాసే పార్థీ తెగకు చెందిన వారు. బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థానికంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద గుడారాలు వేసుకుంటారు. అదును చూసి చోరీలకు తెగబడతారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలపైనే వీరి కన్ను. వ్యాపారుల అవతారమెత్తి రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడతారు. ఈ నెల 20న పార్థీ గ్యాంగ్ సభ్యుడితో పాటు అరెస్టయిన మరో ఇద్దరు దొంగలు అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, కదిరి, హిందూపురం ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో పూసలు, దుప్పట్లు, గృహాలంకరణకు వినియోగించే మట్టి బొమ్మలు అమ్మే వ్యాపారుల్లా పార్థీ గ్యాంగ్ సభ్యులు అవతారమెత్తుతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడతారు. అడ్డొస్తే ప్రాణాలను సైతం తీస్తారు. ఇంత క్రూపమైన పార్థీ గ్యాంగ్‌కు ఓ మహిళ డాన్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలో పార్థీ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ ముఠా సభ్యులు పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఈ పార్థీ గ్యాంగ్ ఎక్కడ చోరీలకు పాల్పడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా వారి ఆనవాళ్లు లేకుండా చూసుకుంటుంది. సెల్ఫోన్లను సైతం నేర ప్రాంతానికి సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ గ్యాంగ్‌లు ఎక్కడ దోపిడీకి పాల్పడినా వారి గ్రామాలకు చేరుకోకమునుపే పోలీసులు పట్టుకోవాలి. లేదంటే దోచుకున్న సొత్తులో పైసా కూడా రికవరీ చేయలేరు. కారణం దోచుకున్న సొమ్మలో 30 శాతం ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం పెద్దలకు ఇస్తారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు వీరికి బాసటగా నిలుస్తారు. మధ్యప్రదేశ్‌లో స్థానిక రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దొంగలు, అనుమానితులు, తీవ్ర నేరాల్లో పాలుపంచుకున్న వారి వివరాలను పోలీసులు అప్పట్లో చేతి వేలి ముద్రలు, కాలి ముద్రలు తీసి ఉంచారు. ఈ ఆధారాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అనంతపురంలో పట్టుబడ్డ పార్థీ గ్యాంగ్ సభ్యుడు కూడా పాత పోలీసులు సేకరించిన చేతి వేలిముద్రల ఆధారంగానే దొరికాడు. వేలిముద్రలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొచ్చాం. అనుమానితుల చేతి వేలిముద్రలు మొబైల్లో తీసుకుని, ఇంటిగ్రేట్ చేసిన వాటితో సరిపోల్చుతాం. పార్థీ గ్యాంగ్‌లు వేసవిలో ఎక్కువగా తిరుగుతుంటాయి. రైళ్లలో దోపిడీలు కూడా చేస్తుంటాయి. వీటిపైనా నిఘా ఉంచాం. లాక్ చేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడతాయి. ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళితే పోలీసులకు సమాచారమందిస్తే నిఘా పెడతాం. ఇప్పటికే రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలనూ అప్రమత్తం చేశారు. – ఎం.రవికృష్ణ, డీఐజీ, అనంతపురం రేంజ్ -
శ్రావణిని చంపేశారా!?
కదిరి అర్బన్: గత ఏడాది తప్పిపోయిన డిగ్రీ విద్యార్థిని శ్రావణిని హతమార్చారా? ప్రస్తుతం లభ్యమైన మానవ అవశేషాలు, పర్సు, సెల్‌ఫోన్ శ్రావణివేనా? తదితర ప్రశ్నలకు సమాధానం అవుననే సమాధానం వస్తోంది. తొమ్మిది నెలలుగా కొనసాగుతూ వచ్చిన పోలీసు దర్యాప్తు.. ప్రస్తుతం లభ్యమైన ఆధారాలతో వేగం పుంజుకోనుంది. వివరాల్లోకి వెళితే.. కదిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శ్రావణి 2019, అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయింది. కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీనిపై కుటుంబసభ్యులు పలు చోట్ల గాలించి, చివరకు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలలు గడుస్తున్నా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. పట్టణ సమీపంలోనే ఆధారాలు లభ్యం ఈ నెల 22న స్థానిక మున్సిపల్ పరిధిలోని సోమేష్ నగర్ సమీపంలో శ్రావణికి సంబంధించి ఆధారాలు ఓ గొర్రెల కాపరికి కంటపడ్డాయి. అనుమానం వచ్చిన ఆ కాపరి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ షేక్ లాల్ మహమ్మద్, సీఐ రామకృష్ణ, ఎస్ఐ మహమ్మద్ రఫీక్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పంట పొలాల్లో పడి ఉన్న పర్సులో శ్రావణి ఐడీ కార్డు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, చిన్న మొత్తంలో నగదు లభ్యమయ్యాయి. పర్సు పడి ఉన్న చోటుకు కొద్దిదూరంగా ఓ పుర్రె, రెండు ఎముకలను గుర్తించారు. ఇవి శ్రావణివేనా లేక మరెవరివైనా అనేది తేలాల్సి ఉంది. లభ్యమైన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు. కాగా, శ్రావణిపై అత్యాచారం జరిపి హతమార్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చావుకోరిన ప్రేమ
లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో.. వీడలేనంత దగ్గరయ్యాయి కన్నవాళ్లు.. కులం.. కట్టుబాట్లు.. అడ్డుతగిలాయి ఆ పసి మనసులు విలవిల్లాడిపోయాయి ఎడబాటును తట్టుకోలేకపోయాయి వీడిపోలేక.. వీడి ఉండలేక... చావులో ఒక్కటవుదామనుకున్నారు భవిష్యత్ తలచుకుని భయాందోళన చెందారు పురుగుల మందునే ప్రేమామృతంగా తాగారుఆస్పత్రికి తీసుకెళ్లినా ఒకరి తర్వాత మరొకరు తనువు చాలించారుశృతి తప్పిన ప్రేమ ప్రకాశించకపోగాకన్నవారికి కడుపుకోత మిగిలింది. బత్తలపల్లి: తమ వివాహానికి కులాలు అడ్డు వస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ధర్మవరం రూరల్ సీఐ వీసీ పెద్దయ్య తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన గొడ్డుమర్రి చిన్నపోతులయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు ఓంప్రకాష్(18), అదే గ్రామానికి చెందిన మనోహర్, సావిత్రి దంపతుల కుమార్తె శ్రుతి(18).. ధర్మవరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బుధవారం వేకువజామున 5.30 గంటలకు యువకుడి తోటలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరు గంటలకు యువకుడి సమీప బంధువులు తోటలో బెండకాయలు కోయడానికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఇరువైపుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముందు యువకుడు.. ఆ తర్వాత యువతి మృతి చెందారు. ఘటనపై ధర్మవరం రూరల్ సీఐ పెద్దయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పట్టుచీరల ముసుగులో మద్యం రవాణా
ధర్మవరం అర్బన్: పార్శిల్ సర్వీస్ ముసుగులో గుట్టుచప్పడు కాకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠా గుట్టును సెబ్ పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్ ఎఎస్పీ రామ్మోహన్రావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి పట్టుచీరలు, చీరల పార్శిల్ బాక్స్‌లతో ఎస్‌బీఆర్‌ఎస్ కార్గో సర్వీస్‌కు చెందిన కేఏ07ఏ 2083 ఐచర్ వాహనం మంగళవారం రాత్రి బయలుదేరింది. 44వ జాతీయ రహదారి మీదుగా నేరుగా ధర్మవరానికి వస్తున్న ఆ వాహనాన్ని పలు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది ఆపి పరిశీలించారు. కార్గో పార్శిల్ సర్వీస్ వే బిల్లులు చూపుతూ.. పట్టుచీరలు, చీరలు తరలిస్తున్నట్లుగా అందులోని వ్యక్తులు చెబుతూ లైన్ క్లియరెన్స్ తీసుకుంటూ వచ్చారు. దీంతో ఎలాంటి అనుమానాలు ఆ వాహనాన్ని చెక్‌పోస్టుల వద్ద వదిలిపెడుతూ వచ్చారు. ముందస్తు సమాచారంతో.. హైదరాబాద్ నుంచి భారీగా మద్యం బాటిళ్లను అక్రమంగా ధర్మవరానికి తరలిస్తున్నట్లుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఏఎస్పీ రామ్మోహన్‌రావుకు సమాచారం అందింది. దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసిన ఆయన... బుధవారం తెల్లవారుజామున ధర్మవరం సమీపంలోని వేల్పుమడుగు వద్ద కాపు కాశారు. వేగంగా దూసుకువస్తున్న ఐచర్ వాహనాన్ని గుర్తించి సెబ్ సీఐలు జయనాథరెడ్డి, నరసానాయుడు, భీమలింగ, ఎస్ఐలు చాంద్‌బాషా సాదిక్ వలీ అడ్డుకున్నారు. ఆ సమయంలో వాహనంలో ఉన్నవారు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. ‘ఇది ఎస్‌బీఆర్‌ఎస్ పార్శిల్ వాహనమని, ఇందులో పట్టుచీరలు, చీరలు తప్ప మరేమీ లేవంటూ నమ్మబలికారు. అయితే తమకున్న పక్కా సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేసి తీరాల్సిందేనంటూ పోలీస్ అధికారులు పట్టుబట్టారు. నిందితులు వీరే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలో భాగంగా దశల వారీగా మద్యనిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం అమ్మకాలపై పలు రకాలుగా నిషేధం విధిస్తూ వచ్చింది. దీనికి తోడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగంగా మద్యం ఎక్కడా లభ్యం కావడం లేదు. దీనిని సొమ్ము చేసుకోవాలని భావించిన పలువురు అక్రమ మార్గాల ద్వారా అధిక ధరలకు మద్యం విక్రయించి తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని భావించారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణానికి చెందిన చీరల వ్యాపారి కోనారెడ్డితోపాటు మరో ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి, హైదరాబాద్‌లో భారీగా మద్యం కొనుగోలు చేసి కార్గో పార్శిల్ సర్వీసు ద్వారా రాచమార్గంలో ధర్మవరానికి చేరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సెబ్ ఎఎస్పీ రామోహ్మన్‌రావు పథకం ప్రకారం ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో కోనారెడ్డితో పాటు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నట్లు సెబ్ ఏఎస్పీ పేర్కొన్నారు. మద్యం బాటిళ్లు, టోబాకో టిన్లతో పాటు ఐచర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. కాగా, మద్యం అక్రమ రవాణా గుట్టును రట్టు చేసిన సీఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్‌రెడ్డి, మారుతీప్రసాద్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రూ. లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు.. పోలీస్ అధికారుల ఒత్తిడికి వాహనం తలుపులు తీసి పట్లు చీరల బాక్స్‌లు చూపించారు. అయితే ఆ బాక్స్‌లు తెరవాలని పోలీసు అధికారులు ఆదేశించడంతో రాజీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయినా పోలీస్ అధికారులు వినలేదు. చివరకు పోలీస్ అధికారులే బాక్స్‌లను తెరవాల్సి వచ్చింది. బాక్స్‌లు తెరిచిన తర్వాత పోలీసులే అవాక్కయ్యారు. అదులో ఏకంగా రూ.1.61 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లు, పొగాకు డబ్బాలు బయటపడ్డాయి. -
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
-
లవ్ ఫెయిల్యూర్; టిక్‌టాక్ వీడియోలు చేసి..
సాక్షి, అనంతపురం : గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహ్యకు పాల్పడ్డాడు. వివరాలు.. పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో కేఎమ్ రాము అనే విద్యార్థి బీఎస్సీ (డిగ్రీ) చదువుతున్నాడు. కొంత కాలంగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన రాము బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్‌టాక్ చేశాడు. ఈ వీడియోలను టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసిన అనంతరం రైలు కిందపడి రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె ) -
చావులో ఒక్కటయ్యారు..
