పీవీఆర్, ఐనాక్స్ లకు బాహుబలి జోష్
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా మారుమ్రోగించిన బాహుబలి-ది బిగినింగ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేసింది. బాహుబలి: ది బిగినింగ్ రీఎంట్రీ మల్టిప్లెక్స్ ఆపరేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లకు భలే జోష్ నిచ్చింది. హిందీ వెర్షన్లలో 1000కి పైగా స్క్రీన్లపై ఈ సినిమాను మల్టిప్లెక్స్ లో ప్రదర్శిస్తున్నారు. బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా నేటి మార్కెట్లో పీవీఆర్ షేర్లు 3 శాతం పైగా పైకి దూసుకెళ్లగా.. ఐనాన్స్ 0.30 శాతం లాభపడ్డాయి. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు తీవ్ర నష్టాల దిశగా పయనిస్తున్న సమయంలోనే పీవీఆర్, ఐనాక్స్ షేర్లను బాహుబలి: ది బిగినింగ్ ఆదుకుంది.
గత మూడు నెలల్లో ఈ మల్టిఫ్లెక్స్ ల షేర్లు 30 శాతానికంటే పైకి దూసుకెళ్లాయి. మల్టిప్లెక్స్ ఆపరేటర్లకు మార్చి క్వార్టర్ ఎంతో లాభదాయకమైన త్రైమాసికమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దంగాల్, రాయిస్, కబాలి, జోలీ ఎల్ఎల్బీ2, బద్రినాథ్ కి దుల్హానియా వసూళ్లు ఈ కంపెనీ షేర్లకు భారీగా కలిసివచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాహుబలి రీ-రిలీజ్ మరింత సెంటిమెంట్ ను బలపరుస్తుందన్నారు. ఏప్రిల్ 28 'బాహుబలి 2' విడుదల అవుతున్న సందర్భంగా మరోమారు 'బాహుబలి 1'ను విడుదల చేసేందుకు థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించాయి.
తెలుగులో పరిమిత సంఖ్యలో విడుదలవుతున్నా.. హిందీలో మాత్రం మరోసారి ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఒక కొత్త సినిమా మాదిరిగానే హౌస్ ఫుల్ కావడం బాహుబలికున్న క్రేజ్ చాటిచెప్తోంది. ఈ రీ-రిలీజ్ సినిమాను 17వ తేదీ లోపున చూసిన వారికి, బాహుబలి 2 టిక్కెట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.