కథ చెబుతాను ఊ కొడతారా...
ముంబై: కథ చెబుతాను.. ఊ కొడతారా.... అంటూ చిన్నపుడు మన పెద్దవాళ్లు కథలు చెప్పిన వైనం గుర్తుందా.. కథలోని దృశ్యాల్ని మన కళ్లముందు ఆవిష్కరింప జేస్తూ చెబుతోంటే..భలే తమాషా ఉంటుంది కదూ. కాజీ మజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మకథలు..విక్రమార్కుని కథలు.. దెయ్యం కథలు..ఇలా..ఎన్నెన్ని కథలు. అయితే ఇపుడు రోజులు మారాయి. డిజిటల్ యుగం వచ్చేసింది. స్టోరీ టెల్లర్స్ దాదాపు కనుమరుగు. వీరి స్థానాన్ని వీడియోలు ఆక్రమించేశాయి. ఈనేపథ్యంలోనే తండ్రీ కూతుళ్ల స్టోరీ టెల్లింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తండ్రి ఒడిలో కూర్చొని ఓ బుల్లి గడుగ్గాయి చేస్తున్నచేష్టలు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తండ్రి చెబుతున్న కథకు అనుగుణంగా ఆ చిన్నారి చూపిస్తున్నహావభావాలు అబ్బుర పరుస్తున్నాయి. ఒక అడవిలోకి వెళ్లిన పాప అడవిలోని అన్ని రకాల జంతువులను చూసే కథనంతో ఉన్న ఈ వీడియోలో పాప అభినయం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గుర్రం, కుందేలు, కోతి, చేప ఇలా ప్రతి జంతువును ఆ చిన్నారి తన హావభావాలతో నైపుణ్యంగా ఆవిష్కరిస్తున్న వైనం పలువురిని ఆకట్టు కుంటోంది.
కాగా గత ఏడాది ఫేస్ బుక్ లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ బుల్లి గడుగ్గాయి వీడియో సాధించిన షేర్లు ఎన్నోతెలుసా...అక్షరాల లక్ష. ఇక లైకుల విషయానికి వస్తే ..అరవై వేలకు పైమాటే. మరి ఇంకెందుకు ఆలస్యం..మనమూ ఓ లైక్ కొడితే పోలా..