ఇన్సూరెన్స్ పేరుతో మోసం
ఇంకొల్లు, న్యూస్‌లైన్ : ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలు పేదల పాలిట శాపంగా మారాయి. రోజంతా కష్టపడి దాచుకున్న సొమ్మును కొందరు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఈ తరహా మోసం ఒకటి ఇంకొల్లులో బుధవారం వెలుగుచూసింది. ఓ ప్రముఖ సంస్థ లైఫ్ ఇన్సురెన్సు పేరిట ఇంకొల్లులో నెలకొల్పిన కార్యాలయం బోర్డు ఏడాదికే తిప్పేసింది. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. సంస్థ తాలూకా పత్రాలు పట్టుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక పర్చూరు రోడ్డులో ఓ భవనంపై అంతస్తులో గతేడాది లైఫ్ ఇన్సురెన్సు కార్యలయాన్ని ప్రారంభించారు.
ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో పాలసీలు కట్టించుకున్నారు. ఫోను నంబర్ల సాయంతో ఖాతాదారులను కార్యాలయానికి పిలిపించుకుని ఏడాదికి రూ. 5 వేలు చొప్పున 5 సంవత్సరాలు చెల్లిస్తే 20 సంవత్సరాలకు రూ. 50 వేలు ఇస్తామని చెప్పారు. ఖాతాదారులు ఆశపడి ఆ సంస్థలో డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన తర్వాత కనీసం బాండు కూడా ఇవ్వలేదు. జిరాక్స్‌పై ఒంగోలు కార్యాలయం ముద్ర వేసి ఖాతాదారులకు ఇచ్చారు. సరిగ్గా ఏడాది తర్వాత బోర్డు తిప్పి మోసం చేశారు. ఖాతాదారులు రెండు రోజుల నుంచి కార్యాలయానికి వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కార్యాలయం యజమాని మాత్రం ఇల్లు అద్దెకు ఇవ్వబడునని బోర్డు పెట్టేశాడు. కంపెనీ వారు ఇచ్చిన ఫోను నంబర్లు కూడా పని చేయకపోవటంతో మోసపోయినట్లు ఖాతాదారులు గుర్తించారు.
ఫోన్ చేస్తే వెళ్లా: అత్తులూరి హనుమంతరావు, హనుమోజీపాలెం
ఫోను చేసి మరీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. డ్రాలో కంపెనీ బీమా సౌకర్యం కల్పించినట్లు నమ్మబలికారు. ఈ ఏడాది మార్చి 27వ తేదీన రూ. 5 వేలు చెల్లించా. కంపెనీ తరఫున బాండు కూడా ఇవ్వలేదు. తర్వాత ప్రింటెడ్ బాండు వస్తుందని చెప్పారు. తీరా చూస్తే కార్యాలయం మూసి వేసి ఉంది.