నిఘా లేక దగా...
=విజయవాడలో మహిళలకు కరువవుతున్న రక్షణ
=మెట్రోనగరాల తరహాలో మోసాలు
=నెలరోజుల్లో మూడు సంఘటనలు
= భయభ్రాంతులకు గురవుతున్న నారీలోకం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి మహిళలను నమ్మకంగా విజయవాడ తీసుకొచ్చి అఘాయిత్యాలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రధానంగా నగరంలో పోలీస్ నిఘా కొరవడడంతో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. గత నెల ఐదో తేదీ రాత్రి రైల్వే స్టేషన్లో 29 ఏళ్ల వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. తప్పిపోయిన తన బిడ్డను వెతుక్కుంటూ పిడుగురాళ్లలో హైదరాబాద్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అదే రోజు విజయవాడ స్టేషన్లో దిగింది.
తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఆమె రాజమండ్రి వెళ్లేందుకు ప్యాసింజర్ రైల్లో కూర్చోగా, ముగ్గురు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం నెల్లూరుకు చెందిన మహిళను ఆమె భర్తే గవర్నర్‌పేట లాడ్జిలో హత్య చేశాడు. పిల్లలు పుట్టలేదని భార్య సుజాతపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీనికి విజయవాడను సురక్షిత ప్రదేశంగా ఆ భర్త ఎంచుకున్నాడు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఇంట్లో అలిగి విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి వచ్చింది.
అక్కడి షాపుల్లో వర్కర్లు ఆమెను చేరదీసి మాయమాటలతో లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డారు. చేసిన తప్పునకు లెంపలేసుకుని తన ఇంటికి వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్న ఆ బాలిక వన్‌టౌన్ పోలీసులకు చిక్కింది. వారు ఆ బాలికను మందలించి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు విచారణ జరపగా ఒకరి తరువాత మరొకరు.. ముగ్గురు నిందితులయ్యారు. ఏకంగా ఆ బాలికను వారు నెల రోజులపాటు వన్‌టౌన్‌లోని ఓ ఇంట్లో ఉంచి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలిక వివరించింది.
మరిన్ని మహిళా స్టేషన్లు కావాలి..
నగరం మొత్తం మీద మహిళా పోలీస్ స్టేషన్ ఒకే ఒక్కటి ఉంది. బస్టాండ్, రైల్వేస్టేషన్, దుర్గగుడి, మేరీమాత ఆలయం తదితర ప్రాంతాల్లో పలువురు మహిళలు తరచు మోసగాళ్ల వలలో పడుతుం టారు. దూరప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఈ తరహా మోసాలకు గురైనవారిలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోతుంటే, ఇంకొందరు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరహా కేసుల్లో బాధితులకు సరైన న్యాయం జరగాలంటే మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దీంతోపాటు మహిళా పోలీసులను కూడా అదనంగా నియమించి ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.