BSP MP Dhananjay Singh
-
నామినేషన్ వేసేందుకు బీఎస్పీ ఎంపీకి బెయిల్
న్యూఢిల్లీ: నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా... పనిమనిషి హత్య కేసులో జైల్లో ఉన్న బీఎస్పీ ఎంపీ ధనుంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తిరిగి అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. నామినేషన్ దాఖలుతోపాటు ప్రచారం నిర్వహించుకోవడానికి వీలుగా ధనుజంయ్సింగ్కు ఈ నెల 14 నుంచి 21 వరకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ధనుంజయ్, ఆయన భార్య జాగ్రితి... తమ ఇంటి పనిమనిషి రాఖీబాంద్రా(35) హత్య కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టయ్యి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ధనుంజయ్ ఒక అత్యాచార కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. -
ఎంపీ అత్యాచారం కేసు వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేశారు
న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్ నాలుగేళ్లపాటు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 42 ఏళ్ల మహిళ ప్లేటు ఫిరాయించింది. పోలీసులు తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేశారని, సింగ్ తనపై అత్యాచారం చేయలేదని కోర్టుకు తెలియజేసింది. దీంతో నిందితుడు సింగ్ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసుపై అడిషనల్ సెషన్స్ జడ్జి సరితా బీర్బల్ శనివారం రహస్య విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ కొన్ని అపార్థాల కారణంగా తాను సింగ్‌పై ఫిర్యాదు చేశానని, ఆయన తనపై అత్యాచారం చేయలేదని వాంగ్మూలం ఇచ్చింది. శుక్రవారం నాటి విచారణలోనూ ఈమె ఇలాగే మాట్లాడింది. బంధువులు ఒత్తిడి చేయడం వల్లే గతంలో అత్యాచారం ఆరోపణ చేశానని రైల్వే ఉద్యోగిని కూడా అయిన ఈ వివాహిత తెలిపింది. ఎంపీ ధనంజయ్ తన వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడనే భయంతోనే ఫిర్యాదు చేశానని వివరణ ఇచ్చింది. ‘విడాకులు కోరుతూ భర్త 2009లో నోటీసులు పంపడంతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. సింగ్ నాపై అత్యాచారం చేయలేదు. ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం ఇష్టం లేదు’ అని ఆమె కోర్టుకు వివరించింది. ఫిర్యాది మహిళపై ఎంపీ 2005 జూలై నుంచి 2009 మార్చి మధ్య పలుసార్లు అత్యాచారం చేసినట్టు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జనవరి 31న చార్జిషీటు కూడా దాఖలయింది. అత్యాచారం, అసహజ చర్యలు, దాడి, నేరపూరిత బెదిరింపులు తదితర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. సింగ్ తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను తిరస్కరించారు. అయితే పనిమనిషిపై వేధింపులు, హత్య కేసులోనూ ధనంజయ్ సింగ్, అతని భార్య జాగృతి గత నవంబర్లోనే అరెస్టయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తీహార్ జైలులో ఉన్నారు. సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. -
బీఎస్పీ ఎంపీకి నో బెయిల్
న్యూఢిల్లీ: పనిమనిషిని హింసించి, చంపారనే కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ భార్యతోపాటు అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ కేసులో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను మాయం చేశారని ఆరోపిస్తూ ఆయనకు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు ధనంజయ్‌కు బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ‘గత అనుభవాల దృష్ట్యా ధనంజయ్ విషయంలో ఎటువంటి అవకాశం తీసుకోలేం. జరుగుతున్న సంఘటనల దృష్ట్యా నిందితుడు ధనంజయ్ సింగ్‌కు బెయిల్ ఇవ్వలేం. ఈ కేసులో సాక్షులు రామ్‌లాల్, మీనాలు బలహీనులు. వారికి బలవంతుడైన ధనంజయ్ నుంచి రక్షణ కల్పించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ) ఎస్బీఎస్ త్యాగిని ఆదేశిస్తున్నాం. ఈ తీర్పుకు సంబంధించిన ఓ కాపీని డీసీపీకి పంపాల’ని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి గోమతి మనోచా వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ధనంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. పనిమనిషి రాఖీని హత్య చేసిన కేసులో ఆయన భార్య జాగృతి అరెస్టుకాగా అందుకు సంబంధించిన సాక్ష్యాలను, సీసీటీవీ కెమెరా దృశ్యాలను మాయం చేసిన కేసులో ధనంజయ్ అరెస్టయ్యాడు. జాగృతిపై హత్య, హత్యాయత్నం, బాల నాయ్య చట్టం ఉల్లంఘన కేసులు నమోదు కాగా ధనంజయ్‌పై కూడా భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. -
బీఎస్పీ ఎంపీ దంపతులకు జైల్లో రాచమర్యాదలు!!