ప్రేమకు కులం లేదంటారు. వాళ్లిద్దరి పెళ్లికి కులమే అడ్డుగా నిలిచింది. నాలుగేళ్ల ప్రణయానికి నలుగురూ అడ్డుతగులు తారేమోనని భావించిన వారు చావులో ఒక్కటై వెళ్లిపోయారు. పసుపు బట్టలు కట్టుకోవాల్సిన వారు పాడెక్కడంతో రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నెలకొంది. సాక్షి, ఉరవకొండ: మండల పరిధిలోని చిన్న కౌకుంట్ల గ్రామంలో ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు, ఎస్ఐ ధరణిబాబు తెలిపిన మేరకు.. తుమ్మిగనూరుకు చెందిన రవి (22) నాలుగేళ్ల క్రితం కౌకుంట్లలోని తన అక్క రాజమ్మ ఇంటికి గొర్రెల కాపరిగా వచ్చాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సుశ్మిత(20)తో అతనికి పరిచయం కాగా...ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం సుశ్మితకు పెద్దవాళ్లు వేరే పెళ్లి సంబంధం చూశారు. ఈ క్రమంలో తమ ప్రేమ విషయం పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం లేక, వారిని ఎదిరించి కులాంతర వివాహం చేసుకోలేక ఆదివారం ఉదయం తమ ఇంటి పక్కన ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో ఒకే తాడుతో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ధరణిబాబు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు.. ) -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. గంటల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించారు. అమ్మా, నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలియని పిల్లలు అమాయకంగా అటు ఇటు తిరుగుతుండటం చూపరులను కలచివేసింది. చిన్నవయసులోనే ఆ పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేశావా దేవుడా అంటూ బంధువులు విలపించారు. అనంతపురం, వజ్రకరూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వజ్రకరూరు మండలం బోడిసానిపల్లి తండాకు చెందిన మూడ్ కేశవనాయక్(30)కు ఇదే మండలం ఎన్‌ఎన్‌పి తండాకు చెందిన వరలక్ష్మిబాయి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు సంవత్సరాల కుమారుడు యువరాజ్‌తోపాటు ఒకటిన్నర సంవత్సరం వయసు గల కూతురు నందిని ఉంది. వరలక్ష్మిబాయి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. కేశవనాయక్ అక్క ధనలక్ష్మికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంలో భార్య, కూతురితో కలిసి బళ్లారికి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం బళ్లారి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో పాల్తూరు క్రాస్ వద్ద గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మిబాయి అక్కడికక్కడే మృతి చెందగా కేశవనాయక్ అనంతపురం ఆస్పత్రిలో అదే రోజు రాత్రి మృతి చెందాడు. కూతురు నందిని స్వల్ప గాయాలతో బయట పడింది. ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనంత ఫ్యాక్షన్.. నలుగురికి యావజ్జీవం
సాక్షి, అనంతపురం : తిప్పేపల్లి ఫ్యాక్షన్ హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కర్నూలు సీబీసీఐడీ పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు పూర్వాపరాలు ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. ధర్మవరం రూరల్ మండలం తిప్పేపల్లిలో దేవరపల్లి వర్గం, ముక్తాపురం వర్గం నడుమ దశాబ్దాల తరబడి ఫ్యాక్షన్ గొడవలున్నాయి. కేసులు కూడా అధికంగా ఉన్నాయి. దేవరపల్లి వర్గానికి దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి, ముక్తాపురం వర్గానికి ముక్తాపురం రామకృష్ణారెడ్డి (70) నాయకత్వం వహించేవారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం తిప్పేపల్లి కాగా అనంతపురంలో సంపూర్ణ లాడ్జి నడుపుతున్నాడు. వీరిద్దరి నడుమ వర్గపోరుతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయి. ►తిప్పేపల్లి నుంచి సంగాలకు రోడ్డు మార్గం దేవరపల్లి లక్ష్మినారాయణరెడ్డి తోటలోంచి వెళ్లే ప్రతిపాదన ఏడేళ్ల కిందట వచ్చింది. అయితే రోడ్డు వేయకుండా లక్ష్మినారాయణరెడ్డి జిల్లా కోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకొచ్చేవాడు. ఇది ముక్తాపురం వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అదను చూసి హత్యకు కుట్రపన్నారు. 2013 ఏప్రిల్ 12 నుంచి మొదలుపెట్టి పలు దఫాలు లక్ష్మినారాయణరెడ్డిని హత్య చేయటానికి పన్నాగం పన్నారు. లక్ష్మినారాయణరెడ్డి తోటలోనే మారణాయుధాలు దాచివుంచి అదను కోసం వేచి ఉన్నారు. చదవండి: జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్ ఎట్టకేలకు మే 5వ తేదీన లక్ష్మినారాయణరెడ్డి ఒంటరిగా బైక్ మీద వస్తున్న విషయం తెలిసి అతను ఇంకా బండి దిగకమునుపే దాడిచేసి హతమార్చారు. అటునుంచి మారణాయుధాలను వెంకటరెడ్డి పొలంలో పారవేసి శివలింగారెడ్డి ఇంటికి చేరారు. హత్యజరిగిన వెంటనే ప్రత్యక్షసాక్షిగా హతుడి భార్య దేవరపల్లి రామకృష్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మవరం రూరల్ పోలీసులు తిప్పేపల్లికి చెందిన ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై కేసు నమోదు చేశారు. ►ఫ్యాక్షన్ కేసు కావటంతో సీఐడీ పోలీసులు రంగంలో దిగారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురితో పాటు కసిరెడ్డి రాజారెడ్డి, తిప్పేపల్లికి చెంది, అనంతపురంలో సంపూర్ణలాడ్జి నడుపుతున్న ముక్తాపురం రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో స్థిరపడిన ముక్తాపురం అనిల్‌కుమార్‌రెడ్డి, బత్తలపల్లి మండలం సంగాలకు చెందిన కొడకండ్ల నరసింహారెడ్డి, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన గొర్ల వెంకటలింగారెడ్డి, గొర్ల రామలింగారెడ్డి, తాడిమర్రి మండలం ఆత్మకూరుకు చెందిన పొడెమల ఓబిరెడ్డి, వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఎగువ పల్లికి చెందిన శివలింగారెడ్డిలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తొలుత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు ముక్తాపురం ఈశ్వరనారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ముక్తాపురం వెంకటరమణారెడ్డి, ముక్తాపురం వెంకటశివారెడ్డిలపై సాక్ష్యాధారాలు నిరూపణ కావటంతో ఆ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా నాలుగవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పు చెప్పారు. మిగిలినవారిపై నేరారోపణలు రుజువుకాక పోవటంతో నిర్దోషులుగా విడుదల చేశారు. దర్యాప్తు అధికారిగా సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ ఉపేంద్రబాబు వ్యవహరించగా, కోర్టులో సాకు‡్ష్యల హాజరుకు సహకరించిన కోర్టు కానిస్టేబుళ్లు బత్తలపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన రామాంజి, సీబీసీఐడీకి చెందిన జాఫర్షావలిని పోలీసు అధికారులు అభినందించారు. చదవండి: తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం -
అత్తా.. అమ్మమ్మా అంటూ నమ్మిస్తాడు.. ఆపై!
సాక్షి, అనంతపురం: అత్త.. అమ్మమ్మ అంటూ వరుసలు కలుపుతాడు.. నేను మీ బంధువును అంటూ నమ్మిస్తాడు.. అదును చూసి దోచేస్తాడు. ఈ మోస్ట్ వాంటెడ్ దొంగను సీసీఎస్, తాడిపత్రి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి రూ. 40 లక్షల విలువజేసే 101.4 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల మస్తాన్‌వలి అలియాస్ మస్తాన్ ఐటీఐ వరకు చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. తాగుడు, పేకాట, బెట్టింగ్‌లకు అలవాటుపడి దొంగగా మారిన మస్తాన్ రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో గత మూడేళ్లలో ఏకంగా 26 నేరాలకు పాల్పడ్డాడు. మంచిగా, నేర్పుగా, అణకువగా మాట్లాడటం.. అత్త, అవ్వ, మామా అంటూ బంధుత్వాలు, వరుసలతో మాటలు కలపడమే పనిగా పెట్టుకున్నాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఇళ్లలో మగవాళ్లు లేని సమయం చూసి వృద్ధ మహిళలతొ మీకు దూరపు బంధువును అవుతానని నమ్మబలుకుతాడు. వారు నిజమేనని నమ్మి మర్యాదలు చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారు ధరించిన బంగారు ఆభరణాలు బాగున్నాయని కితాబిస్తూనే చాకచక్యంగా నగలను ఇవ్వాలని కోరుతాడు. ఇతని మాటలు నమ్మి వారు ఆభరణాలను ఇచ్చేస్తాడు. ఒక వేళ ఇవ్వని పక్షంలో లాక్కొనిపారిపోతాడు. అరెస్టయినా మస్తాన్ 26 కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. తాడిపత్రి రూరల్, పామిడి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, అనంతపురం, కర్నూలు జిలాలలో ప్యాపిలి, మద్దికెర, కడపలో రాజుపాళ్యం, ప్రకాశం ప్రాంతాల్లో 2017 నుంచి నేరాలకు పాల్పడ్డాడు. అంతకు మునుపు కూడా ఇతనిపై 14 నేరాలున్నాయి. గతంలో తిరుపతి, కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినా ఇతనిలో మార్పు రాలేదు. దొంగలపై నిఘా ఉంచిన తాడిపత్రి సబ్ డివిజన్ పోలీసులు ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మస్తాన్‌ను సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ శ్యాంరావు, తాడిపత్రి రూరల్ ఎస్ఐ రాజశేఖర్, సీసీఎస్ ఎస్ఐలు చలపతి, చాంద్‌బాషా, సిబ్బంది శ్రీనివాసులు, భాస్కర్, కృష్ణానాయక్, జయచంద్రారెడ్డి, తిరుపతయ్య, ఫరూక్, అనిల్, మల్లి, సతీష్, మనోహర్, రంజిత్, దూద్వలీ అరెస్ట్ చేశారు. వీరిని ఎస్పీ సత్యయేసుబాబు అభినందించారు. రివార్డులతో సత్కరించారు. -
భర్త మందలించాడని..
అనంతపురం, ధర్మవరం అర్బన్: భర్త మందలించాడని క్షణికావేశంలో ఓ వివాహిత కత్తితో చేయికోసుకున్న ఘటన గురువారం సాయంత్రం పట్టణంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్‌కు చెందిన శివ, కవితలు మగ్గం నేస్తూ జీవనం సాగించేవారు. అయితే శివ మొదటి భార్య చనిపోవడంతో పెద్దల సూచనమేరకు కవితను పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటిలో బిడ్డకు కవిత అన్నం సరిగా తినిపించలేదని భర్త శివ మందలించాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఎదురు తిరగడంతో భార్య కవితపై శివ చేయిచేసుకున్నాడు. దీంతో క్షణికావేశంతో ఆమె ఇంటిలో ఉన్న కత్తితో చేతికి కోసుకుంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీనాథ్ ఏమయ్యాడు?
సోమందేపల్లి: పట్టణానికి చెందిన మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి డబ్బు ఎత్తుకెళ్లారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళితే.. శ్రీనాథ్ ఇటీవల ప్రభుత్వ షాపులో సూపర్వైజర్గా నియమితుడయ్యారు. తోటి సిబ్బందితో కలసి వ్యాపార లావాదేవీలు చూసుకునే వాడు. మద్యం షాపులో (సీఆర్ఓ నంబర్11146) రోజు వసూలైన కలెక్షన్‌ను బ్యాంకులో చెల్లించి సంబంధిత రశీదులను ఎక్సైజ్ అదికారులకు అప్పగించేవాడు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మద్యం షాపునకు సంబంధించిన డబ్బును తన వద్దే ఉంచుకున్న శ్రీనాథ్, సోమవారం షాపు తనిఖీ నిమిత్తం వచ్చిన ఎక్సైజ్ పోలీసులు తనిఖీ అనంతరం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకుల్లో కట్టి రశీదు అప్పగించాలని సూచించారు. దీంతో డబ్బు చెల్లించి రశీదు అప్పగించి వస్తానని చెప్పి షాపు నుంచి బయటకు వెళ్ళిపోయిన శ్రీనాథ్ అనంతరం కనిపించకుండా పోయాడు. సాయంత్రం వరకు ఎదురు చూసిన సిబ్బంది ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వగా పూర్తీ స్థాయిలో పరిశీలించి, కుటుంబసభ్యులతో విచారించి అనంతరం ఎక్సైజ్ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా? శ్రీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాలధారణలో వున్న వ్యక్తి గత 4 రోజుల క్రితం పెనుకొండ మండలానికి ఆనుకుని వున్న కొత్తచెరువు మండలంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శ్రీనాథ్ సైతం మాలధరించి ఉండడం వల్ల చనిపోయింది శ్రీనాథ్ అని, శవం కుళ్లిపోయి ఉండటంతో పోలీసులు ప్రాథమికంగా శ్రీనాథ్ అని నిర్ధారించినా డీఎన్ఏ రిపోర్టు కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు వచ్చే వరకు చనిపోయింది ఎవరన్నది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. బెట్టింగ్ ప్రభావమేనా? శ్రీనాథ్‌కు ఆన్లైన్ బెట్టింగే ఆడే అలవాటు ఉందని పలువురు సన్నిహితుల ద్వారా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న మద్యంషాపు డబ్బును ఆన్లైన్ బెట్టింగ్‌లో పొగొట్టుకుని బ్యాంకులో డబ్బు కట్టలేక, అధికారులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే శ్రీనాథ్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. బెట్టింగ్ లావాదేవీలు సెల్ఫోన్లోనే జరిపే వాడని,. ఈ క్రమంలో అతడి సెల్‌ఫోన్ సైతం మాయం కావడం అంతుబట్టని రహస్యంగా మారింది. అయితే సెల్పోన్లో జరిపిన లావాదేవీలు, అతడు ఫోన్లో అదృశ్యమయిన రోజు జరిపిన సంభాషణలను పోలీçసులు బయటకు తీయగలిగితే కొంత వరకు వాస్తవాలు బయటపడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పలువురు సన్నిహితుల సెల్ఫోన్లు పోలీసుల వద్ద వున్నాయి. వీటిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. బ్యాంక్‌లో కట్టమని చెప్పాం సోమవారం మద్యం షాపును తనిఖీ చేసిన అనంతరం 3 రోజులకు సంబంధించిన మొత్తం రూ. 9 లక్షల పైచిలుకు మొత్తాన్ని బ్యాంకులో చెల్లించి రశీదు ఇవ్వమని సూపర్ వైజర్ శ్రీనాథ్‌కు సూచించాం. అయినా ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. డబ్బుతో తమకు సంబంధం ఉండదు. సూపర్వైజర్లే బ్యాంకులో చెల్లించాలి. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసాం. విచారణ చేస్తున్నారు.– జబీవుల్లా, ఎక్సైజ్ ఎస్ఐ, పెనుకొండ లోతుగా విచారిస్తున్నాం మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ అదృశ్యంపై పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. 4 రోజుల క్రితం కొత్తచెరువు పరిధిలో అయ్యప్ప మాలధారణలో వున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనాథ్ సైతం మాలధరించి వుండడంతో అతనేమైనా ఉండొచ్చు అనే కోణంలో విచారిస్తున్నాం. అదృశ్యమైన రోజు ఏ టవర్ల కింద ఫోన్ సంభాషణలు జరిపాడన్న విషయమై కాల్ డేటా సేకరిస్తున్నాం. – శ్రీహరి, సీఐ, పెనుకొండ -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నగరంలో అనంతసాగర్కాలనీకి చెందిన షికారి కోటయ్య, షికారి రామకృష్ణ, బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి మెచిలి అలియాస్ నాగి, టీవీ టవర్‌కు చెందిన షికారి శీనా, షికారి శీను ఉన్నారు. వీరి నుంచి 62 తులాలు బంగారు, 18 తులాలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు. 2018లో నగరంలోని అరవింద్‌నగర్, హౌసింగ్‌బోర్డు 2019లో కక్కలపల్లి పంచాయతీ దండోరాకాలనీ, ఎల్ఐసీ కాలనీ, ఆకుతోటపల్లి, హౌసింగ్‌బోర్డు, తాటిచెర్ల, ఓబుళదేవరనగర్, ఎల్ఐజీ కాలనీ, సెంట్రల్ ఎక్సైజ్‌కాలనీ, ఆకుతోటపల్లి, కళ్యాణదుర్గం రోడ్డులలో చోరీలు చేశారు. జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, కర్నూలు జిల్లాలో కూడా నేరాలకు పాల్పడ్డారు. ఐదుగురిలో షికారి శీనా మినహా మిగిలిన వారిపై కేసులున్నాయి. దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పక్కా సమాచారం అందుకొని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో అశ్వర్థనారాయణస్వామి కట్ట వద్ద ఐదుగురినీ అరెస్ట్ చేశారు. వీరిని పట్టుకోవడంలో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, టూటౌన్ సీఐ జాకిర్‌హుస్సేన్, వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐలు రాఘవరెడ్డి, జయపాల్‌రెడ్డి, ఏఎస్ఐ రమేష్, సిబ్బంది జయరామ్, దాసు, రామకృష్ణ, ప్రవీణ్, గిరి, ఆసిఫ్‌ల బృందం కీలకంగా వ్యవహరించింది. ఎస్పీ సత్యయేసుబాబు రివార్డులతో సిబ్బందిని అభినందించారు. -
కీచకోపాధ్యాయుడు
తండ్రి తర్వాత తండ్రిలా వ్యవహరించాల్సిన ప్రధానోపాధ్యాయుడు గతి తప్పాడు.విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సమయంలో సహ ఉపాధ్యాయినిల పట్ల కీచకుడిగా మారాడు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో ఉన్న శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోనిది. ప్రధానోపాధ్యాయుడివైఖరితో విసుగు చెందిన బాధితులు వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. కీచకోపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు.చివరకు సమస్యపై స్పందించిన సీఎం పేషీ.. తక్షణమేఆ కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులుజారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.నటరాజ్ వైఖరి వివాదస్పదంగా మారింది. వందల సంఖ్యలో ఇక్కడ బాల, బాలికలు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్థాయి నుంచి హెచ్ఎం వరకూ ఐదేళ్లుగా ఈ పాఠశాలలో పనిచేస్తూ వస్తున్న నటరాజ్.. తరగతి గదుల్లో పాఠాలు చెప్పకుండా అనుచిత ప్రవర్తనలతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అతని వెకిలి చేష్టలకు చిన్నారుల మనసులు గాయపడ్డాయి. విషయాన్ని తల్లిదండ్రులకు గాని, ఇతరులకు గాని చెబితే హాజరుపట్టిలో అబ్సెంట్ వేస్తానని బెదిరిస్తూ తన పబ్బం గడుపుకుంటూ వచ్చాడు. మాట కాదంటే పైశాచికం తన మాట వినలేదన్న అక్కసుతో గతంలో ఎనిమిదో తరగతి విద్యార్థి వెంకటరమణను నటరాజ్ తీవ్రంగా చితకబాదాడు. ఘటనలో వెంకటరమణ చెయ్యి విరిగింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రూ.30 వేలు చెల్లిస్తూ దుప్పటి పంచాయితీతో బయటపడ్డాడు. స్కూల్ అసిస్టెంట్‌గా ఉంటూ వచ్చిన నటరాజ్ ఈ ఏడాది జూన్ 19న ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ పొంది, తిరిగి ఇదే పాఠశాలలో బాధ్యతలు స్వీకరించాడు. హెచ్ఎం అన్న అహంకారంతో అతను మరింత రెచ్చిపోతూ.. ఈ సారి ఏకంగా ఉపాధ్యాయినులను టార్గెట్ చేస్తూ వచ్చాడు. అతని వెకిలి చేష్టలతో విసుగు చెందిన ఉపాధ్యాయినులు.. గ్రీవెన్స్‌లో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అతన్ని అప్పటి తహసీల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఉపాధ్యాయినుల పట్ల మరింత వేధింపులు మొదలయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో మహిళా టీచర్లు ఇబ్బంది పడుతూ వచ్చారు. తన మాట వినకపోతే కులం పేరుతో దూషిస్తున్నాడంటూ నటరాజ్‌పై ఇద్దరు మహిళా టీచర్లు ఈ నెల 9న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు కానీ, నటరాజ్ అరెస్ట్ చూపలేకపోయారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటరాజ్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ ఈ నెల 11న సీఎం పేషీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. విషయం తెలుసుకున్న నటరాజ్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. -
