'అత్తారింటికి దారేది'కి అదనంగా మరికొన్ని సన్నివేశాలు
పవన్ కళ్యాణ్ అభిమానులకు దీపావళి బహుమతిగా నిర్మాతలు మరికొన్ని సన్నివేశాలను అత్తారింటికి దారేది చిత్రానికి కలుపనున్నట్టు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. వంద కోట్ల మార్కును చేరుకునేందుకు పరుగులు పెడుతున్న టాలీవుడ్ చిత్రం అత్తారింటికి దారేది చిత్రానికి అదనంగా ఆరు నిమిషాల నిడివి ఉండే సన్నివేశాలను కలుపనున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం 71 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టిందని వార్తలు వెలువడ్డాయి.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తున్న విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. దీపావళి సందర్భంగా అభిమానులను సంతోష పరుచడానికి మరి కొన్ని సన్నివేశాలను చిత్రానికి కలుపుతున్నాం. పండగ సెలవుల్లో అభిమానులు ఈ చిత్రాన్ని వీక్షించే విధంగా అక్టోబర్ 31 నుంచి ఏర్పాటు చేస్తున్నాం అని ప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ సన్నివేశాలు అకట్టుకునే విధంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 తేదిన విడుదలైంది. ఈ చిత్రంలో సమంత, ప్రణీత, బోమన్ ఇరానీ, నదియాలు నటించారు.