artana
-
నేను మోడ్రన్ సీతను!
జర్నలిజం చదువుతూ సెల్యులాయిడ్‌పైకి అడుగుపెట్టారు అర్తన. రాజ్‌తరుణ్ సరసన ఆమె నటించిన ‘ సీతమ్మ అందాలు... రామయ్య సిత్రాలు ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం గురించి అర్తన చెప్పిన ముచ్చట్లు... * మాది కేరళ. సోషల్ మీడియాలో నా ప్రొఫైల్ చూసిన ఓ కాస్టింగ్ ఏజెంట్ నన్ను కలిశారు. స్వతహాగా నాకూ సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఆడిషన్స్‌కి వచ్చా. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశా. * ఈ చిత్రంలో నా పాత్ర పేరు సీతా మహాలక్ష్మి. నా పాత్రను మోడ్రన్ సీతగా అభివర్ణించవచ్చు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ ఇది. ఈ చిత్రంతో నటనకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించింది. * సినిమా అంటే కేవలం గ్లామర్ రంగం అనే అభిప్రాయం ఉండేది. ఇక్కడికొచ్చాక సినిమా కోసం ఎంత కష్టపడాలో తెలిసింది. షూటింగ్ ప్రారంభంలో భాషాపరమైన ఇబ్బంది తలెత్తినా ఇప్పుడు తెలుగు అర్థం చేసుకుంటున్నా. త్వరలోనే తెలుగులో మాట్లాడతాను. నటన, డైలాగ్స్ విషయంలో రాజ్ తరుణ్ చక్కటి సహకారం అందించారు. * గ్లామర్ పాత్రలంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి పాత్రలు నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉందామనుకుంటున్నా. * తెలుగు చిత్రాలు చూస్తుంటాను. నాగార్జున, అల్లు అర్జున్‌లను బాగా అభిమానిస్తా. నేను హీరోయిన్గా నటించిన మలయాళ చిత్రం ‘ముతుగావు’ త్వరలో విడుదల కానుంది. -
అందమైన సిత్రాలు!
సీతమ్మ చాలా అందంగా ఉంటుంది. రామయ్య కూడా అందగాడే. అతను చేసే సిత్రాలు భలే ముచ్చటగా ఉంటాయి. ఆ సిత్రాలకు సీతమ్మ ఎలా మురిసిపోయింది? రామయ్య చేసే సిత్రాలు ఎలా ఉంటాయి? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. టైటిల్ రోల్స్‌లో రాజ్ తరుణ్, అర్తన నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్.బాబు సమర్పణలో ఎస్.ై శెలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ సినిమా నిర్మించారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మించిన మా చిత్రాన్ని అన్ని వర్గాలవారు చూడొచ్చు’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాలకు పెద్ద పీట వేశాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. డిసెంబరులో పాటల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖా వాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విశ్వ, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్.