ఓ బార్బర్.. 150 లగ్జరీ కార్లకు యజమాని
బెంగళూరు: అతనికి ఓ రోల్స్ రాయ్స్, 11 మెర్సిడెజ్, 10 బీఎండబ్ల్యూ, 3 ఆడి, 2 జగ్వార్ కార్లు ఉన్నాయి. ఈ మధ్య జర్మనీ నుంచి మేబ్యాచ్ కారు కొనుగోలు చేశాడు. దీని ఖరీదు అక్షరాలు 3.2 కోట్ల రూపాయలు. బెంగళూరులో ఇలాంటి కార్లు మూడు మాత్రమే ఉన్నాయి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, మరో బిల్డర్ తర్వాత ఈ కారు కొన్నది ఆయనే. ఈ ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తుంటాడు. ఇంతకీ ఆయన ఎవరంటే.. ఓ బార్బర్. ఓ హెయిర్ కట్ చేస్తే 75 రూపాయలు తీసుకుంటాడు. ఓ బార్బర్ దగ్గర ఇన్ని ఖరీదైన కార్లు ఉన్నాయంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయినా ఇది అక్షరాలా నిజం. బెంగళూరులోని 45 ఏళ్ల రమేష్ బాబు అనే బార్బర్ ఆదర్శనీయమైన విజయగాథ ఇది. ఓ బార్బర్ గా కెరీర్ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ 150 లగ్జరీ కార్లకు యజమాని అయ్యారు. అయినా ఇప్పటికీ ఆయన రోజూ సెలూన్ లో పనిచేస్తారు.
రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీకి ఆయన యజమాని. కోట్లాది రూపాయల కంపెనీకి యజమాని అయినా రమేష్ తన మూలాలను మరచిపోలేదు. రోజూ సెలూన్లో కనీసం ఐదు గంటలు పనిచేస్తారు. రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లకు ఆయనే హెయిర్ కట్ చేస్తారు. గత 30 ఏళ్లుగా ఆయన దినచర్య ఇది. సెలూన్లో పనిచేయడం ఆయన వృత్తిలో ఓ భాగం మాత్రమే. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ద్వారా ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తూ బిజినెస్ చేస్తుంటారు. ఆయన ఖరీదైన రోల్స్ రాయ్స్ కారులో తిరుగుతుంటారు. గత నెలలో మేబ్యాచ్ కారును కొనుగోలు చేశారు. మాల్యా, మరో బిల్డర్ దగ్గర తర్వాత ఈ మోడల్ కారు తనవద్దే ఉందని రమేష్ గర్వంగా చెబుతారు.
'నాకు దేవుడి దయ ఉంది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ప్రతి లగ్జరీ కారునూ కొనుగోలు చేయాలన్నది నా కల. వీటిని డ్రైవింగ్ చేస్తుంటే థ్రిల్‌గా ఉంటుంది. నేనెప్పుడూ నా మూలాలను మరవను. నాన్న చనిపోయాక పేదిరకం అనుభవించాం. అమ్మ ఎన్నో కష్టాలుపడి మమ్మల్ని పోషించారు. అందుకే నేను ఇప్పటికీ సెలూన్లో పనిచేస్తుంటా' అని రమేష్ చెప్పారు. ఆయన తొమ్మిదో ఏట ఉన్నప్పుడు తండ్రి మరణించారు. పదోతరగతి పూర్తయ్యాక చదువుకు స్వస్తి చెప్పి తండ్రిలా బార్బర్‌గా కెరీర్ ప్రారంభించారు. సెలూన్లో పనిచేస్తూనే 1994లో ఓ మారుతి వ్యాన్ తీసుకుని అద్దెలకు ఇవ్వడం ప్రారంభించారు. ఇదే ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ లగ్జీరీ కార్లకు యజమాని అయ్యారు.