భూమా అరెస్టు అప్రజాస్వామికం
* ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
* మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం
మంగళగిరి: ప్రజాప్రతినిధులపైనే పోలీసు అధికారులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇంత దుర్మార్గపు చర్యలను ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు
జిల్లా మంగళగిరిలోని ఎమ్మెల్యే కార్యాలయం ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలని కోరినందుకు ప్రభుత్వమే పోలీసు అధికారులతో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేయించి అరెస్టుచేసి జైలుకు తరలించడం అమానుషమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అరెస్టు చేయిస్తామనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం మారిందన్నారు.
పోలీసులతో రాజ్యమేలాలని ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అనేకమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని, పార్టీ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం రివాజుగా మారిందన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేకాక ప్రశ్నించిన ఎమ్మెల్యే నాగిరెడ్డిపై కేసులు బనాయించడం రాజకీయకక్ష సాధింపని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వేధింపులు ఆపకపోతే ప్రజలతో కలిసి వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. పోలీసులు సైతం తమ విధులను గుర్తించి ప్రజాప్రతినిధులను గౌరవించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.