బీఎస్పీ ఎంపీకి నో బెయిల్
Published Thu, Nov 21 2013 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
న్యూఢిల్లీ: పనిమనిషిని హింసించి, చంపారనే కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ భార్యతోపాటు అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ కేసులో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను మాయం చేశారని ఆరోపిస్తూ ఆయనకు బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు ధనంజయ్‌కు బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ‘గత అనుభవాల దృష్ట్యా ధనంజయ్ విషయంలో ఎటువంటి అవకాశం తీసుకోలేం. జరుగుతున్న సంఘటనల దృష్ట్యా నిందితుడు ధనంజయ్ సింగ్‌కు బెయిల్ ఇవ్వలేం. ఈ కేసులో సాక్షులు రామ్‌లాల్, మీనాలు బలహీనులు.
వారికి బలవంతుడైన ధనంజయ్ నుంచి రక్షణ కల్పించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (న్యూఢిల్లీ) ఎస్‌బీఎస్ త్యాగిని ఆదేశిస్తున్నాం. ఈ తీర్పుకు సంబంధించిన ఓ కాపీని డీసీపీకి పంపాల’ని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి గోమతి మనోచా వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ధనంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. పనిమనిషి రాఖీని హత్య చేసిన కేసులో ఆయన భార్య జాగృతి అరెస్టుకాగా అందుకు సంబంధించిన సాక్ష్యాలను, సీసీటీవీ కెమెరా దృశ్యాలను మాయం చేసిన కేసులో ధనంజయ్ అరెస్టయ్యాడు. జాగృతిపై హత్య, హత్యాయత్నం, బాల నాయ్య చట్టం ఉల్లంఘన కేసులు నమోదు కాగా ధనంజయ్‌పై కూడా భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు.
Advertisement