బాటిల్ మూతలో ఇరుక్కున్న నాలుక
తీవ్రంగా ఇబ్బంది పడ్డ చిన్నారి
పలమనేరు: పాలలో కలుపుకుని తాగే పేరొందిన ఓ బ్రాండ్ పొడి తీసుకుంటే ఉచితంగా వచ్చే వాటర్ బాటిల్ సిప్పర్‌లో నీళ్లు తాగుతూ ఓ బాలిక తన నాలుకను అందులో ఇరికిచ్చుకుంది. బాలిక నాలుకకు మత్తు మందు ఇచ్చి వైద్యుడు చాకచక్యంగా తొలగించిన ఘటన శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రంజిత అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. శనివారం బాలిక పాఠశాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు సిప్పర్(వాటిర్ బాటిల్)ను ఇచ్చిపంపారు.
బాలిక సిప్పర్‌తో నీరు తాగుతుండగా నాలుక అందులో ఇరుక్కుపోయింది. దానిని తొలగించేందుకు వీలు కాకపోవడంతో సమీపంలోని సాయిరామ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డా.యుగంధర్ తొలు త బాటిల్‌ను వేరుచేసి, నాలుకకు మత్తు మందు ఇచ్చారు. తర్వాత లాక్ అయిన సిప్పర్‌ను చాకచక్యంగా వేరు చేశారు. నీరు ఎలా తాగాలో కూడా తె లియని చిన్నారులకు సిప్పర్‌ను ఇవ్వడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.