ఆయనో ఎంపీ. ఆవిడ డాక్టర్. వాళ్లిద్దరూ దంపతులు. సదరు భార్యామణి తీవ్రంగా కొట్టడంతో ఇంట్లో ఓ పనిమనిషి మరణించింది. మరో మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో సదరు బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్, ఆయన భార్య డాక్టర్ జాగృతి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, వాళ్లకు కోర్టు కస్టడీ విధించడంతో పోలీసు స్టేషన్ సెల్‌లోకి వెళ్లారు. అంతే, కథ మారిపోయింది. ఆ దంపతులిద్దరికీ రాచ మర్యాదలు దొరుకుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అక్కడి పోలీసులే చెబుతున్నారు. చాణక్యపురి పోలీసు స్టేషన్‌లోని వేర్వేరు గదుల్లో వారిద్దరినీ ఉంచారు. వాళ్లు తమ ఇంటి నుంచి భోజనం తెప్పించుకుని హాయిగా తింటున్నారు. అంతేకాదు, ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధనుంజయ్ సింగ్‌కి ఏకంగా ఓ ఎస్ఐకి చెందిన రెస్ట్ రూం ఇచ్చేశారు. ఆయన భార్యనైతే అంతకంటే ఘనంగా.. ఏసీపీ ఉపయోగించే రెస్ట్ రూంలో ఉంచారు. సాధారణంగా అయితే ఇలాంటి ఖైదీలను లాకప్‌లో ఉంచుతారు, ఇంటినుంచి భోజనాన్ని కూడా అనుమతించరు. మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి తెప్పించుకుంటున్నా.. వాళ్లకు రాత్రి భోజనం మాత్రం పోలీసు క్యాంటీన్ నుంచి తెప్పిస్తున్నారు. వారిని విచారిస్తుండగా జాగృతి ఓ సమయంలో ఏడ్చేశారని, ఇప్పుడు మళ్లీ మామూలుగా ఉన్నారని, పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్నారని స్టేషన్ వర్గాలు తెలిపాయి. ఎంపీగారు మాత్రం అసలు మాట్లాడితే నోటివెంట ముత్యాలు రాలిపోతాయన్నట్లుగా ఊరుకుంటున్నారట. చాలావరకు సీనియర్ అధికారులతో మాత్రమే మాట్లడతారని పోలీసువర్గాలు చెప్పాయి. పైపెచ్చు, ఇంత జరిగినా వాళ్లిద్దరిలో ఎక్కడా పశ్చాత్తాపం అన్నది మచ్చుకు కూడా కనిపించడంలేదు. పనిమనిషి రాఖీ (35), రాంపాల్ ఇద్దరినీ జాగృతి ఆదివరం రాత్రి ఏదో చిన్న విషయంలో పొరపాటు జరిగిందని ఇనుప రాడ్, కర్రలతో తీవ్రంగా కొట్టారని, వాళ్లను కొట్టేటప్పుడు ఓ ఇస్త్రీ పెట్టె, చనిపోయిన జంతువు కొమ్ములు కూడా ఉపయోగించారని పోలీసులు తెలిపారు. దాంతో వారిద్దరికీ తీవ్రగాయాలు కాగా, రాఖీ మరణించింది. పోలీసులు వారిని తీసుకెళ్లినా, అక్కడ మాత్రం స్టేషన్లో రాచమర్యాదలే అందిస్తున్నారు. -
పనిమనిషి హత్య కేసు పోలీస్ కస్టడీకి బీఎస్పీ ఎంపీ, భార్య
న్యూఢిల్లీ: పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్‌సింగ్, ఆయన భార్య జాగృతిలను స్థానిక న్యాయస్థానం బుధవారం ఐదురోజులపాటు పోలీస్ కస్టడీకి ఆదేశించింది. వీరిపై మోపిన అభియోగాల తీవ్రత కారణంగా కస్టడీకి ఆదేశించామని మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ధీరజ్ మిఠల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అన్ని రికార్డులను పరిశీలించడంతోపాటు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన పత్రాలను పరిగణ నలోకి తీసుకున్నానన్నారు. నిందితులకు ఐదు రోజులపాటు రిమాండ్ సబబేనన్నారు. అందువల్లనే వారిని ఈ నెల 11వ తేదీదాకా పోలీస్ కస్టడీకి ఆదేశించానన్నారు. నిందితులను వారంపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారన్నారు. సీసీటీవీ దృశ్యాలు తదితరాలను సేకరించాల్సి ఉందని తెలిపారన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ నియోజకవర్గానికి ధనంజయ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, స్థానిక ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో జాగృతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాఖీ భద్ర వీరి నివాసంలో పనిమనిషి. నివేదిక సమర్పించండి పనిమనిషి రాఖీ భద్ర హత్య ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ మహిళా హక్కుల కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) బుధవారం నగర పోలీసులను కోరింది. ఈ విషయాన్ని ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ మమతాశర్మ వెల్లడించారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ సదరు ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను కోరాం. అందాక తగు చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ‘ఆస్పత్రికి తరలిస్తే బతికేది’ బీఎస్పీ ఎంపీ ధనంజయ్‌సింగ్ పనిమనిషి రాఖీని సకాలంలో ఆస్పత్రికి తరలించినట్లయితే బతికేదని పత్యక్ష సాక్షులు తెలిపారు. ఎంపీ భార్య జాగృతి తీవ్రంగా కొట్టినందువల్లనే ఆమె మరణించినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యూపీలోని జౌన్ పూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ ఎంపీ ధనంజయ్‌సింగ్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలోని ఇంట్లో ఈ హత్య జరిగింది. ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం.. ఎంపీ భార్య జాగృతి తన ఇంటో ్లపనిచేస్తున్న పనివాళ్లను చిత్రహింసలు పెట్టేది. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడంతోపాటు చేతిలో ఏ వస్తువు ఉంటే దానితో వారిని చితకబాదేది. కుటుంబ కలహాల వల్ల కలిగిన కోపాన్ని పని వారిపై చూపింది. ఈ నెల రెండో తేదీన పనిమనిషి రాఖీని కొట్టడంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. చావుబతుకుల మధ్య ఉన్నప్పటికీ రాఖీని ఆస్పత్రి లో చేర్చలేదు. ప్రాథమిక చికిత్సతో సరిపెట్టారు.