రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ఆర్థిక మంత్రి సొంత గ్రామం ఏవీ నగరంలో..
తొండంగి (తుని) :
ఆర్థిక మంత్రి స్వగ్రామం.. అడిగే వాడెవ్వడని అనుకున్నాడో ఏమో.. రైతు భూమిని ఆన్లైన్ చేసేందుకు డిమాండ్ చేసిన రూ.30 వేలు తీసుకుంటూ ఏవీ నగరం గ్రామ వీఆర్వో ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో వీఆర్వో తమ్మయ్యదొర సుదీర్ఘ కాలంగా వీఆర్వోగా పనిచేస్తున్నాడు. పెరుమాళ్లపురానికి చెందిన వైస్ ఎంపీపీ భర్త కాలిబోయిన చంద్రరావుకు ఈ గ్రామంలో 37 సెంట్లు భూమి ఉంది. ఆన్లైన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. పని చేయకపోవడంతో వీఆర్వోను అడిగితే రూ.40 వేలు డిమాండ్ చేశాడు. బేరసారాల తరువాత రూ.30 వేలకు వీఆర్వో అంగీకరించాడు. మంగళవారం గ్రామంలో రెవెన్యూ కార్యాలయంలో సొమ్ము ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో చంద్రరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ.30 వేలను వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్, అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతడిని విచారణ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలించారు. అతని ఆస్తులపై కూడా సోదాలు మొదలుపెట్టారు. ఇటీవల కాకినాడకు చెందిన రిటైర్డ్ అగ్నిమాపక జిల్లా అధికారి సంకు వెంకటేశ్వరరావు నుంచి రూ.రెండు లక్షలు తహశీల్దార్ టీవీ సూర్యనారాయణ డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజుల కిత్రం సీఐ సూర్యమోహన్ విచారణ చేశారు. ఇప్పుడు వీఆర్వో నేరుగా ఏసీబీ అధికారులకు దొరికిపోవడం చర్చనీయాంశమైంది.
గతంలో సెంటు భూమిలేని తొండంగికి చెందిన అధికార పార్టీ నాయకుడికి సుమారు రెండెకరాల భూమిని అధికారులు ఆన్లైన్లో కట్టబెట్టారు. ఆ భూమిని ఆన్లైన్లో పొందిన ఆ రైతు సొసైటిలో రుణం కూడా పొందిన సంగతి విదితమే. అధికారుల తీరుపై మండలంలో రైతులు ముక్కున వేలేసుకున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం తరచూ భూముల వ్యవహరాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, సొంత గ్రామంలోనే అధికారి ఏసీబీకి పట్టబడడంపై అమాత్యునికి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం.