గార్దభాలు భళా!
సాక్షి,బండిఆత్మకూరు: శివనంది ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడమల కాల్వ గ్రామంలో బుధవారం గార్దభాల(గాడిదల) బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. సుమారు 120కేజీల బరువు గల ఇసుక సంచులను గాడిదపై వేశారు. 10 నిమిషాల సమయంలో ఎంత ఎక్కువ దూరం పరిగెడితే వాటిని విజేతలుగా ప్రకటించారు. చాగలమర్రి మండలం పెద్దవంగళి గ్రామం రమణయ్యకు చెందిన గార్దభం 5,509 అడుగులు లాగి మొదటి స్థానంలో నిలిచింది.
మహానంది మండలం పుట్టుపల్లె ప్రవీణ్‌కు చెందిన గార్దభం 5,400 అడుగులు లాగి రెండో స్థానం, వెలుగోడు నాగచరణ్కు చెందిన గార్దభం 5,373 అడుగులు లాగి మూడో స్థానం, వెలుగోడు మండలం వేల్పనూరు నాగేంద్రకు చెందిన గార్దభం 5,066 అడుగులు లాగి నాల్గోస్థానంలో నిలిచింది. వీరికి రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, రూ.2వేలు నగదును ఆలయ కమిటీ చైర్మన్ మేకల శ్రీనివాసులు, రాగాల బాబులు, వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా అందజేశారు.