Bandameedapalli
-
ఆలయాల్లో చోరీ
రాప్తాడు : రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలోని సల్లాపురమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆయా ఆలయాల్లోని అమ్మవార్ల సొత్తులు, హుండీల్లోని నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయాల నిర్వాహకులు, గ్రామపెద్దల కథనం మేరకు... గురువారం రాత్రి ముత్యాలమ్మ ఆలయ పూజారి నారాయణప్ప, అతని కుమారుడు అమ్మవారికి పూజలు చేశారు. ఆలయం దగ్గరే 11 గంటలకు వరకు ఉండి గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఈ ఆలయానికి అర కిలోమీటర్ దూరంలోనే సల్లాపురమ్మ ఆలయమూ ఉంది. సల్లాపురమ్మకు ఆలయ పూజారి మాధవరాజు పూజల అనంతరం కుటుంబ సభ్యులతో కలసి కమ్యూనీటి భవనంలో నిద్రించారు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఆలయాల తలుపులను పగులకొట్టి లోనికి ప్రవేశించారు. సల్లాపురమ్మ ఆలయంలోని రెండున్నర కేజీల వెండి నగలతో పాటు హుండీలోని నగదును తీసుకెళ్లారు. ఆ తరువాత హుండీని పాలవాయి రోడ్డులో పడేశారు. ముత్యాలమ్మ ఆలయంలోని బీరువాను పగులగొట్టి అందులోని అర కిలో వెండి వస్తువులను తీసుకెళ్లారు. హుండీలోని రూ.10 వేల నగదును అపహరించారు. శుక్రవారం ఉదయమే చోరీ జరిగినట్లు గుర్తించిన పూజారులు గ్రామస్తులకు విషయం తెలతిపారు. ఆ తరువాత సర్పంచ్ దగ్గుపాటి శ్రీనివాసులు, మాజీ సర్పంచు మాధవయ్య, గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఎస్ఐ ధరణిబాబు తమ సిబ్బందితో ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫింగర్ ఫ్రింట్స్, క్లూస్ టీం, డాగ్ స్కాడ్ను రప్పించారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
శింగనమల : శింగనమల మండలం బండమీదపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... పెరవలి నుంచి కూలీలతో వెళ్తున్న ఆటోను శివపురం నుంచి వస్తున్న నీళ్ల ట్యాంకర్ ట్రాక్టర్ ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు గాయపడ్డారన్నారు. గాయపడిన వారిలో రాజకుళ్లాయప్ప, నల్లమ్మ, రమాదేవి, చామండి, కుళ్లాయమ్మ, బయక్క ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్ కోసం వచ్చి...
అనంతపురం : పింఛన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు, పింఛన్ తీసుకోకుండానే మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం బండమీదిపల్లి ఎలిమెంటరీ పాఠశాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. బండమీదిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప (75) అవివాహితుడు. దాంతో ఉప్పర్పల్లి గ్రామంలోని బంధువుల ఇంటిలో నివసిస్తున్నాడు. అతడికి పింఛన్ మంజూరైందని సమాచారం అందుకున్నాడు. ఆ క్రమంలో బుధవారం బండమీదిపల్లి గ్రామానికి వచ్చాడు. రిజిస్టర్లో నారాయణప్ప చేతి వేలిముద్రలు పడకపోవడంతో అధికారులు గురువారం రమ్మని చెప్పారు. దాంతో నారాయణప్ప బుధవారం రాత్రి అదే పాఠశాలలో నిద్రపోయాడు. గురువారం ఉదయం పాఠశాల వద్దకు వచ్చిన అధికారులు నారాయణప్ప పాఠశాల నేలపై పడి ఉన్నాడు. అతన్ని లేపేందుకు ప్రయత్నించగా... నారాయణప్ప లేవలేదు. దీంతో అధికారులు స్థానిక వైద్యుడిని తీసుకు వచ్చి నారాయణప్పను పరీక్షించారు. అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. నారాయణప్ప బంధువులకు ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు.