35 మంది తమిళ కూలీలు అరెస్టు
బద్వేలు అర్బన్: బాలాయపల్లె పరిధిలోని చిరుతబండ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 35 మంది తమిళకూలీలను అరెస్టుచేసి వారి వద్ద నుంచి 44 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ డీఎస్.సుదర్శన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మైదుకూరు మండలం ఖాజీపేట సమీపంలోని నాగసానిపల్లె పరిధిలో గురువారం రాత్రి అధిక సంఖ్యలో తమిళకూలీలు పట్టుబడిన నేపథ్యంలో కొందరు తప్పించుకుని పక్కనే ఉన్న బాలాయపల్లెకు వచ్చారని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో గాలింపు చర్యలు చేపట్టాం. చిరుతబండ ప్రాంతంలో తమిళ కూలీలు తారసపడి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 44 ఎర్రచందనం దుంగల డంప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో డీఆర్వో బి.లక్ష్మీనారాయణ, ఎఫ్ఎస్ఓ .రమణ, ఎఫ్‌బివోలు జాకీర్‌హుసేన్, రవిచంద్ర, ఆనందం, కరుణాకర్ పాల్గొన్నారు.