Breeding bull center
-
నాసిరకం సెమన్తో చిక్కులు.. అందుకే
సాక్షి, అమరావతి: పశువుల పునరుత్పత్తి విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతోంది. ఎవరుపడితే వారు, ఎలాబడితే అలా పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడం, ఎదకొచ్చిన పశువులను ఇష్టమొచ్చిన రీతిలో ఎద కట్టించడం, అనైతిక పశు సంపర్కం చేయించటం ఇకపై చెల్లదు. మేలు జాతి పశువుల పునరుత్పత్తి, అధిక పాల దిగుబడి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పశు పునరుత్పత్తి చట్టం (ఏపీ బోవైన్ బ్రీడింగ్ యాక్ట్–21)ను తీసుకురాబోతోంది. తద్వారా నాసిరకం పశు వీర్యోత్పత్తి, అనైతిక పద్ధతుల్లో పశు సంపర్కానికి పాల్పడే వారికి అడ్డుకట్ట వేయడమే కాకుండా దేశీయ మేలు జాతి పశు సంతతిని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో కొత్త చట్టం అమల్లోకి రానుంది. నాసిరకం సెమన్తో చిక్కులు కొంతమంది స్వార్ధపరులు ఎక్కడపడితే అక్కడ నాసిరకం పశువుల నుంచి వీర్యోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కొక్క వీర్య నాళికను రూ.40కి సరఫరా చేస్తుంటే.. ప్రైవేటు వ్యక్తులు నాసిరకం వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఒక్కో నాళికను రూ.10, రూ.15కే సరఫరా చేస్తున్నారు. మేలు జాతి పశు వీర్యమని రైతుల్ని నమ్మబలికి ఎదకొచ్చిన పశువులకు వాటితో కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నారు. దీనివల్ల్ల మేలు జాతి పశువులు అంతరించిపోవడంతోపాటు పాల దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాసిరకం వీర్యోత్పత్తి, అమ్మకాలు, పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు సరైన చట్టాలు లేకపోవడంతో వారిని నియంత్రించలేని పరిస్థితులు ఉన్నాయి. హైబ్రీడ్ రకాలతో రోగాలు క్షీర విప్లవంలో భాగంగా అధిక పాల ఉత్పత్తే లక్ష్యంగా చలి దేశాలైన అమెరికా, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న పశువుల వీర్యంతో దేశీయ పశువుల పునరుత్పత్తి చేసేవారు. హైబ్రీడ్ జాతుల వీర్యంతో పశువుల్ని చూడి కట్టించటం వల్ల పాల ఉత్పత్తి పెరిగింది. కానీ.. పుట్టే పశువులు గతంలో ఎన్నడూ చూడని వ్యాధుల బారిన పడటంతోపాటు అనేక దుష్పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇక చెక్ ఎవరుబడితే వారు నాసిరకం వీర్యాన్ని సరఫరా చేయడం, హైబ్రీడ్ రకాలతో చూడి కట్టించడం వంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ బోవైన్ బ్రీడింగ్ యాక్ట్–21ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ తరహా చట్టాలున్నాయి. ఈ యాక్ట్ ప్రకారం ఇక నుంచి ఏ జాతి పశువుల వీర్యాన్ని ఆ జాతి పశువులకే వాడాలి. జాతి గేదెలను అప్గ్రేడ్ చేయాలంటే ముర్రా జాతి పశు వీర్యాన్ని మాత్రమే వాడాలి. సంకర జాతి పశువులను గిర్, షాహివాల్, కాంక్రీజ్ వంటి జాతి పశువులతోనే సంకర పర్చాలి. ఇష్టమొచ్చిన రీతిలో నాసిరకం పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడం, అమ్మడం, చూడి కట్టించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడే వారిపై ఈ చట్టం క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. నాసిరకం వీర్యోత్పత్తికి అడ్డుకట్ట అంతరించిపోతున్న మేలు జాతి పశువులను పరిరక్షించుకోవడంతో పాటు నాసిరకం వీర్యోత్పత్తికి అడ్డుకట్ట వేయడం, పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బోవైన్ బ్రీడింగ్ యాక్ట్–21ను తీసుకొస్తోంది. ఈ యాక్ట్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అధిక పాల దిగుబడులనిచ్చే పశువుల పునరుత్పత్తికి బాటలు వేస్తుంది. – దామోదర్నాయుడు, సీఈవో, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ -
దేశీ పశు జాతుల అభివృద్ధి పథకం
