పనిమనిషి హత్య కేసు పోలీస్ కస్టడీకి బీఎస్‌పీ ఎంపీ, భార్య
Published Wed, Nov 6 2013 11:25 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
న్యూఢిల్లీ: పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్‌పీ ఎంపీ ధనంజయ్‌సింగ్, ఆయన భార్య జాగృతిలను స్థానిక న్యాయస్థానం బుధవారం ఐదురోజులపాటు పోలీస్ కస్టడీకి ఆదేశించింది. వీరిపై మోపిన అభియోగాల తీవ్రత కారణంగా కస్టడీకి ఆదేశించామని మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ధీరజ్ మిఠల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అన్ని రికార్డులను పరిశీలించడంతోపాటు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన పత్రాలను పరిగణ నలోకి తీసుకున్నానన్నారు. నిందితులకు ఐదు రోజులపాటు రిమాండ్ సబబేనన్నారు. అందువల్లనే వారిని ఈ నెల 11వ తేదీదాకా పోలీస్ కస్టడీకి ఆదేశించానన్నారు. నిందితులను వారంపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారన్నారు. సీసీటీవీ దృశ్యాలు తదితరాలను సేకరించాల్సి ఉందని తెలిపారన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ నియోజకవర్గానికి ధనంజయ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, స్థానిక ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో జాగృతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాఖీ భద్ర వీరి నివాసంలో పనిమనిషి.
నివేదిక సమర్పించండి
పనిమనిషి రాఖీ భద్ర హత్య ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ మహిళా హక్కుల కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) బుధవారం నగర పోలీసులను కోరింది. ఈ విషయాన్ని ఎన్‌సీడబ్ల్యూ చైర్ పర్సన్ మమతాశర్మ వెల్లడించారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ సదరు ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను కోరాం. అందాక తగు చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
‘ఆస్పత్రికి తరలిస్తే బతికేది’
బీఎస్పీ ఎంపీ ధనంజయ్‌సింగ్ పనిమనిషి రాఖీని సకాలంలో ఆస్పత్రికి తరలించినట్లయితే బతికేదని పత్యక్ష సాక్షులు తెలిపారు. ఎంపీ భార్య జాగృతి తీవ్రంగా కొట్టినందువల్లనే ఆమె మరణించినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యూపీలోని జౌన్ పూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ ఎంపీ ధనంజయ్‌సింగ్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలోని ఇంట్లో ఈ హత్య జరిగింది. ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం.. ఎంపీ భార్య జాగృతి తన ఇంటో ్లపనిచేస్తున్న పనివాళ్లను చిత్రహింసలు పెట్టేది. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడంతోపాటు చేతిలో ఏ వస్తువు ఉంటే దానితో వారిని చితకబాదేది. కుటుంబ కలహాల వల్ల కలిగిన కోపాన్ని పని వారిపై చూపింది. ఈ నెల రెండో తేదీన పనిమనిషి రాఖీని కొట్టడంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. చావుబతుకుల మధ్య ఉన్నప్పటికీ రాఖీని ఆస్పత్రి లో చేర్చలేదు. ప్రాథమిక చికిత్సతో సరిపెట్టారు.
Advertisement