‘స్వింగ్’ సహజంగా వచ్చింది!
⇒ భువనేశ్వర్ వ్యాఖ్య
⇒ హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్ల సందడి
సాక్షి, హైదరాబాద్: భారత స్వింగ్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ సత్తా గురించి అందరికీ తెలిసిందే. 25 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ బౌలర్‌కు ఈ కళ ఎలా అబ్బింది? ఇదే విషయాన్ని చిన్నారి క్రికెటర్ ఒకరు భువీని ప్రశ్నించాడు. దానికి అతను ‘బంతిని ఇరు వైపులా స్వింగ్ చేయడం కోసం నేను ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. అది నాకు సహజంగానే వచ్చింది. అయితే 15 ఏళ్ల వయసులో దాని విలువను గుర్తించి తీవ్రంగా సాధన చేశాను.
ప్రతీ బ్యాట్స్‌మన్ కోసం ప్రణాళికతో బరిలోకి దిగి దానిని సమర్థంగా వాడేందుకు ప్రయత్నిస్తా’ అని భువనేశ్వర్ చెప్పాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శనివారం ఐపీఎల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు చెందిన క్రికెట్ అకాడమీలో చిన్నారులతో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భువనేశ్వర్‌తో పాటు ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వర్ధమాన క్రికెటర్లు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలిచ్చారు. తన కాలనీలో టెన్నిస్ బాల్‌తో సరదాగా ఆడేవాడినని, ఆటపై ఆసక్తిని గమనించి తన బంధువు కోచ్ దగ్గరకు తీసుకెళ్లాడని శిఖర్ ధావన్ చెప్పాడు.
గంటల కొద్దీ కష్టపడటంతో పాటు అంకితభావం ఉంటేనే పెద్ద స్థాయికి చేరుకోగలరని అతను వారికి ఉద్బోధించాడు. మరోవైపు పదే పదే గాయాలకు గురైనప్పుడు జట్టులోకి తిరిగి రావడం అంత సులువు కాదని, తాను చాలా పట్టుదలగా శ్రమించానని ఇషాంత్ శర్మ అన్నాడు. రాబోయే రోజుల్లో క్రికెటర్లుగా ఎదగాలనుకునే వారు ఎండ, వాన పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేయాలని, సూర్యుడిని స్నేహితుడిగా మార్చుకోవాలని ఈ ‘సన్’ ఆటగాడు సరదాగా వ్యాఖ్యానించాడు. ‘ధూప్ సే ప్యార్ కర్నా. నహీతో మంజిల్ కో పహుంచ్ నా పావోగే (ఎండను ప్రేమించండి. లేదంటే మీ లక్ష్యాలను చేరుకోలేరు) అని అతను అన్నాడు. ఈ సందర్భంగా ఆటగాళ్లు లక్ష్మణ్ అకాడమీలో మొక్కలు నాటారు.