వివాహిత దారుణహత్య
అనంతపురం, పుట్లూరు: మడుగుపల్లి ఎస్సీ కాలనీలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో భర్తే ఆమెను కడతేర్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడుగుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి(30)కి ఎనిమిదేళ్ల కిందట నార్పల మండలం దుగుమర్రికి చెందిన వీరశేఖర్‌తో వివాహమైంది. కొన్నేళ్లు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఇటీవల భార్య ప్రవర్తనపై వీరశేఖర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. వేధింపులు పెరిగిపోవడంతో ఎనిమిది నెలల క్రితం ఆరేళ్ల కుమారుడు దేవాను తీసుకుని వెంకటలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. బంధువులు, ఇతర పెద్దలు పంచాయితీ చేసి నెల రోజుల క్రితం మెట్టినింటికి పంపారు. అయినా వీరశేఖర్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో మళ్లీ 20 రోజుల క్రితం ఆమె మడుగుపల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వీరశేఖర్ మడుగుపల్లికి వచ్చాడు. సోమవారం ఉదయాన్నే తాను దుగుమర్రికి వెళ్తున్నానని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నడిపి బయన్న, లక్ష్మిదేవిలకు చెప్పి బయల్దేరాడు. అల్లుడు వెళ్లిపోయాక బయన్న, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం వేళ కుమారుడు సమీప ఇళ్ల వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. ఇక ఒంటరిగా ఉన్న వెంకటలక్ష్మి కాసేపటికే దారుణహత్యకు గురైంది. స్థానికుల సమాచారంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలంలో రుబ్బుడుగుండు, కొడవలి పడి ఉన్నాయి. హత్యాస్థలిని తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ దేవేంద్రకుమార్ పరిశీలించారు. హత్యకు గల కారణాలపై మృతురాలి తల్లిదండ్రులను ఆరా తీశారు. భర్తే రుబ్బుడుగుండుతో మోది హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. హతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
అమ్మా.. నాన్న ఇవే నా చివరి మాటలు
చిత్తూరు, పాకాల: ‘అమ్మా... నాన్నా ఇక ఇవే నాచివరి మాటలు. ఇక మీదట నేనుండను, నన్నుక్షమించండి. నేను చనిపోతున్నా’ అంటూ ఓ కన్న బిడ్డ తల్లిదండ్రులకు చివరిక్షణంలో మాట్లాడిన మాటలివి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. వివరాలు ఇలా ఉన్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో యువకుడు మృతి చెందాడని గుర్తించి పాకాల రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు చౌడేపల్లె పోలీసుల సహాయంతో సమాచారమిచ్చారు. చౌడేపల్లె మండలం కోటూరు గ్రామానికి చెందిన ఎస్. సయ్యద్ అహమ్మద్ కుమారుడు సైదుల్లా (23) కూలీ పనిచేసుకొంటూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం ఇంటి వద్ద నుంచి తల్లిదండ్రులతో గొడవపడి పాకాలకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ నుంచి తన స్నేహితులకు ఫోన్ చేసి నేను ఇక ఉండను, చనిపోతున్నానంటూ స్నేహితులకు చెప్పాడని, చివరిసారిగా తన అమ్మా .. నాన్నలతో మాట్లాడించాలని కోరగా వారు అతని సూచనల మేరకు ఫోన్లో తల్లితండ్రులకు మాట్లాడించినా ఫలితం లేకపోయింది. పాకాల సమీపంలోని రైల్వే ట్రాక్‌మీద విగతజీవిగా పడి ఉన్న తన బిడ్డను చూసిన తల్లితండ్రులు బోరున విలపించారు. కాగా అందరితో ఆప్యాయతతో మెలిగే సైదుల్లా ఇకలేరని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. -
లారీలు, బస్సులున్నాయి ఇంకా పెళ్లికాలేదని..
హిందూపురం: అమ్మాయిలకు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుంటున్న గోరంట్ల మండలం బుదిలివాండ్లపల్లికి చెందిన రంగప్ప (30) అనే మోసగాన్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహబూబ్‌బాష చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురంలోని ఓ యువతికి ఐదునెలల క్రితం ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మాటలు కలిసి తన వివరాలు తెలిపే క్రమంలో బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నానని, అనాథనని తనకు లారీలు, బస్సులున్నాయని నమ్మించాడు. ఇంకా పెళ్లికాలేదని చెప్పుకొచ్చాడు. అలా మాటలు కలిపి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ముగ్గులోకి దించాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానుకల కింద బంగారు నగలు, భారీగా నగదును ముట్టజెప్పారు. డబ్బుదస్కం అందినవెంటనే మోసగాడు ముఖం చాటేశాడు. ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. బయటపడిన బండారం అనుమానం వచ్చిన యువతి తల్లిదండ్రులు విచారించగా రంగప్ప మోసగాడని తెలింది. అతనికి ఇంతకు మునుపే ముగ్గురు, నలుగురు యువతులను ఇలాగే ప్రేమ, పెళ్లిళ్లు పేరిట మోసం చేసినట్లు తెలిసిందన్నారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగప్పను వన్‌టౌన్ పోలీసులు అరెస్టుచేసి విచారించారు. చిలమత్తూరు మండలంలోని పాతచామలపల్లిలో ఓ యువతితో పెళ్లిఅయ్యి ఇద్దరు సంతానం ఉన్నారని తెలిసింది. అలాగే బెంగళూరులో మరో యువతి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా రెండుచోట్ల వివాహాలపేరిట మోసం చేసినట్లు తెలిసింది. ఇతన్ని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చుతున్నామని డీఎస్పీ తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..
