హింసపై పోరుకు టెక్ దిగ్గజాలు సై
ఢాకా : హింసాత్మక చర్యలపై పోరాడటానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రపంచ టెక్ దిగ్గజాలు సహకరించనున్నాయి. ఫేస్ బుక్, మైక్రోసాప్ట్, గూగుల్ లు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పనిచేయడానికి సమ్మతించాయి. ఇంటర్నెట్ లో అనుచిత విషయాలపై తమ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నట్టు ఆ దేశ టెలికాం మంత్రి తరానా హలీమ్, పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ఇస్టామిస్ట్ ల సెక్యులర్ బ్లాగర్లు, మైనార్టీలపై ఎక్కువగా హింసాత్మక హత్యలు జరుగుతున్నాయని గుర్తించామని, వీటిని నియంత్రించడానికి టెక్ దిగ్గజాల సహాయం కోరినట్టు ప్రకటించారు.. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మాత్రమే కాక, రెండు ఇంటర్నెట్ సంస్థలు గూగుల్, మైక్రోసాప్ట్ లు ప్రభుత్వ అభ్యర్థనను రెండు రోజుల వ్యవధిలోనే అంగీకరించాయని ప్రశ్నోత్తరాల సమయంలో తరానా పేర్కొన్నారు.
గతేడాది ఫేస్ బుక్ వాడకాన్ని, దాన్ని మెసెంజర్ యాప్ ను, ఇతర కమ్యూనికేషన్ యాప్ లను బంగ్లాదేశ్ ప్రభుత్వం 22 రోజులు సస్పెండ్ చేసింది. పోలీసు చెక్ పోస్టు వద్ద జరిగిన దాడి, ఇద్దరు విదేశీయుల హత్య నేపథ్యంలో భద్రతా కారణాలతో వీటిని నిలిపివేసినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. 22 రోజుల నిషేధానికి ముందు, ప్రముఖ కాలింగ్, మెసెంజర్ సర్వీసులు వాట్సాప్, వైబర్ లను కూడా చాలా రోజులు బ్లాక్ చేసింది. కమ్యూనికేట్ కోసం ఈ యాప్ లను వాడటం వల్ల హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని గుర్తించడం కష్టతరమవుతుందని పోలీసులు పేర్కొనడంతో, ఆ దేశ ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలుచేసింది. గతేడాది నవంబర్ లో ఈ విషయాలపై ఫేస్ బుక్ అథారిటీలతో చర్చిండానికి తరానా ఆ దిగ్గజ అధికారులకు లేఖ రాశారు. ఫేస్ బుక్ ఆసియా పసిఫిక్ ప్రధాన కార్యాలయం సింగపూర్ లో అథారిటీలతో భేటీ కూడా అయ్యారు.
అనంతరం సోషల్ మీడియా దిగ్గజం అనుచిత విషయాలపై ప్రభుత్వానికి సహకరించడానికి ఒప్పుకుందని తరానా మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ కోరిక మేరకు యూట్యూబ్ నుంచి అభ్యంతర వీడియోలను తొలగించడానికి గూగుల్ ఒప్పుకుందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అతివాద ఇస్లామిస్ట్ ల ద్వారా హింసాత్మక చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ హత్యలను తామే చేశామని ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా ప్రకటించుకోవడంపై ప్రభుత్వం ఖండించింది. బంగ్లాదేశ్ లో ఈ గ్రూపులు లేవని పేర్కొంది.