Atovala
-
‘ట్రాఫిక్’ వేధింపులపై ఆటోవాలాల ర్యాలీ
శంషాబాద్: పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని నిరసిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు అడగడుగునా ఛలాన్లు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని సామ ఎన్క్లేవ్ నుంచి ప్రారంభమైన ఆటోల ర్యాలీ జాతీయ రహదారి మీదుగా ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ వరకు నిర్వహించారు. సుమారు 300 ఆటోలు ర్యాలీలో పాల్గొన్నాయి. స్థానిక అవసరాల కోసం ఆటోలు ఆపినా పోలీసులు ఛలాన్లు వేయడంతో పాటు ఆటోల్లోని సీట్లను లాగేసి, అద్దాలు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీఎంఎస్ నాయకులు శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ సతీష్‌తో చర్చలు జరిపారు. ఆటో డ్రైవర్లకు లెసైన్సులు తప్పనిసరిగా ఉండాలని ఈ సందర్భంగా ఏసీపీ సూచించారు. ఆటోలు నిలుపుకోడానికి స్థానికంగా ప్రత్యామ్నాయ స్థలాలు చూపాల్సిన అవసరముందని బీఎంఎస్ నాయకులు కోరారు. ఆటోలను జీవనాధారంగా చేసుకొని వందలాది మంది బతుకుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లపై వేధి ంపులు మానుకోవాలని కోరారు. అనంతరం శంషాబాద్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ అనురాధకు బీఎంఎస్ మండల అధ్యక్షుడు చింతల నందకిశోర్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సయ్యద్, జగన్, దేవేందర్, సర్వర్, ఫయాజ్, నాగరాజు, రంజిత్, నర్సింహారెడ్డి, రాజుగౌడ్, జంగయ్య, అంజి, శేఖర్, ప్రవీణ్‌కుమార్ వినతిపత్రం ఇచ్చారు. -
వివాహితపై లైంగిక దాడికి యత్నం
ముగ్గురు స్నేహితులతో కలిసి ఆటోవాలా అఘాయిత్యం మియాపూర్ పీఎస్‌లో కేసు నమోదు హైదరాబాద్: వివాహితపై ఓ ఆటో డ్రైవర్ ముగ్గురు స్నేహితులతో కలిసి లైంగిక దాడి యత్నించాడు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమ్ యాదవ్ కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వివాహిత (26) తన అక్కాబావతో కలిసి వినాయకుడి నిమజ్జనం తిలకించడం కోసం గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఉంటున్న మరో సోదరి వద్దకు వచ్చింది. ఈ నేపథ్యంలో వారు బుధవారం సాయంత్రం మాదాపూర్‌లోని శిల్పారామాన్ని సందర్శించారు. రాత్రి 9.30కి ఆటో ఎక్కగా కొండాపూర్ వద్ద ఆటో డ్రైవర్ తన ముగ్గురు స్నేహితుల్ని కూడా ఆటోలో ఎక్కించుకొన్నాడు. హఫీజ్‌పేట్‌లోని నిర్మానుష్య ప్రాంతమైన సర్వేనెంబర్ 77లోకి ఆటోను తీసుకెళ్లాడు. వెంట ఉన్న అక్కాబావలను చితకబాది వివాహితపై నలుగురూ లైంగికదాడి యత్నించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అంజయ్యనగర్‌లోని సోదరి ఇంటికి చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నిజాయితీకి మారుపేరు ఆ ఆటోవాలా
భోగాపురం, న్యూస్‌లైన్:రోడ్డుపై దొరికే సొమ్ము విలువను బట్టి మనిషి విలువ మారిపోతుందని అంటుంటారు. కానీ ఈ ఆటోవాలా ఆ విలువలను కాపాడాడు. సమాజంలో నిజాయితీ అనే పదం ఇంకా బతికే ఉందని నిరూపించాడు. భోగాపురం మండలం కవులవాడ గ్రామానికి చెందిన ఆటోవాలా కొయ్య రామారావు సవరవిల్లి స్టాండులో ఆటో పెట్టుకుని జీవిస్తున్నాడు. సోమవారం సవరవిల్లి స్టాండు నుంచి ఆటోలో ప్రయాణికుల్ని తీసుకువెళ్తుండగా జమ్మయ్యపేట వద్దకి వచ్చేసరికి ఎదురుగా ఆటో వేగంగా రావడం గమనించి తన ఆటోను పక్కకు తిప్పాడు. ఇంతలో రోడ్డుపై కాగితాలు ఎగురుతుండడం గమనించాడు. వెంటనే వెళ్లిపోతున్న ఆటోను ఆగమని కేకలు వేశాడు. కానీ ఆటో ఆగకుండా వెళ్లిపోయింది. ఎగిరిన కాగితాలు ఏంటా అని చూస్తే అన్నీ కరెన్సీ నోట్లు. వాటన్నింటినీ జాగ్రత్తగా తీసి లెక్కబెడితే రూ.23,400 ఉన్నాయి. వెంటనే అతను ఈ సమాచారాన్ని గ్రామపెద్ద దాట్ల శ్రీనివాసరాజుకి, ‘న్యూస్‌లైన్’కి అందించాడు. వారి సూచనల మేరకు ఈ సొమ్ముతో పోలీసు స్టేషనుకి చేరుకుని, జరిగిన విషయాన్ని చెప్పి ఎస్ఐ షేక్ సర్దార్ఘనికి సదరు నగదుని అందజేశారు. నగదు పోగొట్టుకున్న వ్యక్తి కవులవాడ పంచాయతీ బసవపాలెం వద్ద ఉన్న రీసుపేట గ్రామానికి చెందిన రీసు అప్పలరాముగా గుర్తించారు. అతను ప్రైవేటు సంస్థలో తాకట్టుపెట్టిన బంగారం చైనుకి చక్రవడ్డీ పడుతుండడంతో... గ్రామంలో ఒక వ్యక్తి వద్ద వడ్డీకి అప్పు చేసి తన చైను విడిపించుకునేందుకు వెళ్తుండగా డబ్బులు పడిపోయాయని పోలీసులకు తెలిపాడు. పోయిన నగదు వివరాలు పక్కాగా తెలపడంతో నగదు వారిదిగా గుర్తించి ఎస్ఐ బాధితుడికి డబ్బు అందించారు. వేలల్లో డబ్బు దొరికినా తన సొంతం చేసుకోకుండా నిజాయి తీగా వ్యవహరించిన కొయ్య రామారావుని పోలీసులు, గ్రామస్తులు అభినందించారు.