Bale Bale Magadivoi
-
అమెరికాలోనూ మారుతి మేజిక్!
ఒక మతిమరుపు కుర్రాడిని తెరపై చూసి ఎవరైనా భలే మగాడు అంటారా? కానీ మారుతి తన మేజిక్‌తో అది సాధ్యమే అని నిరూపించాడు. ఈ మతిమరపు కథను ఇప్పుడు పరిశ్రమ ‘అన్ఫర్గెటబుల్ హిట్’గా కీర్తిస్తోంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా ‘భలే భలే మగాడివోయ్’ ప్రభంజనమే. మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమిది. యు.వి. క్రియేషన్స్, జిఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మాత. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అమెరికాలో అయితే ఏకంగా మిలియన్ డాలర్ల మార్క్‌ని అధిగమించి దర్శకుడు మారుతిని త్రివిక్రమ్, శ్రీను వైట్ల, రాజమౌళి, కొరటాల శివల సరసన చేర్చింది. నానిని కూడా అగ్ర కథానాయకుల జాబితాలోకి తీసుకెళ్లిందీ సినిమా. సాధారణంగా ఓవర్సీస్ ప్రేక్షకులు కామెడీని బాగా ఇష్టపడుతుంటారు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్ లాంటి దర్శకుల చిత్రాలు అమెరికాలో వసూళ్లు ఇరగదీస్తుంటాయంటే వాళ్ల సినిమాల్లోని కామెడీనే కారణం. ఆ తరహాలో ఈసారి మారుతి అదరగొట్టాడు. స్వచ్ఛమైన వినోదంతో సినిమా తీశాడు. చాలారోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వించే సినిమా వచ్చిందంటూ ‘భలే భలే మగాడివోయ్’కి అమెరికాలో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోలాగే విడుదలైన తొలిరోజే అమెరికాలో పాజిటివ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. లాభాలే లాభాలు... అప్పట్లో ప్రచారం కాలేదు కానీ, మారుతి తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ని అమెరికాలో రెండు లక్షల రూపాయలకు కొని విడుదల చేస్తే ఏకంగా 25 లక్షల వసూళ్లొచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్‌కి ఏ రేంజ్ లాభాలో ఊహించొచ్చు. అలాగే ‘ప్రేమకథా చిత్రమ్’ రూ.5 లక్షలకి అమ్ముడైంది. కాని ఇక్కడ ఆ సినిమాకి రూ.75 లక్షల వసూళ్లొచ్చాయి. ఇటీవల ‘భలే భలే మగాడివోయ్’ సినిమాని అమెరికాలో రూ.55 లక్షలకు అమ్మారు నిర్మాతలు. కానీ ఆ సినిమా ఏకంగా మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఈరకంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్‌లో మారుతి ఓ సరికొత్త ట్రెండ్‌ని సృష్టించినట్టే. అమెరికాలోనే కాదు... నైజామ్, ఆంధ్రా, సీడెడ్‌లలోనూ ‘భలేభలే మగాడివోయ్’కి థియేటర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మంచి సినిమాలే... దర్శకుడు మారుతి ఇదివరకు తీసిన సినిమాల్లో కూడా వినోదం చాలానే ఉంది. కాని దాంతో పోలిస్తే ‘భలే భలే మగాడివోయ్’లోని వినోదం విభిన్నమైనది. అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకుల నుంచి స్పందనొచ్చింది. మారుతి కామెడీ శైలిని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ స్పందనని చూసి మారుతి కూడా మరింతగా స్ఫూర్తి పొందుతున్నాడు. ‘‘మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న విషయం మరోసారి తెలుగు ప్రేక్షకులు రుజువు చేశారు. ఇకపై ఇలాంటి స్వచ్ఛమైన సినిమాలే తీస్తా. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులతోపాటు అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులకూ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు’’ అంటున్నాడు మారుతి. నాని టైమింగ్ అదుర్స్ ‘భలే భలే మగాడివోయ్’ కథని నాని తన టైమింగ్‌తో మరో స్థాయికి తీసుకెళ్లాడు. లక్కీ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించాడు. లావణ్యతోనూ మంచి కెమిస్ట్రీ పండించాడు. అందుకే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాని టైమింగ్ గురించీ, లావణ్య త్రిపాఠి అందం గురించి మాట్లాడుతున్నారు. ‘ఇది ఊహించని విజయం’ అంటున్నాడాయన. ‘సినిమా సక్సెస్ సాధిస్తుందని తెలుసు. కానీ ఈ స్థాయిలో సక్సెస్‌ని మాత్రం అస్సలు ఊహించలేదు. ఓవర్సీస్లో ప్రేక్షకుల ఆదరణని నిజంగా ఎప్పటికీ మరచిపోలేను’ అని చెప్పుకొచ్చాడు నాని. -
ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది
