రైతులకు మెరుగైన సేవలు
డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి
నెల్లూరు రూరల్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి అన్నారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బ్యాంక్ మహాజన సభ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ బ్యాంకు సేవలను విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. స్వల్పకాలిక పంట రుణాలతో పాటు ట్రాక్టర్స్, మైనర్ ఇరిగేషన్, పండ్ల తోటల పెంపకానికి, సామాజిక వనరుల అభివృద్ధి, గొర్రెలు, గేదెల కొనుగోలుకు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సొసైటీల ద్వారా ఎరువులు, విత్తనాల క్రయ, విక్రయాలు, ధాన్యం కొనుగోళ్ల వల్ల లాభాలు గడిస్తున్నాయన్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన పథకాలను బ్యాంక్ ద్వారా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ బ్యాంక్ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్రెడ్డి, సీఈఓ రాజారెడ్డి, నాబార్డు ఏజీఎం రమేష్‌బాబు, ఆప్కాబ్ డీజీఎం విజయభాస్కర్‌రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.