ఆత్మీయత చాటిన బొందిలి సమ్మేళనం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జిల్లా రాజ్‌పుత్ బొందిలి సంఘం నిర్వహించిన 'సమ్మేళనం' వారి మధ్య ఆత్మీయతను చాటింది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర బొందిలి సమాజాన్ని ఒకే వేదికపైకి తెచ్చింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాజ్‌పుత్ బొందిలి సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నారాయణ సింగ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌సింగ్, ప్రధాన కార్యదర్శి మహేందర్‌సింగ్, రాష్ట్ర మాజీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీబాయి, శ్రీశైలం పాలక మండలి మాజీ సభ్యురాలు సంపత్ సుభాంగిని రాజ్‌పుత్, రాజపోషకులు బి.కె.సింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల కర్ణాటక రాజ్‌పుత్ మహాసభ వైఎస్ ప్రెసిడెంట్, బెంగుళూరు రిటైర్డు ఏసీపీ సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. రాజ్‌పుత్‌లుగా జన్మించడం గర్వకారణమన్నారు. కలిసికట్టుగా ఉండి అసెంబ్లీలో ప్రతినిధ్యం సంపాదించాలని సూచించారు. తమ సామాజిక వర్గం ప్రజలు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక కాలనీ కేటాయించాలని కోరారు. శ్రీశైల దేవస్థానంలో వసతిగృహం, అన్నదాన సత్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం 0.50 సెంట్ల స్థలం కేటాయించాలన్నారు. రాజ్‌పుత్‌లను ఓబీసీలో చేర్చాలని, సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. అంతకు ముందు స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి కళాబృందాలు, బీరప్ప డోళ్లతో నిర్వహించిన ఊరేగింపు అందర్ని ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేశ్‌సింగ్, కోశాధికారి కిరణ్‌కుమార్ సింగ్, అడ్వయిజర్ సత్యనారాయణసింగ్, చెన్నై, రాయచూరు, మైసూర్, తమిళనాడు వంటి దక్షిణాది సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.