- బన్నీ వాసు ‘‘ఏ సినిమాకైనా దర్శకుడు హార్స్లాంటివాడు. ఆ హార్స్ సరిగ్గా వెళుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతది అని ఓ సందర్భంలో అల్లు అరవింద్‌గారు అన్నారు. ఆ మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఓ నిర్మాతగా సినిమాకి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను’’ అని బన్నీ వాసు అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్స్ వంశీ , జీఏ2 బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలతో పాటు ఇతర విశేషాలను బన్నీ వాసు చెప్పుకొచ్చారు. * విభిన్న ఇతివృత్తాలతో యూత్‌ఫుల్ చిత్రాలు చేయాలన్నదే మా జీఏ2, యూవీ క్రియేషన్స్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మా ముందు పెట్టింది అల్లు అరవింద్‌గారే. జీఏ2కి నేను, శిరీష్, యూవీకి వంశీ నిర్మాతలం. కాన్సెప్ట్ విషయంలో, సినిమాలు తయారు చేసే విధానంలో అరవింద్‌గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ‘‘కథను నమ్ముకుని బడ్జెట్ పెట్టాలి. హీరోను బట్టి బడ్జెట్ పెట్టొద్దు’’ అని అరవింద్‌గారు చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. * రెండేళ్ల క్రితం మారుతి ‘భలే భలే మగాడివోయ్’ కథ చెప్పాడు. కథ వింటున్నప్పుడు లెక్కలేనన్ని సార్లు నవ్వుకున్నాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. నేను విన్నదానికన్నా విజువల్‌గా ఇంకా బాగుంది. మారుతి కథ చెప్పినప్పుడు వంద శాతం నవ్వొస్తే, నాని ఆ కథను తన నటన ద్వారా ఆవిష్కరించిన తీరుకి రెండు వందల శాతం నవ్వొచ్చింది. * మారుతి ఈ కథ చెప్పినప్పుడే నాని అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే, ఈ సినిమా మొత్తం హీరో ఎంటర్టైన్మెంట్ మీద సాగుతుంది. నాని హండ్రడ్ పర్సంట్ మంచి టైమింగ్ ఉన్న హీరో. ఈ సినిమాలో తనకు మతిమరుపు ఉంటుంది. అది ప్రేయసికి తెలియనివ్వకుండా భలే మ్యానేజ్ చేస్తుంటాడు. అందుకే ‘భలే భలే మగాడివోయ్’ అని టైటిల్ పెట్టాం. నాని బ్రహ్మాండంగా చేశాడు. అరవింద్‌గారు ఎడిటింగ్ టైమ్‌లో చూసి, ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు నానీకి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చెయ్యి. తనతో ఇంకో సినిమా చేద్దాం’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’లో సీరియస్‌గా కనిపిస్తుంది. ఇందులో కామెడీ కూడా చేసి, బాగా నటించింది. * హీరోకి మతిమరుపు అంటే ‘గజిని’ సినిమా గుర్తుకు రావడం సహజం. కానీ, ఆ సినిమాకీ ఈ సినిమాకీ పోలికే లేదు. అది యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం కామెడీ వేలో సాగుతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ ఉండవు. కథలో భాగంగానే కామెడీ సాగుతుంది. * ఈ చిత్రాన్ని ప్రభాస్ చూసి, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఎడిటింగ్ టైమ్‌లో బన్నీ (అల్లు అర్జున్) చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. సీన్స్‌లో కానీ డైలాగ్స్‌లో కానీ వెతికినా కూడా ద్వంద్వార్థాలు కనిపించవు. ఈ చిత్రం చూడ్డానికి థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకు వెళతారు. * మారుతి, నేను రూమ్మేట్స్. వంశీ, నేను లాస్ట్ టెన్ ఇయర్స్‌గా డిస్ట్రిబ్యూషన్లో పార్టనర్స్. నాని, వంశీ ఫ్రెండ్స్. సో.. నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసిన చిత్రం ఇది అనొచ్చు. వంశీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి ముందుంటాడు. సంగీత దర్శకుడిగా గోపీసుందర్‌ని తీసుకుందామని వంశీ, మారుతీయే అన్నారు. పాటలు సక్సెస్ అయ్యాయి. రీ-రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది, * ‘ప్రేమకథా చిత్రమ్’లో ఓ రెండు రీళ్లు పడీ పడీ నవ్వుకుంటాం. ఈ సినిమాలో అలా నవ్వుకోవడానికి నాలుగు రీళ్లు ఉంటాయి. సినిమా మీద నమ్మకంతో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. * వంశీ, నేను వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. మున్నా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం, ప్రభాకర్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నాం. ఓ రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. -
కెమిస్ట్రీ అదిరింది!
‘‘నా కెరీర్‌కి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేశాను. నా పాత్ర మాత్రమే కాదు.. లావణ్య పాత్ర కూడా చాలా బాగుంటుంది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది’’ అని నాని చెప్పారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 క్రియేషన్స్, యూవీ క్రియేషన్స్ పతాకంపై నాని, లావణ్య త్రిపాఠి జంటగా బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మారుతి మాట్లాడుతూ -‘‘రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. నాని, లావణ్య త్రిపాఠి మధ్య వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వెన్నెల కిషోర్, నాని కాంబినేషన్లో వ చ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. పాటలు ఓ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘గోపీ సుందర్ చాలా మంచి పాటలు అందించారు. కుటుంబ సమేతంగా అందరూ హాయిగా ఆస్వాదించే సినిమా అవుతుంది. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నిజార్ షఫీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్.