బీఎస్పీ ఎంపీ దంపతులకు జైల్లో రాచమర్యాదలు!!
ఆయనో ఎంపీ. ఆవిడ డాక్టర్. వాళ్లిద్దరూ దంపతులు. సదరు భార్యామణి తీవ్రంగా కొట్టడంతో ఇంట్లో ఓ పనిమనిషి మరణించింది. మరో మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో సదరు బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్, ఆయన భార్య డాక్టర్ జాగృతి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, వాళ్లకు కోర్టు కస్టడీ విధించడంతో పోలీసు స్టేషన్ సెల్లోకి వెళ్లారు. అంతే, కథ మారిపోయింది. ఆ దంపతులిద్దరికీ రాచ మర్యాదలు దొరుకుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అక్కడి పోలీసులే చెబుతున్నారు. చాణక్యపురి పోలీసు స్టేషన్లోని వేర్వేరు గదుల్లో వారిద్దరినీ ఉంచారు. వాళ్లు తమ ఇంటి నుంచి భోజనం తెప్పించుకుని హాయిగా తింటున్నారు. అంతేకాదు, ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధనుంజయ్ సింగ్కి ఏకంగా ఓ ఎస్ఐకి చెందిన రెస్ట్ రూం ఇచ్చేశారు. ఆయన భార్యనైతే అంతకంటే ఘనంగా.. ఏసీపీ ఉపయోగించే రెస్ట్ రూంలో ఉంచారు.
సాధారణంగా అయితే ఇలాంటి ఖైదీలను లాకప్లో ఉంచుతారు, ఇంటినుంచి భోజనాన్ని కూడా అనుమతించరు. మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి తెప్పించుకుంటున్నా.. వాళ్లకు రాత్రి భోజనం మాత్రం పోలీసు క్యాంటీన్ నుంచి తెప్పిస్తున్నారు. వారిని విచారిస్తుండగా జాగృతి ఓ సమయంలో ఏడ్చేశారని, ఇప్పుడు మళ్లీ మామూలుగా ఉన్నారని, పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్నారని స్టేషన్ వర్గాలు తెలిపాయి. ఎంపీగారు మాత్రం అసలు మాట్లాడితే నోటివెంట ముత్యాలు రాలిపోతాయన్నట్లుగా ఊరుకుంటున్నారట. చాలావరకు సీనియర్ అధికారులతో మాత్రమే మాట్లడతారని పోలీసువర్గాలు చెప్పాయి. పైపెచ్చు, ఇంత జరిగినా వాళ్లిద్దరిలో ఎక్కడా పశ్చాత్తాపం అన్నది మచ్చుకు కూడా కనిపించడంలేదు.
పనిమనిషి రాఖీ (35), రాంపాల్ ఇద్దరినీ జాగృతి ఆదివరం రాత్రి ఏదో చిన్న విషయంలో పొరపాటు జరిగిందని ఇనుప రాడ్, కర్రలతో తీవ్రంగా కొట్టారని, వాళ్లను కొట్టేటప్పుడు ఓ ఇస్త్రీ పెట్టె, చనిపోయిన జంతువు కొమ్ములు కూడా ఉపయోగించారని పోలీసులు తెలిపారు. దాంతో వారిద్దరికీ తీవ్రగాయాలు కాగా, రాఖీ మరణించింది. పోలీసులు వారిని తీసుకెళ్లినా, అక్కడ మాత్రం స్టేషన్లో రాచమర్యాదలే అందిస్తున్నారు.