ఇంగ్లిష్‌లో మాట్లాడితే... ఆయనకు కోపం వచ్చేది
నేడు బాపు జయంతి
ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే బాపు రమణల ఫొటోతో పాటు, ‘వెంకటేశ్వర స్వామి, వినాయకుడు’,‘అర్ధనారీశ్వరులుగా ఉన్న పార్వతి చేతిలో వినాయకుడు’,‘జానకితో జనాంతికం’ కవర్ పేజీ... ఇలా పురాణ గాథల చిత్ర కథల సమాహారంప్రత్యక్షమవుతుంది.ఆయనలాగే ఆయన ఇల్లు కూడా మౌనంగా... మనోహరంగా కనిపిస్తుంది.నేడు బాపు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమార్తె భానుమతి, చిన్నకుమారుడు వెంకటరమణ, సోదరుడు శంకరనారాయణ సాక్షికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ...
నాన్న చాలా సెన్సిటివ్
నాన్న పోయినప్పుడు అంతిమయాత్రలో అందరూ చెయ్యివేస్తుంటే, నాన్న ఎంత సెలబ్రిటీనో అనిపించింది. ఏదైనా స్తోత్రం చదువుతుంటే, నాన్న వేసిన అమ్మవారు, వైకుంఠం అన్నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అన్నీ నాన్న చెప్పినవే. చిన్నప్పుడు సెలవుల్లో అందరి భోజనాలు అయ్యాక, అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని, రామాయణం కథలు చెప్పేవారు. వాస్తవానికి నాన్న చాలా సరదాగా ఉంటారు. అయితే ఆయన బొమ్మలు వేసుకుంటూ ఉండటం వల్ల ఆయన్ను డిస్టర్బ్ చేసేవాళ్లం కాదు.
మా చిన్నమ్మాయి లాస్య అంటే నాన్నకు ఎంతో ఇష్టం. డిస్నీ కార్టూన్ వేసి మరీ చూపించేవారు. మా అందరిలోకీ పెద్ద తమ్ముడు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. నేను, చిన్న తమ్ముడు మాత్రం నాన్నతో మాట్లాడటం బాగా తక్కువ. నాన్న కూడా ఇంటి విషయాలన్నీ మా పెద్ద తమ్ముడితోనే షేర్ చేసుకునేవారు.నాన్న చాలా సెన్సిటివ్. తనతో మాట్లాడేవారి గొంతులో కొంచెం తేడా వచ్చినా చాలా బాధపడేవారు. ఆయన పని ఆయనే చేసుకోవాలి. కనీసం భోజనం చేసేటప్పుడు మేం వడ్డిద్దామన్నా ఆయనకు నచ్చేది కాదు. ఆయనకు కావలసింది ఆయనే వేసుకుంటారు.
ఏదైనా బొమ్మ వేస్తుంటే ఆ ఫీలింగ్ ఆయన ముఖంలో కనిపించేది.‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి. బాగా బోల్డ్‌గా ఉండాలి’ అనేవారు. మగపిల్లలనయినా ఎప్పుడైనా కొట్టేవారేమో కాని, నన్ను ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. అందరూ కలిసిమెలిసి ఉండాలనేవారు. ఎవరైనా ఇంగ్లిషులో మాట్లాడితే ఆయనకు కోపం వచ్చేది. తెలుగు, చదువు, సంగీతం... ఈ మూడే మనం పెద్దవాళ్లమయినప్పుడు మనతో ఉంటాయి అనేవారు. తిరుపతిలో జరిగే నాన్న జన్మదిన వేడుకలకి 15 మంది వెళ్తున్నాం. గతంలో భద్రాచలం వెళ్లినప్పుడు కూడా సుమారు 15 మంది దాకా వెళ్లాం. - భానుమతి, కూతురు
మంచి కథలు చెప్పేవారు
నాన్న దగ్గర మాకు చనువు బాగా తక్కువ. ఆయన ఎప్పుడూ ఏవో బొమ్మలు వేసుకుంటూ, చదువుకుంటూ ఉండేవారు. అందుకని ఆయనను డిస్టర్బ్ చేయొద్దని అమ్మ చెబుతుండేది. కాని... మా చిన్నతనంలో నాన్న మంచి మంచి కథలు చెప్పేవారు. ముఖ్యంగా రామాయణం చెప్పేవారు. చెన్నైలో షూటింగ్ ఉంటే అయిపోయాక ఇంటికి వచ్చి మాతోనే గడిపేవారు. నాన్న ఆఖరి రోజుల్లో మాత్రం కొంచెం దగ్గరగా ఉన్నాను.
