విద్యార్థినితో అసభ్యకర ప్రవర్తనపై విచారణ
హిందూపురం అర్బన్ : పట్టణ సమీపంలోని కొటిపి రోడ్డులో ఉన్న ఏపీఆర్జేసీ బ్రిడ్జి స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినితో వంటమనిషి అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు మేరకు ఆర్డీఓ రామ్మూర్తి, డీఎస్పీ సుబ్బారావు ఆదివారం విచారణ చేపట్టారు. శివరాత్రి రోజున బ్రిడ్జి స్కూల్లో వంటమనిషి సహాయకుడిగా పని చేస్తున్న ఓబుళపతి ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రహరీ వెనుక వైపునకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అది మిగిలిన విద్యార్థులు చూసి స్కూల్లోని సిబ్బందికి చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. వారు ఓబుళపతిని తీవ్రస్థాయిలో మందలించి అమ్మాయికి బుద్ధి చెప్పి గదికి తీసుకువచ్చారు. మరుసటి రోజు ఆ అమ్మాయిని ఇంటికి పంపించినట్లు కలెక్టర్కు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై తక్షణం విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆర్డీఓ, డీఎస్పీ స్కూల్లో విచారణ చేశారు. అయితే అక్కడ ఏం జరగలేదని అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి స్కూల్ ప్రిన్సిపల్ వివరణ మరోలా ఉంది. ఒకట్నిర నెల కిందట వంటమనిషి ఓబుళపతికి అదే స్కూల్లో పని చేస్తున్న టీచర్ ఉమా రూ.12 వేలు అప్పుగా ఇచ్చింది. డబ్బు ఇవ్వకపోవడంతో ఆమె బాగా దుర్భాషలాడింది. దీంతో ఓబుళపతి ఆమెపై కులంపేరుతో దూషించిందని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడు. దీంతో టీచర్ ఇలా ఫిర్యాదు చేసింది. అని బ్రిడ్జి స్కూల్ ప్రిన్సిపల్ జయలక్ష్మి చెప్పారు. కలెక్టర్కు అందించిన ఫిర్యాదుతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ కోసం ఆర్డీఓ, డీఎస్పీ వచ్చి పూర్తిస్థాయిలో విచారణ చేశారన్నారు. అయితే ఆరోపణలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని ఆర్డీఓ, డీఎస్పీ చెప్పారు.