టికెట్ కోసం బారులు
120 రోజుల ముందుగా
రిజర్వేషన్ సదుపాయం
ఎగబడ్డ ప్రయాణికులు
8 కౌంటర్లతో టికెట్లు జారీ
వెయ్యి మందికిపైగా అందని టికెట్లు
విశాఖపట్నం సిటీ : రిజర్వేషన్ టికెట్లు కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. తెల్లవారుజాము నుంచే రిజర్వేషన్ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. ఒకే సారి పెద్ద సంఖ్యలో రిజర్వేషన్ టికెట్ల కోసం బారులు తీరడంతో బుకింగ్ క్లర్కులు సైతం ఆందోళన చెందారు. టికెట్ కోసం 9 నుంచి 10 గంటల పాటు ఉసూరుమంటూ నిరీక్షించారు. వెయ్యి మంది వరకూ టికెట్లు తీసుకోకుండానే ఇంటి ముఖం పట్టారు. ఇదే పరిస్థితి మరి కొన్నాళ్లు ఉంటుందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైల్వే బడ్జెట్లో 60 రోజుల నుంచి 120 రోజులకు రిజర్వేషన్ టికెట్లు తీసుకునే సదుపాయం కల్పిస్తూ కేంద్రం ప్రకటించింది. ఆ నిర్ణయం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావడంతో వేసవి సెలవుల్లో పర్యటనల కోసం ఏర్పాట్లు చేసుకున్న వారంతా బుధవారం ఉదయాన్నే రిజర్వేషన్ కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. టోకెన్లు కోసం అంతా ఎగబడడంతో ఉదయం 10 గంటలకే 1300కు పైగా చేరిపోయాయి. రాత్రి 8 గంటల సమయానికి 2130 టోకెన్లు జారీ చే శారు. అందులో 1180 మందికి మాత్రమే టికెట్లు అందించగలిగారు. సాధారణ రోజుల్లో వెయ్యి నుంచి 1200 మందికి మాత్రమే టోకెన్లు జారీ చేసి వారందరికీ ఇచ్చేవారు.
కౌంటర్లు పెంచినా...!
రిజర్వేషన్ కార్యాలయంలో రోజూ 7 కౌంటర్లు ద్వారా టికెట్లు జారీ చేసేవారు. బుధవారం రద్దీని గమనించిన అధికారులు అదనంగా మరో కౌంటర్‌ను తెరిచారు. రెండు షిఫ్ట్‌ల ద్వారా మొత్తం 8 కౌంటర్ల నుంచీ టికెట్లు జారీ చేసినా సుమారు వెయ్యి మందికి టికెట్లు లభించలేదు. 45 మంది బుకింగ్ క్లర్కులు అవసరం కాగా కేవలం 35 మంది మాత్రమే రెండు షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉన్నారు. దీంతో 14 కౌంటర్లు ఉన్నా 8 కౌంటర్లుతోనే పని చేయించాల్సి వస్తోంది.
టికెట్ల కోసం రద్దీ..! : రిజర్వేషన్ టికెట్ల కోసం ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తికాగా, పదో పరీక్షలు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈలోగా పాఠశాలలకు సెలవులు ఇస్తే ఇక అంతా ప్రయాణాల బాట పడతారు. దీంతో మరింత రద్దీ పెరిగే చాన్స్ ఉంది. రైల్వే ఉన్నతాధికారులు ముందుగానే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుంటే రిజర్వేషన్ టికెట్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయే ప్రమాదం ఉంది.