మరో రీమేక్‌పై మెగాస్టార్ కన్ను..మళ్లీ ఆ హీరో సినిమానే!
చిరంజీవి ఖాతాలో మరో మలయాళ రీమేక్ చేరనుందని టాక్. ఇప్పటికే చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ (2019)కి రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో ‘లూసిఫర్’ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకుడు కూడా. ఇక మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కలిసి నటించిన మరో మలయాళ ఫిల్మ్ ‘బ్రో డాడీ’ (2022) తెలుగు రీమేక్‌లోనూ చిరంజీవి నటించనున్నారని సమాచారం.
‘బ్రో డాడీ’కి కూడా పృథ్వీరాజే దర్శకుడు కావడం విశేషం. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుందని, ఇందులో మోహన్‌లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు సంపన్న కుటుంబాల మధ్య సాగే పంతాలు, పట్టింపుల నేపథ్యంలో ‘బ్రో డాడీ’ కథనం సాగుతుంది. ఇదిలా ఉంటే.. ‘గాడ్‌ఫాదర్’తో పాటు చిరంజీవి ప్రస్తుతం ‘బోళాశంకర్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ ‘బోళా శంకర్’ తమిళ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అని తెలిసిందే. మరి.. ‘బ్రో డాడీ’ రీమేక్‌కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అసలు విషయం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.