Bhubaneswar Kumar
-
ఎప్పుడు ఫిట్‌గా మారతానో చెప్పలేను
సాక్షి, హైదరాబాద్: టి20 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి తాను ప్రస్తుతానికి ఆలోచించడం లేదని భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌గా మారే వరకు బౌలింగ్ ప్రదర్శనపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘స్పోర్ట్స్ హెర్నియా’ కారణంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు భువీ దూరమయ్యాడు. స్పోర్ట్స్ వేర్ సంస్థ ‘అసిక్స్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం అతను నగరానికి వచ్చాడు. ‘టి20 ప్రపంచకప్‌కు తొమ్మిది నెలల సమయం ఉంది. నేను ఫిట్‌గా మారడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను. అయితే ఎప్పుడు పూర్తిగా కోలుకుం టానో చెప్పలేను. జట్టులో నా స్థానం గురించి ఈ దశలో ఆలోచించడం కూడా అనవసరం. బాగా ఆడటమే నా చేతుల్లో ఉంది. సెలెక్టర్లు ఏం చేస్తారనేది వారిష్టం’ అని అన్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే కోలుకొని సాధన చేసిన భువీ గాయం మళ్లీ తిరగబెట్టింది. ఎన్సీఏలో ఉన్న సౌకర్యాల గురించి కూడా విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై తాను ఏమీ చెప్పలేనని భువీ పేర్కొన్నాడు. ‘ఎన్సీఏ తమ వంతుగా నా రీహాబిలిటేషన్‌కు ప్రయత్నించింది. లోపం ఎక్కడ జరిగిందో చెప్పలేను. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే నా గాయానికి శస్త్ర చికిత్స అవసరమా కాదా అనేది తేలుతుంది’ అని భువనేశ్వర్ స్పష్టం చేశాడు. -
‘స్వింగ్’ సహజంగా వచ్చింది!
⇒ భువనేశ్వర్ వ్యాఖ్య ⇒ హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి సాక్షి, హైదరాబాద్: భారత స్వింగ్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ సత్తా గురించి అందరికీ తెలిసిందే. 25 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్‌కు ఈ కళ ఎలా అబ్బింది? ఇదే విషయాన్ని చిన్నారి క్రికెటర్ ఒకరు భువీని ప్రశ్నించాడు. దానికి అతను ‘బంతిని ఇరు వైపులా స్వింగ్ చేయడం కోసం నేను ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. అది నాకు సహజంగానే వచ్చింది. అయితే 15 ఏళ్ల వయసులో దాని విలువను గుర్తించి తీవ్రంగా సాధన చేశాను. ప్రతీ బ్యాట్స్‌మన్ కోసం ప్రణాళికతో బరిలోకి దిగి దానిని సమర్థంగా వాడేందుకు ప్రయత్నిస్తా’ అని భువనేశ్వర్ చెప్పాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శనివారం ఐపీఎల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు చెందిన క్రికెట్ అకాడమీలో చిన్నారులతో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భువనేశ్వర్‌తో పాటు ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వర్ధమాన క్రికెటర్లు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలిచ్చారు. తన కాలనీలో టెన్నిస్ బాల్‌తో సరదాగా ఆడేవాడినని, ఆటపై ఆసక్తిని గమనించి తన బంధువు కోచ్ దగ్గరకు తీసుకెళ్లాడని శిఖర్ ధావన్ చెప్పాడు. గంటల కొద్దీ కష్టపడటంతో పాటు అంకితభావం ఉంటేనే పెద్ద స్థాయికి చేరుకోగలరని అతను వారికి ఉద్బోధించాడు. మరోవైపు పదే పదే గాయాలకు గురైనప్పుడు జట్టులోకి తిరిగి రావడం అంత సులువు కాదని, తాను చాలా పట్టుదలగా శ్రమించానని ఇషాంత్ శర్మ అన్నాడు. రాబోయే రోజుల్లో క్రికెటర్లుగా ఎదగాలనుకునే వారు ఎండ, వాన పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేయాలని, సూర్యుడిని స్నేహితుడిగా మార్చుకోవాలని ఈ ‘సన్’ ఆటగాడు సరదాగా వ్యాఖ్యానించాడు. ‘ధూప్ సే ప్యార్ కర్నా. నహీతో మంజిల్ కో పహుంచ్ నా పావోగే (ఎండను ప్రేమించండి. లేదంటే మీ లక్ష్యాలను చేరుకోలేరు) అని అతను అన్నాడు. ఈ సందర్భంగా ఆటగాళ్లు లక్ష్మణ్ అకాడమీలో మొక్కలు నాటారు. -
సూపర్ భువీ
‘పీపుల్స్ చాయిస్’ అవార్డు విజేతగా భారత పేసర్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లి రెండు విభాగాల్లో పోటీలో ఉన్న మిథాలీ దుబాయ్: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ప్రతి ఏటా ఇచ్చే ఎల్జీ ‘పీపుల్స్ చాయిస్’ అవార్డుకు ఈ ఏడాది భువనేశ్వర్ ఎన్నికయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తమ ఓట్ల ద్వారా ఈ అవార్డు విజేతను ఎన్నుకుంటారు. ఈ ఏడాది భువనేశ్వర్‌తో పాటు స్టెయిన్ (దక్షిణాఫ్రికా), జాన్సన్ (ఆస్ట్రేలియా), మ్యాథ్యూస్ (శ్రీలంక), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్ మహిళా ప్లేయర్) ఈ అవార్డుకు షార్ట్ లిస్ట్ కాగా... భువీ విజేతగా నిలిచాడు. గతంలో భారత్ నుంచి 2010లో సచిన్, 2013లో ధోని ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. శ్రీలంక దిగ్గజం సంగక్కర 2011, 2012లలో వరుసగా రెండుసార్లు ఈ అవార్డు గెలిచాడు. భువనేశ్వర్‌కు బీసీసీఐ అభినందనలు తెలిపింది. ‘నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా ప్రదర్శనతో పాటు అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే ఈ అవార్డు దక్కింది. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరడానికి నా కోచ్‌లు, తల్లిదండ్రులే కారణం. ఇక నా జట్టు సహచరుల మద్దతు లేకుండా ఈ అవార్డు సాధ్యమయ్యదే కాదు.’ అని భువనేశ్వర్ అన్నాడు. ఈసారి ఇద్దరే: ఐసీసీ వార్షిక అవార్డుల షార్ట్ లిస్ట్‌లో ఈసారి భారత్‌కు పెద్దగా నామినేషన్లు దక్కలేదు. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు కోహ్లి పేరు షార్ట్ లిస్ట్‌లో ఉంది. డికాక్, డివిలియర్స్, స్టెయిన్ (దక్షిణాఫ్రికా)లతో తను ఈ అవార్డు కోసం పోటీపడుతున్నాడు. 2012లో విరాట్ ఈ అవార్డు గెలిచాడు. ఇక భారత మిహ ళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేరు రెండు విభాగాల్లో షార్ట్ లిస్ట్ అయింది. మహిళల విభాగంలో ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల కోసం మిథాలీ రేసులో ఉంది. అలాగే ప్రతిష్టాత్మక క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), సంగక్కర, మ్యాథ్యూస్ (శ్రీలంక), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు. ఆగస్టు 26, 2013 నుంచి సెప్టెంబరు 17, 2014 వరకు ఉన్న ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేస్తారు. నవంబరు 14న అవార్డు విజేతల పేర్లు ప్రకటిస్తారు. ధోని వరుసగా ఏడోసారి ప్రతి ఏటా ఐసీసీ ప్రకటించే ప్రతిష్టాత్మక జట్ల జాబితాలో ఈసారి టెస్టుల్లో భారత్ నుంచి ఎవరూ లేరు. ఐసీసీ వన్డే జట్టుకు మాత్రం ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వన్డేల్లో కోహ్లి, షమీ కూడా జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మను 12వ ఆటగాడిగా ప్రకటించారు. అనిల్ కుంబ్లే సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఈ జట్లను ప్రకటించింది. ఐసీసీ వన్డే జట్టులో ధోని ఎంపిక కావడం ఇది వరుసగా ఏడో ఏడాది కావడం విశేషం. మొత్తంమీద ధోని వన్డే జట్టులోకి ఎనిమిది సార్లు ఎంపికయ్యాడు. అలాగే ఐసీసీ జట్టుకు వన్డే కెప్టెన్ కావడం ఇది ఐదోసారి. ఐసీసీ వన్డే జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి, షమీ, (భారత్) హఫీజ్ (పాక్), డికాక్, డివిలియర్స్, స్టెయిన్ (దక్షిణాఫ్రికా), బెయిలీ, ఫాల్క్‌నర్ (ఆస్ట్రేలియా), డ్వేన్ బ్రేవో (వెస్టిండీస్), మెండిస్ (శ్రీలంక). 12వ ఆటగాడు రోహిత్ (భారత్). ఐసీసీ టెస్టు జట్టు: మ్యాథ్యూస్ (కెప్టెన్), సంగక్కర, హెరాత్ (శ్రీలంక), వార్నర్, జాన్సన్ (ఆస్ట్రేలియా), విలియమ్సన్, సౌతీ (న్యూజిలాండ్), డివిలియర్స్, స్టెయిన్ (దక్షిణాఫ్రికా), రూట్, బ్రాడ్ (ఇంగ్లండ్). 12వ ఆటగాడు రాస్ టేలర్ (న్యూజిలాండ్).