కర్ణాటక,బళ్లారి అర్బన్: బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హతమార్చిన ఘటన చోటు చేసుకొంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొళగల్లు గ్రామానికి చెందిన కాగి సోమయ్య(34) అనే వ్యక్తి ఈనెల 20న తన భార్య యల్లమ్మతో కలిసి ద్విచక్ర వాహనంలో బళ్లారి–హొసపేటె రోడ్డులోని రామేశ్వరినగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లారు. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వంతెన వద్దకు రాగానే పథకం ప్రకారం యల్లమ్మ తన ప్రియుడు, అదే గ్రామానికి గ్రామ పంచాయితీ సభ్యుడు సంజీవప్పను అక్కడకు పిలిపించింది. దీంతో సంజీవప్ప వారిని అటకాయించి సోమయ్యపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి హెచ్ఎల్సీ ప్రధాన కాలువలోకి మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి సోమయ్య ఆచూకీ లేకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి యల్లమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సంజీవప్ప కోసం గాలింపు చేపట్టారు. కాగా సోమయ్య మృతదేహం మంగళవారం లభ్యమైంది. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హనుమంతప్ప దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత ఆత్మహత్య
అనంతపురం, గోరంట్ల: కమ్మలవాండ్లపల్లిలో బి.వాణిశ్రీ (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వాణిశ్రీ, నాగరాజు దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మద్యానికి బానిసైన నాగరాజు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. అదనపు కట్నం తీసుకురానందున మీ పుట్టింటి వారు ఇక్కడికి వచ్చినా, వారితో నీవు మాట్లాడినా తాను తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకుంటానంటూ నాగరాజు భార్యను హెచ్చరించాడు. అంతటితో ఆగక అలిగి కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి రచ్చబండ వైపు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన వాణిశ్రీ ఇంట్లోనే ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త, స్థానికులు గమనించి ఉరికి వేలాడుతున్న వాణిశ్రీని కిందకు దించి గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే ఆమె ప్రాణం విడిచింది. మెట్టినింటి వారిపై ఆగ్రహం తమ కుమార్తె వాణిశ్రీ మృతికి మెట్టినింటి వారి కట్నం వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతురాలి తండ్రి వెంకటరామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదులో ఆలస్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బంధువులతో కలిసి మృతదేహంతో మంగళవారం ప్రభుత్వాస్పత్రి నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని తెలపడంతో వారు శాంతించారు. ఐదుగురిపై కేసు నమోదు ఫిర్యాదును పలుమార్లు మార్చి ఇవ్వడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని సీఐ జయనాయక్ స్పష్టం చేశారు. వాణిశ్రీ మృతికి ఆమె భర్త నాగరాజుతో పాటు అతని సోదరులు నాగేంద్ర, రవి, శ్రీనివాసులు, ఆడపడుచు రత్నమ్మ కారణమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఐదుగురిపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
బస్సు ప్రమాదంలో భార్యాభర్తల మృతి
సాక్షి, మడకశిర(అనంతపురం) : తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం బస్సు లోయలో పడిన ప్రమాదంలో మడకశిరకు చెందిన ఇద్దరు మృతి చెందారు. పట్టణానికి చెందిన మేడా శ్రీనివాసులు(62), మేడా మధురాక్షమ్మ(56) ఈ ప్రమాదంలో మరణించారు. వీరు శుక్రవారం రాత్రి మడకశిర నుంచి ఓ ప్రైవేట్ మినీ బస్సులో అన్నవరం, భద్రాచలం తదితర ప్రాంతాల సందర్శనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చెళ్ళకెరకు వెళ్లారు. చెళ్ళకెరలోని బంధువులను కూడా ఆయా ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం భద్రాచలంలో పూజలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అన్నవరానికి వెళ్తుండగా మారేడుమిల్లి–చింతూరు మధ్య వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడగా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో మడకశిరకు చెందిన మేడా శ్రీనివాసులు, మేడా మధురాక్షమ్మ ఉన్నారు. ఈ దంపతులకు కుమారుడు కిశోర్, కుమార్తెలు ఆశ, నాగమణి సంతానం. కుమార్తెలిద్దరికీ వివాహం కాగా.. కుమారుడు కిశోర్ ఓ ప్రైవేట్ టెలికాం సంస్థలో పని చేస్తున్నాడు. మృతులు మడకశిరలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుమారుడు తన మిత్రులతో కలిసి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. మృతుల్లో కొందరి మూలాలు మడకశిరలోనే.. మృతుల్లో ఎక్కువమందికి మడకశిరతో సంబంధం ఉంది. ప్రస్తుతం చెళ్ళకెరలో నివాసం ఉంటున్న మేడా వెంకటాచలపతి(56), మేడా గాయత్రమ్మ(52), వీరి కుమార్తె మేడా శ్వేత(25) కూడా మృతుల్లో ఉన్నారు. వీరు మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలం ఇనగలూరుకు చెందిన వారు. ఈ కుటుంబం 25 ఏళ్ల పాటు ఇదే మండలంలోని దొక్కలపల్లిలో చిల్లర అంగడిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించారు. ఐదేళ్ల క్రితమే ఈ కుటుంబం అంతా చెళ్ళకెరకు వలస వెళ్లింది. ప్రమాదంలో ఈ కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడం బంధువులను విషాదంలోకి నెట్టింది. -
పిల్లల ఆకలి చూడలేక తల్లి ఆత్మహత్య
సాక్షి, కళ్యాణదుర్గం రూరల్(అనంతపురం) : పిల్లల పోషణ భారమై వివాహిత అర్ధంతరంగా తనువు చాలించింది. ఈ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణం చౌడేశ్వరివీధిలో నివాసముంటున్న నాగరాజు, నాగమణి దంపతుల కుమార్తె బోయ రేణుక (26)కు కుందుర్పి మండలం గురువేపల్లికి చెందిన మూర్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు హర్షిత(8), ధరణి(3), మరో 4 నెలల పాప ఉన్నారు. మూర్తి మూడు ఎకరాల పొలంలో టమాట సాగు చేశాడు. పంట చేతికందకపోవడంతో నష్టం వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో కొన్ని నెలలు పుట్టింటిలో ఉండాల్సిందిగా భార్య, పిల్లలను కళ్యాణదుర్గం పంపించాడు. అక్కడ కుమార్తెలను పోషించుకునే దారి తెలియక మదనపడేది. బతుకుదెరువు కనిపించకపోవడంతో పిల్లలను పస్తులుండటం చూడలేక మనస్తాపం చెందిన రేణుక సోమవారం ఉదయం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బంధువులు, స్థానికులు గమనించి ఆమెను కిందకు దించి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేణుక ప్రాణం విడిచినట్టు డాక్టర్లు నిర్ధారించారు. భర్త మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను శిశు గృహానికి పంపించడానికి చర్యలు తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లల బాగుగోలు చూసుకునేందుకు అనంతపురంలోని శిశుగృహకు పంపించడానికి చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సీడీపీఓ గీతాంజలి, సూపర్వైజర్ పద్మజ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని చిన్నారుల వివరాలను సేకరించారు. త్వరలోనే చిన్నారులను శిశుగృహకు అప్పగిస్తామని సీడీపీఓ చెప్పారు. -