మేలు జాతి ఆంబోతుల వీర్యంతో దేశీ జాతుల ఆవులు, గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి చేయటం ద్వారా జన్యుపరంగా దేశీ పశు జాతులను అభివృద్ధి చేయడం, తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో ప్రత్యేక కృత్రిమ గర్భధారణ పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా కృత్రిమ గర్భధారణ 50% కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాలు (శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం), తెలంగాణలోని 33 జిల్లాల్లో ఈ పథకం సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అమల్లో ఉంటుంది. ► ఎంపికైన ప్రతి జిల్లాలో వంద గ్రామాలను తీసుకొని, ఒక్కొక్క గ్రామం నుంచి రెండు వందల పశువులకు వంద శాతం మేలైన దేశీ జాతి ఆబోతు వీర్యం ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి చేసి 200 మేలైన జాతి దూడలు పుట్టేలా చేస్తారు. ► గిర్, సాహివాల్, ఒంగోలు వంటి మేలైన దేశీ గోజాతులతోపాటు ముర్రా, జఫ్రబాదీ దేశీ గేదె జాతుల వీర్యపు మోతాదులు ఈ పథకం ద్వారా రైతుల ఇళ్ల ముంగిటకే ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. ► ఏ జాతి ఆవు/గేదెలకు ఆ యా జాతుల మేలైన ఆంబోతు వీర్యాన్ని వినియోగిస్తారు. ఏ జాతికీ చెందని(నాన్ డిస్క్రిప్టివ్) నాటు పశువుల్లో ఏ జాతి లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆ జాతి ఆంబోతు వీర్యాన్ని వినియోగిస్తారు. ► సాధారణంగా ఒక పశువు చూడి కట్టాలంటే 3–4 కృత్రిమ గర్భోత్పత్తి మోతాదులు అవసరం అవుతాయి. అయితే, వంద శాతం ఫలితాలు పొందడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ► కృత్రిమ గర్భోత్పత్తి చేసిన పశువుల వివరాలను ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ (ఐ.న్.ఎ.పి.హెచ్.) వెబ్సైట్లో నమోదు చేస్తారు. ► కృత్రిమ గర్భోత్పత్తి చేసే సిబ్బందికి ఒక్కో మోతాదు చేసినందుకు రూ. 50 చొప్పున ప్రభుత్వమే పారితోషికం ఇస్తుంది. రైతు దగ్గర వీర్య మోతాదుల నిమిత్తం ఎటువంటి రుసుము వసూలు చేయటం లేదు. మేలు జాతి ఆబోతు వీర్య మోతాదులను ఉచితంగా సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. పి. డి. కొండలరావు తెలిపారు. ► ఈ పథకం కింద ఎంపికైన జిల్లాల్లో రైతులు తమ దగ్గరలోని పశుసంవర్థక శాఖ అధికారులను సంప్రదించవచ్చు. 29న వృషభోత్సవం కార్తీక మాసం మొదటి రోజు(ఈ నెల 29) ను లగుడ ప్రతి పద అంటారు. లగుడ అంటే కట్టె / దండ అని అర్థం. వృషభం / ఎద్దు కొమ్ములను తైలం, పసుపుతో రుద్ది శ్యామతీగతో అలంకరించి గ్రామమంతా తిరిగితే గ్రామాలకు కలిగిన అన్ని బాధలూ తొలగిపోతాయని ‘కృషి పరాశర గ్రంథం’లోని 99, 100 శ్లోకాలు చెబుతున్నాయి. కుల మత భేదాలు లేకుండా మనందరికీ అన్నం పెట్టే రైతు ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకొనే వారంతా వృషభోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా తమ గ్రామాల్లో, బస్తీల్లో, గోశాలల్లో, డైరీ ఫారాల్లో జరుపుకోవచ్చు. -
ఖమ్మం ఎడ్లు భళా
మద్దిరాలపాడు: ప్రకాశం జిల్లా మద్దిరాలపాడులో జరిగిన మండవ సుబ్బారాయుడు, శేషమ్మ మెమోరియల్ అఖిల భారత స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ‘ఆర్ఎన్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్’ ఎడ్లు సత్తా చాటాయి. సోమవారం రాత్రి ముగిసిన సీనియర్స్ 2.5 టన్నుల విభాగంలో ఖమ్మ జిల్లా ఎడ్లు 3,622 అడుగుల దూరం బరువును లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన నలమోతు వీరయ్య చౌదరి, వైఎస్సార్ జిల్లా అక్బర్ పెన్నానగర్కు చెందిన ఎడ్ల జత 3,015 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఇక, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీకావ్య, శ్రీమధుకు చెందిన ఎడ్ల జత 3,000 అడుగుల దూరం లాగి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.