పరవాడలో బీకే టీఎంటీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పరవాడలో బీకే గ్రూప్ నిర్మించిన టీఎంటీ స్టీల్ బార్ల తయారీ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం ఈ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించారు. పారిశ్రామికవేత్త కంటిపూడి సర్వారాయుడుతో బీకే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వికాస్ బన్సాల్, మానవ్ బన్సాల్లు ప్రారంభోత్సవం చేయించారు. అనంతరం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తమకు స్టీల్ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పరవాడలో ఎఫ్ఈ 500డి టీఎంటీ ప్లాంట్ను నెలకొల్పామన్నారు.
దీనికి సుమారు రూ.75 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఇది రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగంలోనే అతి పెద్ద ప్లాంట్ అని వివరించారు. దీంతో తమ బీకే గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.800 కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. తమ ప్లాంట్లో 8 నుంచి 40 ఎంఎం సైజ్ వరకు టీఎంటీ బార్ల ఉత్పత్తి జరుగుతుందన్నారు. బీకే ప్లాంట్ల స్టీల్ ఉత్పత్తులను మెక్సికో, న్యూజి లాండ్, కెనడా, ఇంగ్లండ్, సౌదీ అరేబియా, బెహ్రయిన్, ఖతార్, యూఏఈ, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో మార్కెటింగ్ చేస్తున్నామని తెలిపారు.