కల్బుర్గి హత్యను ఖండించిన అకాడమీ
♦ అలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టాలి
♦ అవార్డులు వెనక్కి తీసుకోవాలని రచయితలకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: రచయిత కల్బుర్గి హత్యను కేంద్ర సాహిత్య అకాడమీ ఏకగ్రీవంగా ఖండించింది. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఓ తీర్మానం చేసింది. అవార్డులను వెనక్కిచ్చిన రచయితలు తిరిగి తీసుకోవాలని, అకాడమీ పదవులకు రాజీనామా చేసిన సభ్యులు వాటిని వెనక్కి తీసుకోవాలని కోరింది. కల్బుర్గి హత్య నేపథ్యంలో రచయితలు నిరసన తెలిపి,అవార్డులను వెనక్కి ఇస్తుండడంతో శుక్రవారం అకాడమీ అత్యవసరంగా సమావేశమైంది. భేటీ వివరాలను అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు కృష్ణస్వామి నచిముతు వెల్లడించారు. ఈ పరిస్థితిపై డిసెంబర్ 17న భేటీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అకాడమీ సమావేశం నేపథ్యంలో... దేశవ్యాప్తంగా వివిధ భాషా రచయితలు నలుపు వస్త్రాలను నోటికి కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. రచయితలపై అసహన వైఖరి మారాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అకాడమీకి ఒక మెమొరాండం ఇచ్చారు. మరోవైపు ఈ నిరసనకు పోటీగా కొందరు రచయితలు మరో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రచయితలు అవార్డులను వెనక్కి ఇచ్చేయడమనేది దురుద్దేశపూరిత చర్య అంటూ అకాడమీకి మెమొరాండం సమర్పించారు. రచయితల ఆందోళనకు అకాడెమీ మద్దతు తెలపటాన్ని స్వాగతిస్తున్నానని రచయిత విక్రమ్ సేథ్ తెలిపారు.