సౌత్‌జోన్ చాంప్ ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ అండర్–23 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. కొచ్చిలో హైదరాబాద్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆంధ్ర జట్టు సౌత్‌జోన్ చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు మ్యాచ్‌ల్లో కేరళ, గోవా, కర్ణాటక, తమిళనాడు జట్లపై ఆంధ్ర విజయం సాధించింది.
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 48.5 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. హిమాని యాదవ్ (75 బంతుల్లో 40; 8 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆంధ్ర బౌలర్లలో సీహెచ్ ఝాన్సీ లక్ష్మీ, చంద్రలేఖ చెరో 3 వికెట్లు దక్కించుకోగా... మల్లిక 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 24.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్లు అనూష (46 బంతుల్లో 30; 4 ఫోర్లు), మేఘన (47 బంతుల్లో 53; 8 ఫోర్లు) ఆకట్టుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ బౌలర్లలో కీర్తిరెడ్డి, శ్రావణి చెరో 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఆంధ్ర జట్టుకు ఏసీఏ కార్యదర్శి చుక్కపల్లి అరుణ్ కుమార్ రూ. 2 లక్షల బహుమతిని ప్రకటించారు.