హోమియా కౌన్సెలింగ్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా?
నా వయసు 55 ఏళ్లు. ఒకసారి నా వేళ్లు కొంకర్లుపోయి ఏపని చేయలేకపోయాను. దాంతో డాక్టర్‌ను కలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి, మందులిచ్చారు. కానీ పెద్దగా మెరుగుదల కనిపించలేదు. హోమియోలో దీనికి తగిన చికిత్స ఉందా?
- ఇస్మాయిల్, కావలి
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ, తన సొంతకణాలనే హానికరమైనవాటిగా గుర్తించి, వాటితో పోరాడుతున్నప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్‌లు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. మొదట చిన్న చిన్న కీళ్లలో (చేతి, కాలి వేళ్లు), ఆ తర్వాత పెద్ద కీళ్లలోకి (మోచేయి, మోకాలు, తుంటి) విస్తరిస్తుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియం అనే పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. దీంతో ఇన్ఫ్లమేషన్కు గురైన ఈ సైనోవియం పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి కార్టిలేజ్‌ను కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు, వాటి ఆకృతినీ, అమరికనూ కోల్పోయి, విపరీతమైన నొప్పితో పాటు, కీళ్ల కదలిక కూడా కష్టంగా మారుతుంది.
లక్షణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వారిలో కీళ్లవాపు, కీళ్లనొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండటం, ఉదయం నిద్రలేచే సరికి కీళ్ల కదలిక చాలా బాధాకరంగా ఉండటం, బిగుసుకుపోవడం జరుగుతుంది. శరీరానికి రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగా లేపోవడం, నిస్సత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు (రుమటాయిడ్ నాడ్యూల్స్) ఏర్పడవచ్చు. కీళ్లవాతాన్ని నిర్లక్ష్యం చేస్తే వివిధ రకాల వ్యాధులు... ముఖ్యంగా గుండెజబ్బులు, కళ్లు పొడిబారడం, లాలాజలం తగ్గడం, గుండెచుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరుచేరడం వంటి దుష్ర్పభావాలు వచ్చే అవకాశం ఉంది.
నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఎక్స్-రే, ఎమ్మారై మొదలైన పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సైకోసొమాటిక్ డిజార్డర్లలో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఇతర చికిత్స విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. అయితే హోమియో ప్రక్రియలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య పద్ధతిని అనుసరించడం వల్ల వ్యాధిని తగ్గించడంలోనూ, కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ మంచి ఫలితాలు లభ్యమవుతాయి. రోగి మానసిక, శారీరక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, విచారించి, అనువైన మందులను నిర్ణయించి ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా కాపాడవచ్చు. వ్యాధిని సంపూర్ణంగా నయం కూడా చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్,
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్