విపక్షాలవి క్షుద్ర రాజకీయాలు
ఎమ్మెల్సీ కర్నె, ఎమ్మెల్యే రసమయి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, దానికి అనుబంధంగా పనిచేస్తున్న విపక్షాలు దివాలాకోరు విమర్శలు చేస్తున్నాయని, స్థానికంగా ఎక్కడ చిన్న గొడవ జరిగినా దాన్ని ప్రభుత్వానికీ, టీఆర్ఎస్కు ఆపాదిస్తూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. మానకొండూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని, సంఘటన జరిగిన వెంటనే తమ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారని అన్నారు.
బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మహంకాళి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోబోతుంటే పరశురామ్ వారించబోయి గాయపడ్డారని రసమయి వివరించారు. గాయపడిన వారిని అంబులెన్సులో తానే స్వయంగా హైదరాబాద్ తరలించానని, పరశురామ్ 80 శాతం కోలుకున్నారని ఆయన తెలిపారు. దళితులు తగలబడుతుంటే కాంగ్రెస్ నేతలు ఆ మంటల్లో చుట్టలు కాల్చుకుంటున్నారని, ఈ తరహా రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.