ఆరు బాల్య వివాహాలకు చెక్
ఒంగోలు టౌన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆధికారులు శనివారం ఆరు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. వివరాలు.. పొదిలి మండలం కుంచేపల్లి గ్రామానికి చెందిన బీరం శ్రీనివాసరెడ్డి తన 15 ఏళ్ల కుమార్తెను అదే గ్రామానికి చెందిన ఆమె మేనమామ నాగేశ్వరరెడ్డికి ఇచ్చి శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యాడు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ ప్రతినిధులు, సీడీపీఓ రేచల్‌సరళ, సూపర్వైజర్ రమ, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో అక్కడకు చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
బాలికకు 18 ఏళ్లు నిండేవరకూ పెళ్లి చేయమని తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక హామీ తీసుకొని బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌కు అందించారు. మర్రిపూడి మం డలం కూచిపూడిలో మల్లం సుబ్బయ్య తన 15 ఏళ్ల కుమార్తెను మేనమామ తిమ్మయ్యకు ఇచ్చి ఈ నెల 14వ తేదీ వివాహం జరపాలని నిర్ణయించాడు. విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్ ప్రతినిధులు, సీడీపీఓ రేచల్‌సరళ, సూపర్వైజర్ రమ పోలీసుల సహకారంతో గ్రామానికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ తల్లిదండ్రుల నుంచి కూడా బాలికకు మైనార్టీ తీరే వరకూ వివాహం చేయమని రాతపూర్వకంగా తీసుకున్నారు.
గంగదొనకొండలో..
కురిచేడు : మండలంలోని గంగదొనకొండలో ఈ నెల 13న జరగాల్సి ఉన్న బాల్య వివాహాన్ని ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు శనివారం అడ్డుకున్నారు. సీడీపీఓ ఎం.పద్మావతి కథనం ప్రకారం.. గంగదొనకొండకు చెందిన మాచవరపు వెంకట సుబ్బయ్య తన మేనకోడలు నాగలక్ష్మి(16)ని పెంచుకుంటున్నాడు. త్వరగా పెళ్లి చేయాలన్న తలంపుతో మైన ర్టీ తీరకుండానే తన తమ్ముడు కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. బాలికకు మైనార్టీ తీరలేదని తెలిసి సీడీపీఓ పద్మావతి, చైల్డ్‌లైన్ అధికారులు కిషోర్‌కుమార్, మూర్తిలు అక్కడికి వెళ్లి వెంకటసుబ్బయ్యతో మాట్లాడి పెళ్లి జరగకుండా చర్యలు తీసుకున్నారు.
అద్దంకిలో ముగ్గురికి తప్పిన బాల్య వివాహాలు
అద్దంకి: పట్టణంలో అధికారుల చొరవతో ముగ్గురి బాలికలకు బాల్య వివాహాలు తప్పాయి. అధికారులు శనివారం బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లిళ్లను నిలుపుదల చేశారు. వివరాలు.. ముగ్గురు బాలికలు పాఠశాలకు రాకపోవడంతో ఎంఈఓ విజయకుమార్‌కు అనుమానం వచ్చింది. వారు ఎందుకు రావడం లేదో ఆరా తీయగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని తెలిసి ఆయన అప్రమత్తమయ్యారు. తహశీల్దార్ అశోక్‌వర్థన్, సీఎంఓ గంగాధర్‌ను పలిపించి బాలికల తల్లిదండ్రులతో మాట్లాడారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ముగ్గురు విద్యార్థినులను పాఠశాలలో వదిలి పెట్టారు. బాగా చదువుకోవాలని చెప్పారు.