ప్రియుడే చంపేశాడు
సాక్షి, అనంతపురం ,గుత్తి: ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందన్న నెపంతో ప్రియుడే మట్టుబెట్టాడు. వివరాల్లోకి వెళితే గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డు(షాలోన్ నగర్)లో నివాసముంటున్న ఓ డిగ్రీ విద్యార్థిని (మైనర్) శనివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా హంతకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో జక్కల చెరువుకు చెందిన వాయల రంగస్వామి (ఇతడూ మైనరే) అనే వ్యక్తి నుంచి విద్యార్థినికి కాల్ వచ్చింది. దీంతో సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐలు ఇబ్రహీం, రాజేష్‌లు హత్య చేసింది ప్రియుడు వాయల రంగస్వామి అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే జక్కల చెరువు గ్రామానికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలించి తమ దైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని రంగస్వామి అంగీకరించాడు. అయితే విచారణలో హంతకుడు పలు ఆసక్తికర విషయాలు చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వాయల రంగస్వామి, సదరు విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తి అయ్యాక డిగ్రీకి తలా ఒక కాలేజీలో చేరారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని మరో విద్యార్థితో చనువుగా ఉంటున్నట్లు తెలుసుకున్న రంగస్వామి ఆమెను పలుసార్లు హెచ్చరించాడు. ఆమె వినిపించుకోలేదని మట్టుబెట్టాలని పథక రచన చేశాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకు ఫోన్ చేసి మీ ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వచ్చిన ఆమెతో గొడవ పెట్టుకున్న రంగస్వామి తన వెంట తెచ్చుకున్న బైక్ క్లచ్ వైర్‌ను ఆమె గొంతుకు బిగించి ఆపై తలను గోడకు బాదాడు. అంతటితో ఆగకుండా చున్నీని మెడకు బిగించి ఇంటి కాంపౌండ్ వాల్ ఆవలకు పడేసి పరారయ్యాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. -
రిటైర్డ్ కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, తాడిపత్రి: పట్టణంలోని కాలువగడ్డ వీధిలో రిటైర్డ్ ఫైర్ కానిస్టేబుల్ లక్ష్మన్న (68) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న పుట్టపర్తిలో అగ్నిమాపకశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎనిమిదేళ్ల కింద పదవీ విరమణ పొందాడు. లక్ష్మన్నకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య, పెద్దకుమారుడు హరి అనంతపురంలో నివాసముంటుండగా, రెండవ కుమారుడు హరిక్రిష్ణ వైఎస్సార్ జిల్లా పులివెందులలో నివాసముంటున్నాడు. గతంలో లక్ష్మన్న తాడిపత్రి పట్టణంలోని టైలర్స్‌కాలనీలోని తన సొంత నివాసంలో ఉండేవాడు. ప్రస్తుతం కాలువగడ్డ వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి లక్ష్మన్న రక్తపుమడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ తేజమూర్తి, ఎస్ఐ ఖాజాహుసేన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మన్న మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడు లక్ష్మన్న, కుమారులకు ఆస్తి విషయంలో తగాదాలు ఉండేవని తరచూ లక్ష్మన్న కుమారులు తన తండ్రి వద్దకు వచ్చి గొడవ పడతూ వెలుతుండేవారని స్థానికులు పోలీసులకు వివరించనట్లు సమాచారం. దీంతో లక్ష్మన్న రెండవ కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి : కోరిక తీరిస్తేనే.. లేదంటే జీవితాంతం.. -
అత్తారింట్లో అల్లుడి అనుమానాస్పద మృతి
సాక్షి, చెన్నేకొత్తపల్లి(అనంతపురం): అత్తారింట్లో అల్లుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చెన్నే కొత్తపల్లి మండలం నామాల గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు... కూడేరుకు చెందిన వీరాంజనేయులు (32) మూడేళ్ల కిందట నామాల గ్రామానికి చెందిన తులసమ్మను వివాహం చేసుకున్నాడు. ఇటీవల వీరికి కూతురు జన్మించింది. పుట్టింటిలో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వీరాంజనేయులు వారం క్రితం నామాలకు వచ్చాడు. ఏమైందో తెలీదు కానీ ఆదివారం తెల్లవారుజామున గదిలో ఉరికి వేలాడుతుండటాన్ని బంధువులు గమనించారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్యకు గురయ్యాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పదో తరగతి విద్యార్థి కిడ్నాప్‌కు యత్నం
అనంతపురం, కళ్యాణదుర్గం రూరల్: కిడ్నాప్‌కు గురైన పదో తరగతి విద్యార్థి మార్గమధ్యలో తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాలిలా.. నారాయణపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, అంజినప్పల కుమారుడు అజిత్ స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు అజిత్‌ను ఆపి మల్లాపురం గ్రామానికి దారి అడిగారు. దారి చూపి ముందుకెళుతుండగా వారు పాఠశాల వద్ద దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు. పాఠశాల వద్ద ఆపకుండా వెళ్తుండటంతో గట్టిగా అరవడం తో కళ్లకు, నోటికి గంతలు కట్టి కంబదూరుకు తీసుకెళ్లారు. అక్కడి మద్యం కోసం దుకాణం వద్ద కారు ఆపిన సమయంలో విద్యార్థి తప్పించుకున్నాడు. సమీపంలో ఉన్న ఇళ్లలోకి వెళ్లి జరిగిన విషయాన్ని వారి ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లో చేరవేశాడు. వారు అక్కడికి చేరుకొని బాలుడిని వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివశంకర్‌నాయక్ స్పందిస్తూ.. ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.