నిజాయితీకి మారుపేరు ఆ ఆటోవాలా
Published Tue, Dec 3 2013 1:58 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
భోగాపురం, న్యూస్‌లైన్:రోడ్డుపై దొరికే సొమ్ము విలువను బట్టి మనిషి విలువ మారిపోతుందని అంటుంటారు. కానీ ఈ ఆటోవాలా ఆ విలువలను కాపాడాడు. సమాజంలో నిజాయితీ అనే పదం ఇంకా బతికే ఉందని నిరూపించాడు. భోగాపురం మండలం కవులవాడ గ్రామానికి చెందిన ఆటోవాలా కొయ్య రామారావు సవరవిల్లి స్టాండులో ఆటో పెట్టుకుని జీవిస్తున్నాడు. సోమవారం సవరవిల్లి స్టాండు నుంచి ఆటోలో ప్రయాణికుల్ని తీసుకువెళ్తుండగా జమ్మయ్యపేట వద్దకి వచ్చేసరికి ఎదురుగా ఆటో వేగంగా రావడం గమనించి తన ఆటోను పక్కకు తిప్పాడు. ఇంతలో రోడ్డుపై కాగితాలు ఎగురుతుండడం గమనించాడు. వెంటనే వెళ్లిపోతున్న ఆటోను ఆగమని కేకలు వేశాడు. కానీ ఆటో ఆగకుండా వెళ్లిపోయింది. ఎగిరిన కాగితాలు ఏంటా అని చూస్తే అన్నీ కరెన్సీ నోట్లు. వాటన్నింటినీ జాగ్రత్తగా తీసి లెక్కబెడితే రూ.23,400 ఉన్నాయి. వెంటనే అతను ఈ సమాచారాన్ని గ్రామపెద్ద దాట్ల శ్రీనివాసరాజుకి, ‘న్యూస్‌లైన్’కి అందించాడు. వారి సూచనల మేరకు ఈ సొమ్ముతో పోలీసు స్టేషనుకి చేరుకుని, జరిగిన విషయాన్ని చెప్పి ఎస్‌ఐ షేక్ సర్దార్‌ఘనికి సదరు నగదుని అందజేశారు.
నగదు పోగొట్టుకున్న వ్యక్తి కవులవాడ పంచాయతీ బసవపాలెం వద్ద ఉన్న రీసుపేట గ్రామానికి చెందిన రీసు అప్పలరాముగా గుర్తించారు. అతను ప్రైవేటు సంస్థలో తాకట్టుపెట్టిన బంగారం చైనుకి చక్రవడ్డీ పడుతుండడంతో... గ్రామంలో ఒక వ్యక్తి వద్ద వడ్డీకి అప్పు చేసి తన చైను విడిపించుకునేందుకు వెళ్తుండగా డబ్బులు పడిపోయాయని పోలీసులకు తెలిపాడు. పోయిన నగదు వివరాలు పక్కాగా తెలపడంతో నగదు వారిదిగా గుర్తించి ఎస్‌ఐ బాధితుడికి డబ్బు అందించారు. వేలల్లో డబ్బు దొరికినా తన సొంతం చేసుకోకుండా నిజాయి తీగా వ్యవహరించిన కొయ్య రామారావుని పోలీసులు, గ్రామస్తులు అభినందించారు.
Advertisement
Advertisement