కాంట్రాక్టు ఉద్యోగులకు చంద్రబాబు షాక్
అమరావతి : ఎన్నికల ముందు బాబొస్తే జాబొస్తుందని ప్రకటనలతో పెద్ద ఎత్తున ఊదరగొట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులకు షాకిచ్చారు. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయుష్ ఉద్యోగుల అవసరం లేదని, జీతాలు ఇవ్వలేమంటూ, వారిని ఇంటికి పంపించడని ఆదేశాలు జారీచేశారు.
ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 2016–17 సంవత్సరం పనిచేసిన 12నెలల కాలానికి వేతనం కూడా ఇవ్వకూడదని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. తాజా ఉత్తర్వులతో భవిష్యత్లో ఇంకా ఎంత మందిని సర్కారు తొలగిస్తుందోనన్న భయం నెలకొంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఆయుష్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి సురేష్ స్పందిస్తూ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టిందని, దీనిపై 800 మంది ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.
కాగా ఆయుష్ ఉద్యోగులను తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తెలివిగా వ్యవహరించింది. ఏప్రిల్ 20 నాటికే ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులు సిద్ధం చేశారు. అయితే వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తే వాళ్లంతా.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారేమోనన్న అనుమానంతో ఏప్రిల్ 28 వరకూ జారీ చెయ్యలేదు. ఏప్రిల్ 28 నుంచి కోర్టు సెలవులు కావడంతో ఏప్రిల్ 30న అన్ని ప్రాంతీయ సంచాలకులకు పంపించారు.