దేశీ పశు జాతుల అభివృద్ధి పథకం | Desi cattle breeding program | Sakshi
Sakshi News home page

దేశీ పశు జాతుల అభివృద్ధి పథకం

Published Tue, Oct 8 2019 3:30 AM | Last Updated on Tue, Oct 8 2019 3:30 AM

Desi cattle breeding program - Sakshi

గిర్‌ ఆంబోతు. ముర్రా ఆంబోతు, సాహివాల్‌ ఆంబోతు, ఒంగోలు ఆంబోతు

మేలు జాతి ఆంబోతుల వీర్యంతో దేశీ జాతుల ఆవులు, గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి చేయటం ద్వారా జన్యుపరంగా దేశీ పశు జాతులను అభివృద్ధి చేయడం, తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో ప్రత్యేక కృత్రిమ గర్భధారణ పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌లో భాగంగా కృత్రిమ గర్భధారణ 50% కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాలు (శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం), తెలంగాణలోని 33 జిల్లాల్లో ఈ పథకం సెప్టెంబర్‌ 15 నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అమల్లో ఉంటుంది.

► ఎంపికైన ప్రతి జిల్లాలో వంద గ్రామాలను తీసుకొని, ఒక్కొక్క గ్రామం నుంచి రెండు వందల పశువులకు వంద శాతం మేలైన దేశీ జాతి ఆబోతు వీర్యం ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి చేసి 200 మేలైన జాతి దూడలు పుట్టేలా చేస్తారు.

► గిర్, సాహివాల్, ఒంగోలు వంటి మేలైన దేశీ గోజాతులతోపాటు ముర్రా, జఫ్రబాదీ దేశీ గేదె జాతుల వీర్యపు మోతాదులు ఈ పథకం ద్వారా రైతుల ఇళ్ల ముంగిటకే ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి.

► ఏ జాతి ఆవు/గేదెలకు ఆ యా జాతుల మేలైన ఆంబోతు వీర్యాన్ని వినియోగిస్తారు. ఏ జాతికీ చెందని(నాన్‌ డిస్క్రిప్టివ్‌) నాటు పశువుల్లో ఏ జాతి లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆ జాతి ఆంబోతు వీర్యాన్ని వినియోగిస్తారు.

► సాధారణంగా ఒక పశువు చూడి కట్టాలంటే 3–4 కృత్రిమ గర్భోత్పత్తి మోతాదులు అవసరం అవుతాయి. అయితే, వంద శాతం ఫలితాలు పొందడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.  

► కృత్రిమ గర్భోత్పత్తి చేసిన పశువుల వివరాలను ఇన్‌ఫర్‌మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌ (ఐ.న్‌.ఎ.పి.హెచ్‌.) వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.

► కృత్రిమ గర్భోత్పత్తి చేసే సిబ్బందికి ఒక్కో మోతాదు చేసినందుకు రూ. 50 చొప్పున ప్రభుత్వమే పారితోషికం ఇస్తుంది. రైతు దగ్గర వీర్య మోతాదుల నిమిత్తం ఎటువంటి రుసుము వసూలు చేయటం లేదు. మేలు జాతి ఆబోతు వీర్య మోతాదులను ఉచితంగా సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. పి. డి. కొండలరావు తెలిపారు.

► ఈ పథకం కింద ఎంపికైన జిల్లాల్లో రైతులు తమ దగ్గరలోని పశుసంవర్థక శాఖ అధికారులను సంప్రదించవచ్చు.  


29న వృషభోత్సవం
కార్తీక మాసం మొదటి రోజు(ఈ నెల 29) ను లగుడ ప్రతి పద అంటారు. లగుడ అంటే కట్టె / దండ అని అర్థం. వృషభం / ఎద్దు కొమ్ములను తైలం, పసుపుతో రుద్ది శ్యామతీగతో అలంకరించి గ్రామమంతా తిరిగితే గ్రామాలకు కలిగిన అన్ని బాధలూ తొలగిపోతాయని ‘కృషి పరాశర గ్రంథం’లోని 99, 100 శ్లోకాలు చెబుతున్నాయి. కుల మత భేదాలు లేకుండా మనందరికీ అన్నం పెట్టే రైతు ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకొనే వారంతా వృషభోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా తమ గ్రామాల్లో, బస్తీల్లో, గోశాలల్లో, డైరీ ఫారాల్లో జరుపుకోవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement