సాక్షి, హైదరాబాద్: టి20 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి తాను ప్రస్తుతానికి ఆలోచించడం లేదని భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌గా మారే వరకు బౌలింగ్ ప్రదర్శనపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘స్పోర్ట్స్ హెర్నియా’ కారణంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు భువీ దూరమయ్యాడు. స్పోర్ట్స్ వేర్ సంస్థ ‘అసిక్స్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం అతను నగరానికి వచ్చాడు. ‘టి20 ప్రపంచకప్‌కు తొమ్మిది నెలల సమయం ఉంది. నేను ఫిట్‌గా మారడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను.
అయితే ఎప్పుడు పూర్తిగా కోలుకుం టానో చెప్పలేను. జట్టులో నా స్థానం గురించి ఈ దశలో ఆలోచించడం కూడా అనవసరం. బాగా ఆడటమే నా చేతుల్లో ఉంది. సెలెక్టర్లు ఏం చేస్తారనేది వారిష్టం’ అని అన్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనే కోలుకొని సాధన చేసిన భువీ గాయం మళ్లీ తిరగబెట్టింది. ఎన్‌సీఏలో ఉన్న సౌకర్యాల గురించి కూడా విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై తాను ఏమీ చెప్పలేనని భువీ పేర్కొన్నాడు. ‘ఎన్‌సీఏ తమ వంతుగా నా రీహాబిలిటేషన్‌కు ప్రయత్నించింది. లోపం ఎక్కడ జరిగిందో చెప్పలేను. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే నా గాయానికి శస్త్ర చికిత్స అవసరమా కాదా అనేది తేలుతుంది’ అని భువనేశ్వర్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment