వాషింగ్టన్ : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) భారతీయుల్లో వణుకుపుట్టిస్తున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే జన్మతః పౌరసత్వం (birthright citizenship) రద్దు చేశారు. త్వరలో అక్రమ వలసదారులపై (undocumented Indians) కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నిబంధనలు విరుద్ధంగా తమ దేశంలోకి చొరబడ్డ విదేశీయుల్ని వెనక్కి పంపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికాలో ఉన్న సుమారు 7,25,00 మంది భారతీయులు తిరిగి వెనక్కి రానున్నారు.
అమెరికా 47వ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ జన్మతః వచ్చే పౌరసత్వంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
ఇప్పుడు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికాలో 7,25,000 మంది భారతీయులతో సహా దాదాపు 14 మిలియన్ల మంది నిబంధనలు విరుద్ధంగా పత్రాలు లేని వలసదారులు ఉన్నారు. వారిలో మాజీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన పాలనలో గతేడాది 2024 ఆర్థిక సంవత్సరంలో 1,500 మంది భారతీయులను వెనక్కి పంపించారు.
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పునరాగమనంతో అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన లక్షలమంది భారతీయులు బెంబేలెత్తుతున్నారు. అనధికారిక వలసదారులపై గ్లోబల్ మైగ్రేషన్ డేటాబేస్ అండ్ ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. 2021లో అమెరికాలో కనీసం 34.55 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా.. వారిలో దాదాపు 21 శాతం మంది వద్ద సరైన పత్రాలు లేవని తెలుస్తోంది. అదే సమయంలో, యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాల ప్రకారం.. 2020 నుండి అమెరికాలోకి అక్రమంగా సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన భారతీయుల సంఖ్య పెరుగుతోందని సదరు గణాంకాలు చెబుతున్నాయి.
జన్మతః పౌరసత్వానికి ట్రంప్ మంగళం
తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.
ఇబ్బందుల్లో లక్షల మంది
అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది.
మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి
భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.
Comments
Please login to add a commentAdd a comment