సూపర్ భువీ
‘పీపుల్స్ చాయిస్’ అవార్డు విజేతగా భారత పేసర్
వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లి
రెండు విభాగాల్లో పోటీలో ఉన్న మిథాలీ
దుబాయ్: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ప్రతి ఏటా ఇచ్చే ఎల్జీ ‘పీపుల్స్ చాయిస్’ అవార్డుకు ఈ ఏడాది భువనేశ్వర్ ఎన్నికయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తమ ఓట్ల ద్వారా ఈ అవార్డు విజేతను ఎన్నుకుంటారు. ఈ ఏడాది భువనేశ్వర్‌తో పాటు స్టెయిన్ (దక్షిణాఫ్రికా), జాన్సన్ (ఆస్ట్రేలియా), మ్యాథ్యూస్ (శ్రీలంక), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్ మహిళా ప్లేయర్) ఈ అవార్డుకు షార్ట్ లిస్ట్ కాగా... భువీ విజేతగా నిలిచాడు.
గతంలో భారత్ నుంచి 2010లో సచిన్, 2013లో ధోని ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. శ్రీలంక దిగ్గజం సంగక్కర 2011, 2012లలో వరుసగా రెండుసార్లు ఈ అవార్డు గెలిచాడు. భువనేశ్వర్‌కు బీసీసీఐ అభినందనలు తెలిపింది. ‘నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా ప్రదర్శనతో పాటు అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే ఈ అవార్డు దక్కింది. నేను ఈ రోజు ఈ స్థాయికి చేరడానికి నా కోచ్‌లు, తల్లిదండ్రులే కారణం. ఇక నా జట్టు సహచరుల మద్దతు లేకుండా ఈ అవార్డు సాధ్యమయ్యదే కాదు.’ అని భువనేశ్వర్ అన్నాడు.
ఈసారి ఇద్దరే: ఐసీసీ వార్షిక అవార్డుల షార్ట్ లిస్ట్‌లో ఈసారి భారత్‌కు పెద్దగా నామినేషన్లు దక్కలేదు. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు కోహ్లి పేరు షార్ట్ లిస్ట్‌లో ఉంది. డికాక్, డివిలియర్స్, స్టెయిన్ (దక్షిణాఫ్రికా)లతో తను ఈ అవార్డు కోసం పోటీపడుతున్నాడు. 2012లో విరాట్ ఈ అవార్డు గెలిచాడు. ఇక భారత మిహ ళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేరు రెండు విభాగాల్లో షార్ట్ లిస్ట్ అయింది.
మహిళల విభాగంలో ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల కోసం మిథాలీ రేసులో ఉంది. అలాగే ప్రతిష్టాత్మక క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), సంగక్కర, మ్యాథ్యూస్ (శ్రీలంక), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు. ఆగస్టు 26, 2013 నుంచి సెప్టెంబరు 17, 2014 వరకు ఉన్న ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేస్తారు. నవంబరు 14న అవార్డు విజేతల పేర్లు ప్రకటిస్తారు.
ధోని వరుసగా ఏడోసారి
ప్రతి ఏటా ఐసీసీ ప్రకటించే ప్రతిష్టాత్మక జట్ల జాబితాలో ఈసారి టెస్టుల్లో భారత్ నుంచి ఎవరూ లేరు. ఐసీసీ వన్డే జట్టుకు మాత్రం ధోనిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వన్డేల్లో కోహ్లి, షమీ కూడా జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మను 12వ ఆటగాడిగా ప్రకటించారు. అనిల్ కుంబ్లే సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఈ జట్లను ప్రకటించింది. ఐసీసీ వన్డే జట్టులో ధోని ఎంపిక కావడం ఇది వరుసగా ఏడో ఏడాది కావడం విశేషం. మొత్తంమీద ధోని వన్డే జట్టులోకి ఎనిమిది సార్లు ఎంపికయ్యాడు. అలాగే ఐసీసీ జట్టుకు వన్డే కెప్టెన్ కావడం ఇది ఐదోసారి.
ఐసీసీ వన్డే జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి, షమీ, (భారత్) హఫీజ్ (పాక్), డికాక్, డివిలియర్స్, స్టెయిన్ (దక్షిణాఫ్రికా), బెయిలీ, ఫాల్క్‌నర్ (ఆస్ట్రేలియా), డ్వేన్ బ్రేవో (వెస్టిండీస్), మెండిస్ (శ్రీలంక). 12వ ఆటగాడు రోహిత్ (భారత్).
ఐసీసీ టెస్టు జట్టు: మ్యాథ్యూస్ (కెప్టెన్), సంగక్కర, హెరాత్ (శ్రీలంక), వార్నర్, జాన్సన్ (ఆస్ట్రేలియా), విలియమ్సన్, సౌతీ (న్యూజిలాండ్), డివిలియర్స్, స్టెయిన్ (దక్షిణాఫ్రికా), రూట్, బ్రాడ్ (ఇంగ్లండ్). 12వ ఆటగాడు రాస్ టేలర్ (న్యూజిలాండ్).