డైమండ్ ఆఫర్ చేసి...దోచుకున్నారు
మహబూబ్‌నగర్: దురాశ దుఃఖానికి చేటు అన్నారు పెద్దలు. అతి దురాశకు పోతే.. ఐదు లక్షల రూపాయలు దొంగల పాలయ్యాయి. లక్షల విలువైన వజ్రం వస్తుందంటే ఎవరికైనా ఆశే. అయితే ముందు వెనక ఆలోచించకుండా డైమండ్ చౌకగా వస్తుందంటూ డబ్బులతో వెళ్లి.. ఘరానా మోసగాళ్ల చేతిలో బాధితులు అడ్డంగా మోసపోయారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో అయిజలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 50 లక్షల రూపాయల విలువ చేసే డైమండ్‌ను కేవలం 10 లక్షల రూపాయల ఆఫర్ కే ఇస్తామంటూ గుర్తు తెలియని దుండగులు.. డోన్ ప్రాంతానికి చెందిన కొందరిని నమ్మబలికారు.
అది నమ్మి.. చివరకు ఐదు లక్షల రూపాయలకు ఇస్తామని ఒప్పందం కుదర్చుకున్నారు. ఈ క్రమంలో వారిని అయిజకు రప్పించారు. డబ్బులు తెచ్చామని... డైమండ్ ఇవ్వమని అడగగా.. వారిని కొట్టి డబ్బులు తీసుకుని దుండగులు ఉడాయించారు. దాంతో బాధితులు చేసేదేమీ లేక అయిజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.