అందుబాటు ధరల్లో లగ్జరీ కార్లే లక్ష్యం
హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆటోమొబైల్ పరిశ్రమలో వేగంగా మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లతో వినియోగదారులను అకట్టుకున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ భారత్‌లో అడుగుపెట్టి 15 ఏళ్లయింది. గత ఆరునెలల్లో గ్రాండ్ఐ10, శాంతాఫే, ఎక్సెంట్, మై 14 వెర్నా లాంటి విజయవంతమైన మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఇంత వరకూ దేశంలో 50 లక్షల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. దేశంలో అడుగిడిన ఐదేళ్లలోనే (2004లో) అతిపెద్ద వాహన ఎగుమతిదారుగా ఎదిగింది. వాహన శ్రేణిలోని వ్యత్యాసాలను తొలగిస్తూ అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ఎంట్రీ లెవల్ నుండి కాంపాక్ట్, హైకాంపాక్ట్, ఎంట్రీ లెవెల్ సెడాన్ , మిడ్‌సైజ్, ప్రీమియం, ఎస్యూవీ...ఇలా అన్ని మోడళ్లను కొలువు దీర్చింది. 15 ఏళ్లు పూర్తి చేసుకొని 16 ఏట అడుగుపెడుతున్న కంపెనీ భారత్‌లో ఎదుర్కొన్న సవాళ్ల నుండి నేర్చుకొన్న పాఠాలతో పాటు భవిష్యత్తుపై అంచనాలను హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ సాక్షితో పంచుకొన్నారు.
ఆవివరాలివీ...
ఇండియాలో ప్రవేశించి 15 ఏళ్లు గడిచాయి. ఈ మార్కెట్లో ఎదురైన సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు?
సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆటోమొబైల్ తయారీదార్లకు భారత్ ఎంతో ఆకర్షణీయమైన మార్కెట్. కొరియా, జపాన్,జర్మనీ, అమెరికా దేశాలు ఈ మార్కెట్లో పోటీపడటం దీనికి నిదర్శనం. కారు ధర కన్నా కూడా నాణ్యత, నవ్యత, ప్రపంచ స్థాయి ఉత్పత్తులకు ఇక్కడి వినియోగదారుడు ఎప్పుడే జైకొడతాడు. అందుకే మేం ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇంతవరకూ అన్ని కేటగిరీ వాహనాల్లో వార్షిక వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నాం. వినియోగదారుడు మెచ్చుకొనే తయారీదారు కావాలన్నదే మా లక్ష్యం.
లగ్జరీ కార్లు, బడ్జెట్ కార్లు... ఈ రెండింటి మార్కెట్ ఎలా ఉండబోతోంది?
హై వాల్యూ ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించడమే మా విధానం. భారత్‌లో కస్టమర్ ఆకాంక్షలకు అనుగుణంగా మా కార్ల ధరలను నిర్ణయిస్తున్నాం. మా ఉత్పత్తులో ఇయాన్ నుండి శాంతా ఫే వరకూ అన్ని కార్లూ ఆయా సెగ్మెంట్లలో స్థిరపడ్డాయి. అందుబాటు ధరల్లో లగ్జరీ ఉత్పత్తులను పొజిషన్ చేయడమే మా మార్కెటింగ్ వ్యూహం.
స్థిరమైన కేంద్ర ప్రభుత్వం...ఆటో పరిశ్రమ బడ్జెట్ నుండి ఏం కోరుకొంటోంది?
ఎక్సైజ్ సుంకం తగ్గింపును ఈ ఆర్థిక సంవత్సరం చివరి దాకా పొడిగించాలి. దీంతో పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతమున్న ఎక్సైజ్ డ్యూటీ విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో కారును సొంతం చేసుకోవాలన్న మధ్య తరగతి కలలు నెరవేరుతాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఆటో పరిశ్రమ మరింత ఉత్సాహంగా వృద్ధి చెందుతుంది. వడ్డీ రేట్లను సరళీకరిస్తే బ్యాంకుల నుండి రుణాలు తీసుకునేందుకు మరింత మంది ముందుకు వస్తారు. వినియోగదార్ల సెంటిమెంట్‌లో సానుకూల మార్పు వస్తుందని మేం ఆశిస్తున్నాం.
సమీప భవిష్యత్తులో పరిశ్రమ ఎదుర్కొనే సవాళ్లు?
పెరుగుతున్న ద్రవ్యోల్భణం, చమురు ధరలు, వడ్డీ రేట్లు...పరిశ్రమను కుంగ దీశాయి. వీటిని ధీటుగా అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన ఆర్థిక విధానాలను ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నాం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడంతో స్క్రాపేజీ పాలసీని ప్రవేశ పెడితే ఆటో రంగం పుంజుకుంటుంది.