పూర్ణ భుజంగాసనం
భుజంగం అంటే పాము. పడగెత్తిన పాము పూర్తిగా వెనుకకు వంగిన స్థితిని లేదా భుజంగాసనం సంపూర్ణ స్థితిలో వేయడం వలన దీనిని పూర్ణ భుజంగాసనం అంటారు.
చేసే విధానం
మొదట రెండు చేతులను గడ్డం కింద ఉంచి, బోర్లా పడుకుని విశ్రాంతి స్థితిలో ఉండాలి.
రెండు అరచేతులను ఛాతీకి దగ్గరగా నేలపై ఆనించి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని తలనుంచి నాభి వరకు పైకి తీసుకురావాలి.
రెండు కాళ్లనూ మోకాళ్ల వద్ద వెనుకకు వంచి అరిపాదాలను నుదురు భాగానికి తాకించి, ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి.
ఈ ఆసనాన్ని రోజుకు మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి.
జాగ్రత్తలు!
పూర్ణ భుజంగాసనం వేయడం కొంత కష్టమే. ఎక్కువ సాధన ఉన్నవారు మాత్రం సులువుగా చేయగలరు. ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయడం మంచిది.
ఉపయోగాలు
వెన్నుపాము శక్తిమంతం అవుతుంది. వెన్నునొప్పి తగ్గుతుంది. ఛాతీ విశాలం అవుతంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. మెడ కండరాలకు బలం వస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు నయమవుతాయి. స్వరం సరళతరమవుతుంది.
పొట్ట కండరాలు, పొట్టలోని ఇతర భాగాలు సాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది.
చేతులకు, భుజాలకు శక్తి పెరుగుతుంది.
రుతుక్రమ సమస్యలు నివారణ అవుతాయి, ఇతర గర్భాశయ సమస్యలతోపాటు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి.
శరీరం మొత్తం ఉత్తేజితమవుతుంది.
మోడల్: అంజు రిషిత
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు
సప్తరుషి యోగవిద్యాకేంద్రం
హైదరాబాద్
ఫొటోలు: శివ మల్లాల