భారత్‌లో ఒప్పొ ప్లాంట్
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ ఒప్పొ భారత్‌లో హ్యాండ్సెట్ అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీన్ని ఈ ఏడాది ఆగస్ట్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, ప్లాంట్ ఏర్పాటుకు ఇదే అనువైన సమయమని ఒప్పొ మొబైల్స్ ఇండియా సీఈఓ టామ్ లూ తెలిపారు. తమ మార్కెట్ ప్రాథామ్యాలలో భారత్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందన్నారు.
తయారీ రంగాన్ని పరుగులు పెట్టించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమ ప్రభావంతో షియోమీ, కూల్‌ప్యాడ్, జియోనీ వంటి కంపెనీలు కూడా దేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి. భారత్‌లో గతేడాది జనవరిలో కార్యకలాపాలను ప్రారంభించిన ఒప్పొ, ఇప్పటిదాకా 10 మోడ ళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పొ ఈ ఏడాది సర్వీస్ సెంటర్ల సంఖ్యను 120 నుంచి 200కు పెంచాలని, అలాగే మొబైల్ విక్రయాలను 15 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.