నాన్న ప్రతి సినిమా ప్రివ్యూకీ మా అందరినీ తీసుకువెళ్లేవారు. రాజమండ్రి లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుంటే మేము, మామ (ముళ్లపూడి వెంకట రమణగారిని మామా అని పిలుస్తారు) పిల్లలు మొత్తం ఆరుగురం, అమ్మ (భాగ్యవతి), అత్త (రమణగారి శ్రీమతి శ్రీదేవి) అందరం కలిసివెళ్లేవాళ్లం. అయితే అక్కడ షూటింగ్ స్పాట్లో కాకుండా, మేమంతా వేరేచోట ఉండేవాళ్లం.
నాన్న ఏది పెట్టినా మాట్లాడకుండా తినేవారు. ‘ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలే కానీ విడిపోకూడదు’ అని చెప్పేవారు నాన్న. విడివిడిగా ఉండటమంటే నాన్నకి నచ్చదు. ఏదైనా పని మొదలుపెడితే ఆ పని పూర్తయ్యేవరకు ఆయనకు తోచదు. ఎవరైనా ఫలానా టైమ్‌కి ఇంటికి వస్తామంటే ఆ టైమ్‌కి రెడీ అయిపోయి మేడ మీద నుంచి, కిందకు దిగి కూర్చునేవారు. వస్తామన్న వాళ్లు కనుక ఆ టైమ్‌కి రాకపోతే, చాలా అసహనంగా ఉండేవారు. అంతా పంక్చువల్‌గా, పర్ఫెక్ట్గా అయిపోవాలి ఆయనకు.
నాన్న, మామ మాట్లాడుతుంటే అందరం కూర్చుని సరదాగా వింటుండేవాళ్లం. నాన్నకి పుట్టినరోజు, షష్టిపూర్తి వంటి వేడుకలు చేసుకోవడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో మాత్రం అందరం కలిసి సరదాగా పండగలా చేసుకునేవాళ్లం.
- వెంకటరమణ, చిన్నకుమారుడు
కొత్త పుస్తకం వస్తే చాలు...
మా నాన్నగారికి గాంధీజీ అంటే ఇష్టం. అందుకే మా అన్నయ్యని చిన్నతనం నుంచీ బాపు అని పిలిచేవారు. అన్నయ్య చిన్నప్పటి నుంచీ చాలా సెలైంట్. మా తాతగారు చిన్నతనంలోనే పోయారు. దాంతో నా బాధ్యత బాపు అన్నయ్య మీదే పడింది. అన్నయ్యే నన్ను డిగ్రీలో వివేకానంద కాలేజీలో చేర్పించాడు.
అన్నయ్యకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అన్నయ్య, రమణ అన్నయ్య కలిసి ఎన్ని సినిమాలు చూశారో లెక్కలేదు. అంతేకాదు, ఎక్కడ ఏ పుస్తకం కనిపించినా సరే అది కొని చదవాల్సిందే. పాత పుస్తకాల కోసం మూర్ మార్కెట్‌కి వెళ్లేవారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే, కార్టూన్ బుక్స్ తీసుకురమ్మని చెప్పేవారు. హిగిన్ బాథమ్స్ షాపుకి వెళ్లి ఖరీదైన పుస్తకాలు కొనేవారు. కొన్నాళ్లయ్యాక వాళ్లకి బాగా అలవాటైపోయి, ఏ కొత్త పుస్తకం వచ్చినా, ఎంత ఖరీదైనదైనా సరే మా ఇంటికి పంపేవారు. పుస్తకాలు
కొనడానికి ఎంత డబ్బు ఖర్చుచేయడానికైనా వెనకాడడు అన్నయ్య. నేను ఒకసారి భద్రాచలం వెళ్లినప్పుడు ఒక రాములవారి బొమ్మ కొనితెచ్చి ఇచ్చాను. ఆ బొమ్మను అన్నయ్య తన మందిరంలో పెట్టుకున్నాడు.ఎవరిదైనా మంచి కథ చదివినప్పుడు, మంచి బొమ్మ చూసినప్పుడు వాళ్ల అడ్రస్ కనుక్కుని వాళ్లకి ఫోన్ చే సి అభినందించేవారు. ఎవరికైనా కొరియర్ పంపించాలన్నా ఎంతో నీట్‌గా ప్యాక్ చేసి, ముత్యాల లాంటి అక్షరాలతో రాసేవారే కానీ, చెత్తచెత్తగా చేయడమంటే ఆయనకు నచ్చదు.
మా నాన్నగారికి ఉన్న కోపమే అన్నయ్యకూ వచ్చింది. అయితే వచ్చిన కోపం హారతి కర్పూరంలా వెంటనే కరిగిపోయేది. ఎవరైనా సన్మానం చేసి సన్మానపత్రం ఇచ్చి ఫోటో స్టిల్ ఇవ్వమంటే, ముఖానికి అడ్డంగా సన్మానపత్రం ఉంచుకునేవారు. వాళ్లు ‘అయ్యా కాస్త కిందకి దించండి’ అనేవారు. అన్నయ్య కారు చాలా స్పీడ్‌గా నడుపుతారు. నా బొమ్మలు చూసి లోపాలు సరిచెప్పేవారు. మా ఇంట్లో శుభకార్యాలన్నీ అన్నయ్య ఇంట్లోనే జరిగేవి. నేను అన్నయ్య, రమణ ముగ్గురం సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం.
- శంకర నారాయణ, తమ్ముడు
ప్రాతః స్మరణీయుడు
మన తెలుగుజాతి వైభవాన్ని, సంస్కృతిని, మన విభిన్న కళారూపాల విస్తృత సౌరభాన్ని వేవేల కోణాల్లో, వెల కట్టలేని అందాలతో, అవకాశమున్న అన్ని మాధ్యమాల్లోనూ, దాదాపు ఏడు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా ఆవిష్కరించిన మహనీయ కళాకారుడు బాపు, నిస్సందేహంగా మనందరికీ ప్రాతః స్మరణీయుడే.
మన తెలుగు భాష నుడికారాన్ని మహిమాన్విత మణిహారంగా తీర్చిదిద్ది, మరే భారతీయ భాషకూ అబ్బని అపురూప సౌరభాన్ని, సొగసును మన భాషకు కూర్చిన బాపుకి మరెవరైనా దీటు రాగలరా! అనుక్షణం మన ముందు కదలాడే అతి సాధారణ వ్యక్తుల్నీ, పెద్దగా కంటికానని పరిసర వాతావరణాన్ని, మరే కెమేరా పట్టలేని తనదైన ప్రత్యేక దృక్కోణంలో, పరమాద్భుత మనిపించేలా, పటం కట్టిన పంచవర్ణ చిత్రాలుగాను, సృష్టికందని సజీవ చలన చిత్రాలుగానూ మలచిన బాపుని మరెవరైనా తోసిరాజనగల రా! అసలు సిసలు తెలుగందాలు, మన అతివల చీరకట్టులోనూ, కాటుక బొట్టులోనూ, వారి ముద్దొచ్చేవాల్జడల్లోనూ, మురిపించే మూతి విరుపుల్లోనూ, ముంగిట్లో ముగ్గేస్తున్న మన ముద్దరాళ్ల భంగిమల్లోనూ...
అసలుకన్నా మధురంగా చూపిస్తూ సమ్మోహనపరచే బాపులాంటి అద్భుతం మనకే స్వంతం - అంటే ఎవరైనా కాదనగలరా! వెనక నుంచి భజంత్రీలు వినబడుతున్నాయి... కాబట్టి బాపు అనగానే శ్రీరాముడూ, శ్రీరాముణ్ణి తలిస్తే బాపు స్ఫురించేంత లోతుగా ఆ పరమాత్ముడితో మమేకమైన బాపు మనకి నిత్య ప్రాతః స్మరణీయుడు కాక మరింకేవిటి...
- శంకు, ప్రముఖ కార్టూనిస్టు