'అంజలి' ఉద్యోగం ఊడింది...
అమెరికాలోని మియామీ ప్రాంతంలో పనిచేస్తున్న ఎన్నారై వైద్యురాలు అంజలీ ఉద్యోగం ఊడిపోయింది. ఉబర్ డ్రైవర్ మీద, కారు మీద ఆమె దాడి చేస్తున్న దృశ్యాల వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ఆస్పత్రి వర్గాలు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాయి. అంజలీ అనే ఈ మహిళా వైద్యురాలు క్యాబ్ డ్రైవర్ మీద దాడి చేసిన వీడియో గత జనవరిలో బయటపడింది. అప్పటినుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఆమెను ఆదివారం ఉద్యోగం నుంచి తొలగించినట్లు జాక్సన్ హెల్త్ సిస్ట్ ప్రతినిధి ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే కావాలంటే ఆమె దీనిపై అప్పీలు చేసుకోడానికి అవకాశం ఉందని కూడా చెప్పారు.
నాలుగేళ్లుగా అంజలి ఆ ఆస్పత్రిలో న్యూరాలజీ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీడియోలో ఆమె డ్రైవర్ మీద దాడి చేసినట్లు, వాహనం మీదకు ఎక్కి అందులోని వస్తువులు బయటకు విసిరేస్తున్నట్లు ఉంది. అయితే ఆ డ్రైవర్ మాత్రం ఇప్పటివరకు తానెవరన్నది బయటపెట్టలేదు, ఆమెపై ఆరోపణలు కూడా ఏమీ చేయలేదు. ఘటన జరిగిన తర్వాత అంజలి క్షమాపణ చెప్పారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇప్పటివరకు దాదాపు 70 లక్షల మంది చూశారు.